ఒకే సమస్యపై పదేపదే వినతులు
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:55 PM
ఒకే సమస్యకు సంబంధించి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)’లో ప్రజలు పలుమార్లు అర్జీలు ఇస్తున్నారని, ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులకు స్పష్టం చేశారు.
పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే
పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి కలెక్టరేట్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఒకే సమస్యకు సంబంధించి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)’లో ప్రజలు పలుమార్లు అర్జీలు ఇస్తున్నారని, ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పీజీఆర్‌ఎస్‌కు 131, రెవెన్యూ క్లినిక్‌కు 159 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలకు సంబంధించిన సమస్యలను నిర్ణీత గడువులోగా ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో...
అనకాపల్లి రూరల్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశమందిరంలో సోమవారం ఎస్పీ తుహిన్ సిన్హా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ తగాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, తదితర వాటికి సంబంధించి మొత్తం 42 అర్జీలు/ ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అర్జీదారులకు వేగవంతంగా సేవలందించడమే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు ఇచ్చిన అర్జీల్లోని సమస్యలు, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడానికి సంబంధిత పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.