Share News

పదే పదే తప్పులు...

ABN , Publish Date - Apr 11 , 2026 | 01:26 AM

అప్పన్న చందనోత్సవం ఏటా ఏదో ఒక గుణపాఠం నేర్పుతూనే ఉంది.

పదే పదే తప్పులు...

అప్పన్న భక్తుల తిప్పలు

చందనోత్సవంలో ఏటా లోపాలు బహిర్గతం

సరిదిద్దుకోని అధికారగణం

టికెట్ల విక్రయం పెద్ద మాయాజాలం

ఉత్సవంలో పోలీసులదే రుబాబు

టికెట్లు లేనివారంతా వీఐపీ క్యూలైన్లలోనే కొందరిని పక్కన పెట్టకపోతే ఈ ఏడాది కూడా పునరావృతం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అప్పన్న చందనోత్సవం ఏటా ఏదో ఒక గుణపాఠం నేర్పుతూనే ఉంది. కానీ దేవస్థానం అధికారుల్లో వీసమెత్తు మార్పు కూడా ఉండడం లేదు. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ల (ఈఓ)లను డమ్మీ చేసి కొందరు ఉన్నతస్థాయి అధికారులు, పాతుకుపోయిన సిబ్బంది చక్రం తిప్పుతున్నారు. కలెక్టర్‌ ఆదేశాలను సైతం బుట్టదాఖలు చేస్తున్నారు.

చందనోత్సవం రోజున దర్శనానికి సంబంధించి ముద్రించే టికెట్లకు, విక్రయించే టికెట్లకు పొంతన ఉండడం లేదు. లెక్కలు కూడా తప్పుల తడకలే. ఉత్సవం జరిగే రాత్రి 11 గంటల వరకు ఈ టికెట్ల విక్రయం కొనసాగిస్తున్నారు. వీవీఐపీలు అనుకునే వారిని కూడా లెక్క చేయడం లేదు. దాతలకు కూడా మర్యాద ఇవ్వడం లేదు. ఈ విషయంలో అక్కడి ఏఈఓలు కొందరు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకులో విక్రయానికి పెట్టిన టికెట్లను వారే దగ్గరుండి బ్లాక్‌ చేస్తున్నారు. గతంలో నాలుగు వీవీఐపీ టికెట్లను, కారు పాస్‌ను కలిపి రూ.20 వేలు చొప్పున అమ్ముకున్నారు.

రాజకీయ నాయకులను, తెలిసిన వారిని టికెట్లు లేకుండానే వీవీఐపీల మార్గంలో పంపుతుంటారు. టికెట్లను తనిఖీ చేయకపోవడం వల్ల వాటిని మళ్లీ ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవదాయ సిబ్బందికి కేటాయించిన విధులకు వెళ్లకుండా (డ్యూటీ పాయింట్లు) పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. పోలీసు అధికారులు కొందరు అంతరాలయంలో డ్యూటీకి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. అక్కడ ఉంటే తమ వారిని సులువుగా దర్శనాలు చేయించుకోవచ్చునని కొందరు అక్కడే తిష్ఠ వేస్తున్నారు.

2023లో చందనోత్సవం వైఫల్యంపై నాటి జేసీ విశ్వనాథ్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ముగ్గురు ప్రధాన అధికారులే కారణమని వెల్లడించారు. వారిలో ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వాలు కమిటీలు వేయడమే తప్ప చర్యలు తీసుకోవని తెలియడం వల్లనే పొరపాట్లు పునరావృతం అవుతున్నాయి. ఇప్పుడైనా వారిని గుర్తించి పక్కన పెట్టాల్సి ఉంది.

ఈ ఏడాది ఉత్సవంపై మంత్రులు శనివారం సమావేశం నిర్వహిస్తున్నందున గత లోపాలు పునరావృతం కాకుండా చూడాల్సి ఉంది. దేవస్థానంలో ఆరోపణలు ఉన్నవారికి అప్రాధాన్య విధులు అప్పగించాల్సి ఉంది. ముఖ్యంగా కొందరు టికెట్ల విక్రయాలపై ఇప్పటికే ప్లాన్‌లు సిద్ధం చేసుకున్నారు. వారిని టికెట్ల విక్రయ బాధ్యతల నుంచి దూరంగా పెట్టాల్సి ఉంది. వాహనాల పాస్‌లు కూడా దుర్వినియోగం అవుతున్నాయి. పాస్‌లు లేని వాహనాలే కొండపై ఎక్కువ తిరుగుతున్నాయి. అది ఎలా సాధ్యమవుతుందో పోలీసు పెద్దలు చూడాలి. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించే వాతావరణం ఉండాలి. విధులకు అడ్డం పడే వారిని వెంటనే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలి. కండిషన్‌లో లేని వాహనాలకు కొండపైకి ఎక్కే అవకాశమే ఇవ్వకూడదు. పాస్‌ కోరిన ప్రతి వాహనం ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ సమర్పించేలా చూడాలి. ఆర్టీసీ బస్సులను సైతం కండిషన్‌లో ఉన్నవే నడపాలి.


చందనోత్సవ నిర్వహణపై నేడు మంత్రుల భేటీ

కలెక్టరేట్‌లో సమావేశం

అనంతరం క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల పరిశీలన

విశాఖపట్నం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి):

ఈనెల 20వ తేదీన జరగనున్న సింహాచలం వరాహ నృసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లపై నలుగురు మంత్రులు శనివారం ఉదయం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌కిషోర్‌, దేవదాయశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. గత ఏడాది జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మంత్రులు శనివారం ఉదయం విజయవాడలో బయలుదేరి 10.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు స్వయంగా చందనోత్సవ ఏర్పాట్లు పరిశీలించనున్నారు.

Updated Date - Apr 11 , 2026 | 01:26 AM