రచయిత, అరసం నేత ఆచార్య చందు సుబ్బారావు కన్నుమూత
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:06 AM
ప్రముఖ రచయిత, అభ్యుదయ రచయితల సంఘం(అరసం) నేత, ఏయూ విశ్రాంత ఆచార్యుడు చందు సుబ్బారావు(80) గురువారం కన్నుమూశారు..
విశాఖపట్నం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత, అభ్యుదయ రచయితల సంఘం(అరసం) నేత, ఏయూ విశ్రాంత ఆచార్యుడు చందు సుబ్బారావు(80) గురువారం కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా చదలవాడలో 1946 మే 18న సుబ్బారావు జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అదే విశ్వవిద్యాలయంలో 1974లో అధ్యాపకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, రీడర్‌గా, జియో ఫిజిక్స్ విభాగంలో ఆచార్యునిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. 1979-1982 మధ్య అరసం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. సాహిత్యంలో తనదైన శైలిలో అనేక రచనలు చేశారు. సైన్స్ అండ్ సివిలైజేషన్, ‘కవికి విమర్శకుడు శత్రువు కాదు’... వంటి రచనలు ప్రాచుర్యం పొందాయి. శ్రీశ్రీపై ఆయన చేసిన రచనలు హిందీలోకి అనువదించారు. తాపీ ధర్మారావు అవార్డు సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యాన్ని ఒక కోర్సుగా పెట్టాలనే ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన మరణవార్త తెలియగానే ఆచార్య కేఎస్ చలం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరసం రాష్ట్ర నాయకులు ఉప్పల అప్పలరాజు, ఏఎంఆర్ ఆనంద్, కొమ్మాలపాటి శరత్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రి, అవంతి విద్యా సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు.