Share News

అటకెక్కిన రెండరింగ్‌ ప్లాంటు!

ABN , Publish Date - Aug 20 , 2026 | 01:24 AM

ప్రజారోగ్యానికి తూట్లు పొడిచేలా చికెన్‌ వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తున్న కాంట్రాక్లర్లకు జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చికెన్‌ వ్యర్థాలను పర్యావరణ హితంగా పునర్వినియోగం చేసేలా ‘రెండరింగ్‌ ప్లాంటు’ ఏర్పాటుకు గతంలో జీవీఎంసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు రాజమండ్రిలో ప్లాంటు ఏర్పాటుచేసిన సంస్థ ఆసక్తిచూపింది. ఆ తర్వాత ఏం జరిగిందోగానీ...ప్లాంటు ఊసెత్తడం లేదు.

అటకెక్కిన  రెండరింగ్‌ ప్లాంటు!

జంతు వ్యర్థాల పునర్వినియోగ కర్మాగారం ఏర్పాటుకు ప్రతిపాదనకు బ్రేక్‌

చికెన్‌ వ్యర్థాల కాంట్రాక్టర్లకు జీవీఎంసీ ప్రజారోగ్యం అధికారుల అండదండలు

చేపల చెరువులకు తరలించుకునేలా పరోక్ష సహకారం

కమిషనర్‌ దృష్టిసారించాలి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రజారోగ్యానికి తూట్లు పొడిచేలా చికెన్‌ వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తున్న కాంట్రాక్లర్లకు జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చికెన్‌ వ్యర్థాలను పర్యావరణ హితంగా పునర్వినియోగం చేసేలా ‘రెండరింగ్‌ ప్లాంటు’ ఏర్పాటుకు గతంలో జీవీఎంసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు రాజమండ్రిలో ప్లాంటు ఏర్పాటుచేసిన సంస్థ ఆసక్తిచూపింది. ఆ తర్వాత ఏం జరిగిందోగానీ...ప్లాంటు ఊసెత్తడం లేదు.

నగరంలో చికెన్‌ దుకాణాల నుంచి వ్యర్థాలను జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలతో సేకరించి కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలించేవారు. ఆ తర్వాత దీనిని కాంట్రాక్టర్లకు అప్పగించారు. రవాణా ఖర్చులు, సిబ్బందికి జీతాల కోసం కాంట్రాక్టర్లకు కొంత మొత్తం చెల్లిస్తున్నారు. అయితే చికెన్‌ వ్యర్థాలను కాపులుప్పాడ డంపింగ్‌ యార్డుకు కాకుండా కాంట్రాక్టర్లు చేపల చెరువులకు సరఫరా చేయడం మొదలెట్టారు. చేపల చెరువుల రైతులు నేరుగా చికెన్‌ వ్యర్థాలను సేకరించే వారిని సంప్రదించి డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో చికెన్‌ వ్యర్థాలకు భారీగా డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. చికెన్‌ వ్యర్థాల సేకరణ ఒక ఆదాయ వనరుగా మారడంతో జీవీఎంసీ పిలిచే టెండర్లకు పోటీ పెరిగింది. చివరకు రాజకీయ నేతలను కలిసి కాంట్రాక్టు తమకే వచ్చేలా చూడాలంటూ అధికారులపై ఒత్తిడి చేసే పరిస్థితికి చేరింది. చికెన్‌ వ్యర్థాలను తిన్న చేపలను ఆహారంగా తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించడంతో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండేళ్ల కిందట కమిషనర్‌గా పనిచేసిన సంపత్‌కుమార్‌ చికెన్‌ వ్యర్థాలను నేరుగా కాపులుప్పాడ డంపింగ్‌ యార్డుకే తరలించాలని ఆదేశించారు. పర్యావరణానికి హాని కలగకుండా అక్కడ చికెన్‌ వ్యర్థాలను పునర్వినియోగం చేసుకునేందుకు వీలుగా రెండరింగ్‌ ప్లాంటును ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు.

ప్రతిపాదన దశలోనే...

జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు రాజమండ్రి వెళ్లి అక్కడ ఉన్న రెండరింగ్‌ ప్లాంటు పనితీరును పరిశీలించి, సంతృప్తి వ్యక్తంచేశారు. దీంతో నగరంలో కూడా ప్లాంటు ఏర్పాటుచేయాలని అప్పటి కమిషనర్‌ సంపత్‌కుమార్‌కు నిర్ణయించారు. రాజమండ్రి ప్లాంట్‌ నిర్వాహకుడిని పిలిచి అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. ప్లాంటు ఏర్పాటైతే చికెన్‌ వ్యర్థాలను చేపల చెరువులకు అమ్ముకునేందుకు వీలుండదని, అలాగైతే తమ ఆదాయం పోతుందనే భావనతో జీవీఎంసీ అధికారులను కొందరు కాంట్రాక్టర్లు ప్రసన్నం చేసుకున్నారు. ప్లాంటు ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. దీనికి అధికారులు కూడా తమ అంగీకారం తెలుపుతూ ప్లాంట్‌ ఏర్పాటు అవసరాన్ని కమిషనర్‌కు గుర్తుచేయకుండా పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ రెండరింగ్‌ ప్లాంటు ఏర్పాటుపై దృష్టిసారించాలని. అప్పటివరకూ చికెన్‌ వ్యర్థాలు చేపల చెరువులకు తరలించకుండా చర్యలు తీసుకోవాలి.

Updated Date - Aug 20 , 2026 | 01:24 AM