Share News

సెల్లార్లలో నిర్మాణాల తొలగింపు

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:42 AM

సెల్లార్‌లలో ఆక్రమణల తొలగింపునకు ‘ఆపరేషన్‌ లంగ్స్‌ 3.0’ పేరుతో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించారు.

సెల్లార్లలో నిర్మాణాల తొలగింపు

ఆపరేషన్‌ లంగ్స్‌ 3.0 పేరుతో జీవీఎంసీ స్పెషల్‌డ్రైవ్‌

సెల్లార్లు వాహనాల పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలని ఆదేశం

విశాఖపట్నం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):

సెల్లార్‌లలో ఆక్రమణల తొలగింపునకు ‘ఆపరేషన్‌ లంగ్స్‌ 3.0’ పేరుతో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించారు. సోమవారం నగరంలో పలుచోట్ల వాణిజ్య భవనాల సెల్లార్లలో ఆక్రమణలను టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది తొలగించారు. ఫుట్‌పాత్‌లు, సెల్లార్‌ల ఆక్రమణల కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు అందుతుండడంతో స్పెషల్‌డ్రైవ్‌కు కమిషనర్‌ ఆదేశించారు. సెల్లార్లలో కేవలం వాహనాల పార్కింగ్‌ మాత్రమే జరిగేలా చూడాలని, ఇతర అవసరాలకు వాడుతున్నట్టయితే నిర్మాణాలను తొలగించాలని స్పష్టంచేశారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు సీసీపీ ప్రభాకరరావు ఆధ్వర్యంలో సౌత్‌ జోన్‌లోని 31వ వార్డు పరిధి డాబాగార్డెన్స్‌లో ఒక వాణిజ్య భవనం, 17వ వార్డు (ఈస్ట్‌జోన్‌) పరిధి ఎంవీపీ కాలనీ సెక్టార్‌-1లో ఒక అపార్టుమెంట్‌, 90వ వార్డు (వెస్ట్‌జోన్‌) గవరవీధిలో రెండు దుకాణాలు, 91వ వార్డు బుచ్చిరాజుపాలెం మెయిన్‌రోడ్డులో ఒక అపార్టుమెంట్‌, గాజువాక మెయిన్‌రోడ్డు, 66వ వార్డు పరిధిలో షాపింగ్‌మాల్స్‌ సెల్లార్‌లలో షట్టర్లు, గోడలను తొలగించి పార్కింగ్‌కు వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. ఇకపై కూడా సెల్లార్లలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని సీసీపీ స్పష్టంచేశారు.


పర్యాటక ప్రాజెక్టులకు భూముల పరిశీలన

రాయితీ ధరతో భూములు ఇవ్వాలని కోరిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):

పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు చేసుకున్న వారికి అధికారులు సోమవారం వీఎంఆర్‌డీఏ భూములను చూపించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పర్యాటక శాఖాధికారులు అందుబాటులో ఉన్న భూముల వివరాలు కావాలని కోరగా, వీఎంఆర్‌డీఏ అధికారులు సుమారు 30 స్థలాలను ఎంపిక చేశారు. వాటి విస్తీర్ణం, సౌకర్యాలు అన్నీ వివరించారు. ఈ నేపథ్యంలో సంస్థల ప్రతినిధుల క్షేత్రస్థాయి పరిశీలన కోసం సోమవారం పర్యాటక శాఖ అధికారులు బస్సును ఏర్పాటుచేశారు. సుమారుగా 15 మంది వారి సొంత కార్లలో వెళ్లారు. భీమిలి సమీపాన కొత్తవలసలో గల కొండ, బావికొండ సమీపాన, కాపులుప్పాడ, మధురవాడ తదితర ప్రాంతాల్లో భూములను వీఎంఆర్‌డీఏ అధికారులు చూపించారు. అయితే అవన్నీ చాలా దూరంగా ఉన్నాయని, కొన్నింటికి రహదారులు కూడా లేవని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తెలిపారు. వీఎంఆర్‌డీఏ భూములను మార్కెట్‌ రేటుకు వేలం పెట్టి విక్రయిస్తుందని, ఆ విధంగా చేస్తే తాము ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేమని, రాయితీ ధరతో ఇస్తే ఏమైనా చేయగలుగుతామని, ఆ దిశగా జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని వారు కోరారు.

Updated Date - Feb 24 , 2026 | 01:42 AM