Share News

భీమిలి బీచ్‌రోడ్డులో స్పీడ్‌ బ్రేకర్ల తొలగింపు

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:59 AM

భోగాపురం విమానాశ్రయం జూలైలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడకు చేరుకోవడానికి అనువైన మార్గాలన్నింటినీ జిల్లా అధికారులు సిద్ధం చేస్తున్నారు. విశాఖ నుంచి భీమిలి బీచ్‌రోడ్డులో చాలామంది విమానాశ్రయానికి వెళ్లే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.

భీమిలి బీచ్‌రోడ్డులో స్పీడ్‌ బ్రేకర్ల తొలగింపు
విశాఖపట్నం-భీమిలి మార్గంలో అడ్డంకిగా మారిన స్పీడ్‌ బ్రేకర్లను తొలగించిన దృశ్యం.

భోగాపురం విమానాశ్రయానికి త్వరగా చేరుకునేందుకే...

అయితే గొయ్యిలా తవ్వి వదిలేశారంటున్న వాహన చోదకులు

విశాఖపట్నం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): భోగాపురం విమానాశ్రయం జూలైలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడకు చేరుకోవడానికి అనువైన మార్గాలన్నింటినీ జిల్లా అధికారులు సిద్ధం చేస్తున్నారు. విశాఖ నుంచి భీమిలి బీచ్‌రోడ్డులో చాలామంది విమానాశ్రయానికి వెళ్లే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. అయితే ఆ మార్గంలో పలువురు అత్యధిక వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని, వాటిని నియంత్రించేందుకు ఎక్కడికక్కడ ఎక్కువ సంఖ్యలో స్పీడ్‌ బ్రేకర్లు నిర్మించారు. వాటి వల్ల ప్రయాణం ఆలస్యం అవుతుందని, అవసరం లేని ప్రాంతాల్లో కొన్నింటిని తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు జీవీఎంసీ అధికారులు లాసన్స్‌ బే కాలనీ మొదలుకొని రుషికొండ వరకు పలు స్పీడ్‌ బ్రేకర్లను గత రెండు రోజులుగా తొలగిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో గతంలో కంటే మరింత నెమ్మదిగా ఇప్పుడు వాహనాలు నడపాల్సి వస్తోందని వాహన చోదకులు వాపోతున్నారు. గొయ్యిలా తవ్వి వదిలేశారని, దాంతో ఆగి ఆగి వెళ్లాల్సి వస్తోందని, త్వరగా వాటిని పూడ్చి సాధారణ మార్గంలా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jun 18 , 2026 | 12:59 AM