ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగింపు
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:21 AM
సబ్బవరం మండలం గంగవరం గ్రామంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను, సిమెంట్ స్తంభాలను తొలగించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ బి.చిన్నికృష్ణ మాట్లాడుతూ, గంగవరం సర్వే నంబరు 38/3, 38/4లలో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు.
గంగవరంలో ఆరు ఎకరాలు స్వాధీనం
సబ్బవరం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : సబ్బవరం మండలం గంగవరం గ్రామంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను, సిమెంట్ స్తంభాలను తొలగించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ బి.చిన్నికృష్ణ మాట్లాడుతూ, గంగవరం సర్వే నంబరు 38/3, 38/4లలో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. గతంలో ప్రభుత్వం ఈ భూమిని పేద రైతులను పంపిణీ చేసి డి.పట్టాలు మంజూరు చేసిందని చెప్పారు. అయితే పట్టాలు పొందిన వారు ఈ భూమిలో వ్యవసాయం చేయకుండా వేరే వ్యక్తులకు విక్రయించినట్టు ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటిపై క్షేతస్థాయిలో విచారణ చేపట్టగా, పట్టాదారులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డి.పట్టాలను రద్దు చేసి, భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామని, అయితే ఈ భూములను అక్రమంగా కొనుగోలు చేసిన వ్యక్తులు బోర్డును తొలగించి, చుట్టూ ఫెన్సింగ్ వేశారని పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు రావడంతో గురువారం ఎక్స్‌కవేటర్‌తో ఫెన్సింగ్, సిమెంట్ స్తంభాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇది ప్రభుత్వం భూమి అని, ఇతరులు ఎవరైనా ఇందులోకి ప్రవేశించినా, ఆక్రమించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ బీ.వీరయ్య, వీఆర్వో రాంబాబు, వీఆర్‌ఏ రమేశ్ పాల్గొన్నారు.