2,39,146 ఓట్లు తొలగింపు
ABN , Publish Date - Jul 25 , 2026 | 01:07 AM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది.
ఇందులో మృతులు 53,982 మంది
ఆచూకీలేనివారు 30,751 మంది
వలసవెళ్లినవారు 1,13,811 మంది
డూప్లికేటు ఓటర్లు 39,304 మంది
ఇతరులు 1,298
నేడు అధికారికంగా వెల్లడి
ముగిసిన సర్ ప్రక్రియ
విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. జిల్లాలో 2,39,146 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు వెనక్కి రాలేదు. ఆగస్టు ఒకటో తేదీన విడుదల చేయనున్న ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించనున్నారు. ఇందులో మృతులు 53,982 మంది, ఆచూకీలేనివారు (ఆబ్సెంట్) 30,751 మంది, శాశ్వతంగా వలసవెళ్లిన ఓటర్లు 1,13,811 మంది, డూప్లికేటు ఓటర్లు 39,304 మంది, ఇతరులు 1,298 మంది ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే అధికారికంగా వివరాలు శనివారం ప్రకటించనున్నారు.
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 20,23,009 మంది ఓటర్లు ఉన్నారు. ‘సర్’ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరుకు ఆయా పోలింగ్ బూత్‌లకు చెందిన అధికారులు (బీఎల్‌వోలు) ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. నిర్ణీత గడువులోగా ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని పూరించి వెనక్కి ఇవ్వాలి. అయితే పలు కారణాలతో జిల్లాలో 2,39,146 మంది నుంచి ఫారాలు వెనక్కి రాలేదు. మొత్తం 20,23,009 మందిలో 2,39,146 మంది (11.82 శాతం) ఎన్యుమరేషన్ ఫారాలను వెనక్కి ఇవ్వలేదని జిల్లా యంత్రాంగం గుర్తించింది. వీరిలో శాశ్వతంగా వలసవెళ్లిన వారు అత్యధికంగా అంటే 1,13,811 మంది (5.36 శాతం) ఉన్నారు. ఇంకా చనిపోయినవారు 53,982 మంది (2.67 శాతం), ఆచూకీలేని వారు 30,751 మంది (1.52 శాతం), డూప్లికేట్లు (డబుల్ ఎంట్రీలు) 39,304 మంది (1.94 శాతం), ఇతరులు 1,298 (0.06 శాతం) ఉన్నారు. నిర్ణీత గడువులోగా ఎన్యుమరేషన్ ఫారం వెనక్కి ఇవ్వకపోతే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు ఉండదు. ఈ నేపథ్యంలో ఆ 2,39,146 మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్నారు. తాత్కాలికంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వలస వచ్చిన కూలీలు నగరంలో కంటే సొంతూళ్లలో ఓటు ఉంచుకునేందుకు మొగ్గు చూపడంతో ఇక్కడ ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వలేదు. భీమిలి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో ఎన్యుమరేషన్ ఫారాలు భారీసంఖ్యలో తిరిగి రాలేదు. కాగా ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చిన వారిలో 39,898 మంది (1.97 శాతం) వివరాలు ఇంకా మ్యాపింగ్ కాలేదు. అంటే వారికి 2002లో ఎక్కడ ఓటు హక్కు ఉందనే వివరాలు ఫారంలో పొందుపరచలేదు. అయితే వీరి పేర్లు ముసాయిదా జాబితాలో చేర్చి నోటీసులు ఇస్తారు. ఇదిలావుండగా మరో రెండు లక్షల మంది ఓటర్లు ఇచ్చిన ఫారాల్లో పూర్తి సమాచారం లేదు. వీరికి నోటీసులు జారీచేస్తారు. అయితే జిల్లాలో సర్ ప్రక్రియపై అధికారికంగా వివరాలు శనివారం ప్రకటించనున్నారు.