దూరమైన భూసార పరీక్షలు
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:48 AM
పెదబొడ్డేపల్లిలోని నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐదేళ్ల క్రితం మూతపడిన భూసార పరీక్షా కేంద్రానికి ఇప్పటికీ మోక్షం కలగలేదు. ఈ ఏడాది కూడా ఖరీఫ్‌కు ముందు మట్టి నమూనా పరీక్షలు ఇక్కడ జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
నర్సీపట్నంలో ఐదేళ్ల క్రితం మూతపడిన కేంద్రం
ఏటా ఖరీఫ్‌కు ముందు అనకాపల్లికి మట్టినమూనాలు
ఫలితాల రాకలో తీవ్ర జాప్యం
నర్సీపట్నంలో పునరుద్ధరణకు ఏడాది క్రితం అధికారుల ప్రతిపాదనలు
ఇంతవరకు ప్రభుత్వం నుంచి లభించని ఆమోదం
నర్సీపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పెదబొడ్డేపల్లిలోని నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐదేళ్ల క్రితం మూతపడిన భూసార పరీక్షా కేంద్రానికి ఇప్పటికీ మోక్షం కలగలేదు. ఈ ఏడాది కూడా ఖరీఫ్‌కు ముందు మట్టి నమూనా పరీక్షలు ఇక్కడ జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందు ఏప్రిల్, మే నెలల్లో రైతులు తమ పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి, భూసార పరీక్షా కేంద్రాలకు తీసుకెళుతుంటారు. ఇక్కడి సిబ్బంది పరీక్షలు నిర్వహించి, నేలలో ఉన్న పోషకలోపాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ఏ పంటలు అనుకూలం వంటి వివరాలను తెలియజేస్తారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామంటూ నర్సీపట్నంలోని భూసార పరీక్షా కేంద్రాన్ని ఐదేళ్ల క్రితం మూసివేసింది. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన అగ్రి ల్యాబ్‌లోనే భూసార పరీక్షలు చేస్తారని అప్పట్లో అధికారులు ప్రకటించారు. కానీ ఇది అందుబాటులోకి రాలేదు. దీంతో నర్సీపట్నం ప్రాంతంలో రైతులు సేకరించిన మట్టి నమూనాలను అనకాపల్లిలోని జిల్లా భూసార పరీక్షా కేంద్రానికి పంపించి పరీక్షలు చేయించాల్సి వస్తున్నది. దీని వల్ల ఫలితాలు రావడంలో జాప్యం అవుతున్నది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ మార్కెట్ యార్డులో గతంలో మూతపడిన భూసార పరీక్షా కేంద్రాన్ని పునఃప్రారంభించడానికి వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇది జరిగి ఏడాది కావస్తున్నప్పటికీ ఆమోదం లభించలేదు.
వ్యవసాయ శాఖ నర్సీపట్నం ఏడీ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం మేరకు గత ఏడాది నర్సీపట్నం మండలంలో 912, గొలుగొండలో 850, రోలుగుంటలో 880, రావికమతంలో 1,210, వి.మాడుగులలో 1,390 మట్టి నమూనాలను సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా అనకాపల్లిలోని భూసార పరీక్షా కేంద్రానికి పంపించి పరీక్షలు చేయించారు. ఈ ఖరీఫ్ కూడా ఇలానే చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భూముల్లో మట్టిన నమూనాలను సేకరిస్తున్నారు. వచ్చే నెలలో మిగిలిన భూముల్లో మట్టి నమూనాలు సేకరిస్తామని వ్యవసాయ శాఖ సిబ్బంది చెబుతున్నారు.
భూసార పరీక్షలతో పలు ఉపయోగాలు
భూ సార పరీక్షల వల్ల ప్రయోజనాలు వున్నాయి. నేలలో సహజంగా ఉండే పోషకాల స్థాయిని తెలుసుకోచ్చు. వరినారు సిద్ధం చేసుకొని దమ్ము పట్టి నాట్లు వేయబోయే ముందు ఎంత మోతాదులో ఎరువులు వేయాలో తెలుస్తుంది. పరీక్షల లేకుండా మోతాదుకి మించి ఎరువులు వాడడం వల్ల పెట్టుబడి పెరిగి పోతుంది. అవసరానికి మంచి ఎరువులు వాడితే భూసారం మీద ప్రభావం పడుతుంది. అందువల్ల రైతులు భూసార పరీక్షలు చేయించుకుంటుంటారు.