పోలింగ్ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:06 AM
పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. శనివారం కౌంటింగ్ కేంద్రాన్ని, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన పరిశీలించారు. ఆర్డీవో వీవిరమణ, మునిసిపల్ కమిషనర్ సురేంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎస్పీ తుహిన్ సిన్హా
నర్సీపట్నం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. శనివారం కౌంటింగ్ కేంద్రాన్ని, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన పరిశీలించారు. ఆర్డీవో వీవిరమణ, మునిసిపల్ కమిషనర్ సురేంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. శనివారం రాత్రి డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా చూడాలన్నారు. ఉదయం పోలింగ్ మొదలైన దగ్గర నుంచి సాయంత్రం ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలోపు టెంట్లు, గుంపులుగా రాజకీయ నాయకులు ఉండకుండా చూడాలన్నారు. 200 మీటర్లలోపు వాహనాలు నిలపకూడదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో పీవో దగ్గర మాత్రమే సెల్‌ఫోన్ ఉంటుందని, ఇతరులు ఎవరి వద్ద ఉండకూడదని తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పీవో అనుమతి లేకుండా ఎవరూ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకూడదని చెప్పారు. ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇవ్వాలని సూచించారు. సాయంత్రం 5 వరకు క్యూలో ఉన్న ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని చెప్పారు. పోలింగ్ స్టేషన్‌లో పోలీసులకు పని లేదని, పీవో పిలిస్తేనే వెళ్లాలని చెప్పారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికల విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.