రేయింబవళ్లు సహాయక చర్యలు
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:47 AM
ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పలు చోట్ల కొండచరియలు, విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడడంతో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను రాత్రి, పగలు తేడా లేకుండా చేపట్టింది. ఎక్కడిక్కడ సహాయక బృందాలను అందుబాటులో ఉంచి, సమాచారం వచ్చిన వెంటనే తక్షణ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రోడ్లు, భవనాల శాఖ, విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటూ పనులు చేశారు.
- ఈదురుగాలులు, వర్షంలోనూ పనులు చేసిన సిబ్బంది
- పర్యవేక్షించిన అధికార యంత్రాంగం
పాడేరు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పలు చోట్ల కొండచరియలు, విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడడంతో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను రాత్రి, పగలు తేడా లేకుండా చేపట్టింది. ఎక్కడిక్కడ సహాయక బృందాలను అందుబాటులో ఉంచి, సమాచారం వచ్చిన వెంటనే తక్షణ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రోడ్లు, భవనాల శాఖ, విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటూ పనులు చేశారు.
జిల్లా కేంద్రంలో, ఘాట్ మార్గంలో చెట్లు కూలిన విషయం తెలుసుకున్న వెంటనే ఎలక్ర్టిక్ రంపాలతో వాటిని కోసి రోడ్డుకు అడ్డంగా ఉన్న వాటిని తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ వైర్లు తెగిపడడం వంటి ఘటనలను గుర్తించి విద్యుత్ శాఖ సిబ్బంది తక్షణమే ఆయా ప్రాంతాలకు చేరుకుని వైర్లను మార్చడం, పాత స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను వేయడం వంటివి చకచకా చేపట్టారు. ఈ క్రమంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే రోడ్డు దెబ్బతిన్న వెంటనే సంఘటనా స్థలాలకు చేరుకుని వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా భద్రతా చర్యలు చేపట్టారు. పాడేరు, కొయ్యూరు ప్రాంతంలో ఘాట్ మార్గాల్లో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ పర్యవేక్షిస్తుండగా, అనంతగిరి ఘాట్‌లో సబ్‌కలెక్టర్ కె.సాహిత్ పర్యవేక్షించారు. వరదలకు రోడ్లు, వీధులు అధ్వానంగా మారితే తక్షణమే పారిశుధ్య పనులు చేపట్టడడం, గెడ్డలు, వంతెనల వద్ద ప్రమాదాలు జరగకుండా పోలీసు, రెవెన్యూ, సచివాలయ సిబ్బందిని కాపలా పెట్టడడంతో గెడ్డల్లో ప్రమాదాలు జరగకుండా నియంత్రించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది భారీ వర్షాలు, ఈదురుగాలులకు సైతం లెక్కల చేయకుండా తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొనడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కలెక్టర్ టి.నిషాంతి, ఎస్పీ అమిత్‌బర్దార్, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, తదితరులు నిరంతరం కమాండ్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండడంతో జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
రంపుల ఘాట్‌లో...
చింతపల్లి: కృష్ణాదేవిపేట, చింతపల్లి జాతీయ రహదారి రంపుల ఘాట్‌లో తుఫాన్ వల్ల రహదారిపై పడిన వృక్ష శకలాలు, కొండచరియలను తొలగింపు పనులు వేగవంతం చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెదవలస నుంచి కాట్రగెడ్డ వరకు రహదారిపై పలు చోట్ల వృక్షాలు, కొండచరియలు పడిపోయాయి. రెవెన్యూ, జాతీయ రహదారుల అధికారులు వెనువెంటనే స్పందించి రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం నుంచి ఎక్స్‌కవేటర్‌తో జాతీయ రహదారుల అధికారులు వృక్ష శకలాలు, బండరాళ్లు, కొండచరియలను తొలగిస్తున్నారు. శుక్రవారం నాటికి రహదారిపై పడిన వృక్షాలు, బండరాళ్లు, కొండచరియలను పూర్తిగా తొలగిస్తామని, ప్రస్తుతం ఈ మార్గంలో రాకపోకలకు ఎటువంటి అంతరాయంలేదని అధికారులు తెలిపారు.