Share News

వర్షంతో ఊరట

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:51 AM

జిల్లాలోని పలు మండలాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం, దానిపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం పడింది. కొన్నిచోట్ల ముసురు వాతావరణం నెలకొని దఫదఫాలుగా జల్లులు పడుతున్నాయి.

వర్షంతో ఊరట
పరవాడలో వర్షం

పలు మండలాల్లో భారీ వర్షం

పొలాల్లో నిలిచిన నీరు

పంటలకు ఊపిరి పోసిందంటున్న అన్నదాతలు

ఖరీఫ్‌పై స్వల్పంగా చిగురించిన ఆశలు

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లాలోని పలు మండలాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం, దానిపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం పడింది. కొన్నిచోట్ల ముసురు వాతావరణం నెలకొని దఫదఫాలుగా జల్లులు పడుతున్నాయి. వాతావరణం చల్లబడడంతో గత వారం, పది రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు, ఎండ వేడితో అల్లాడుతున్న ప్రజలు ఉపశమనం చెందారు. కాగా గురువారం కురిసిన వర్షం ఖరీఫ్‌ పంటలను కొంతవరకు ఆదుకుంటుందని, అయితే భారీ వర్షాలు కురవాల్సిన అవసరం వుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

అనకాపల్లి పట్టణంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సుమారు 30 నిమిషాలపాటు అధిక మొత్తంలో వర్షం కురిసింది. డ్రైనేజీలు పొంగడంతో ఎన్టీఆర్‌ వైద్యాలయం, ఎన్టీఆర్‌ జంక్షన్‌ రోడ్డు, భీమునిగుమ్మం జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో రహదారులపై నీరు ప్రవహించింది.

పరవాడ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం సుమారు అరగంటపాటు భారీ వర్షం కురిసింది. కూరగాయల పంటలకు, వరి నారుమడులకు ఈ వర్షం ఊపిరి పోసిందని రైతులు చెబుతున్నారు. కె.కోటపాడు, పరిసర గ్రామాల్లో సుమారు గంటసేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. కూరగాయల పంటలకు మేలు చేస్తుందని ఆయా గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. చోడవరంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి దాదాపు గంటపాటు ఉరుములు, పిడుగులతో ఏకధాటిగా వర్షం కురిసింది. చోడవరంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనంపై పిడుగుపడింది. ఏసీ, ఫ్యాన్లతోపాటు, ల్యాబ్‌లో మూడు కంప్యూటర్లు కాలిపోయాయి. అదృష్టవశాత్తూ విద్యార్థులు, లెక్చరర్లకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు.

మాకవరపాలెం మండలంలో కురిసిన భారీ వర్షంతో పలుచోట్ల పొలాల్లో నీరు చేరింది. గ్రామాల్లో రహదారులు నీటమునిగాయి. నాట్లు వేసిన వరి పొలాలకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అన్నదాతలు చెబుతున్నారు. మాడుగుల, చీడికాడ మండలాల్లో భారీ వర్షం కురవగా, బుచ్చెయ్యపేట, గొలుగొండ, రాంబిల్లి, ఎలమంచిలి, ఎస్‌.రాయవరం మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.

Updated Date - Sep 11 , 2026 | 12:51 AM