Share News

22ఏ నుంచి విముక్తి

ABN , Publish Date - Aug 07 , 2026 | 01:02 AM

మధురవాడ సర్వే నంబర్‌ 359లో సుమారు మూడు దశాబ్దాల క్రితం వుడా లేఅవుట్‌ వేసి ప్లాట్లు విక్రయించింది.

22ఏ నుంచి విముక్తి

నిషేధిత జాబితా నుంచి తొలగించే అధికారం ఆర్డీవోలకు అప్పగింత

జిల్లాలో 200 దరఖాస్తులు బదలాయింపు

చెరువులు, గెడ్డల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణ సాధ్యం కాదంటున్న అధికారులు

విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):

మధురవాడ సర్వే నంబర్‌ 359లో సుమారు మూడు దశాబ్దాల క్రితం వుడా లేఅవుట్‌ వేసి ప్లాట్లు విక్రయించింది. అప్పట్లో 266.7 చ.గ. ప్లాటును ఒకరు కొనుగోలు చేయగా, ఆయన నుంచి గురుమూర్తినాయుడు అనే వ్యక్తి కొన్నారు. అయితే ఆ లేఅవుట్‌ను ఆ తరువాత రెవెన్యూ శాఖ 22-ఎలో చేర్చింది. వుడా విక్రయించిన ప్లాట్లను ఎలా 22-ఎలో చేర్చుతారని గురుమూర్తినాయుడు లబోదిబోమంటూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

తుంగ్లాం పరిసరాల్లో రైతుల నుంచి కొందరు వ్యక్తులు భూమి కొనుగోలు చేసి లేఅవుట్‌ వేసి ఇళ్లు నిర్మించుకున్నారు. ఆటోనగర్‌కు ఆనుకుని లేఅవుట్‌ ఉండడంతో ఏపీఐఐసీ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకున్నారు. ఆ తరువాత ఏపీఐఐసీ తాను జారీచేసిన నిరభ్యంతర పత్రాన్ని రద్దుచేయడంతో సదరు భూమిని 22-ఎలో చేర్చారు. విషయం తెలిసిన ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా 22-ఎ నుంచి తొలగించాలని కోరుతున్నారు.

...ఇలా వేర్వేరు కారణాలతో రెవెన్యూ శాఖ నిషేధిత జాబితా (22-ఎ)లో చేర్చబడిన జిరాయితీ, ప్రభుత్వ సంస్థల నుంచి కొనుగోలు చేసిన భూములకు త్వరలో విముక్తి లభించనున్నది. 22-ఎ నుంచి భూముల తొలగింపు అధికారాలను కలెక్టర్‌ నుంచి రెవెన్యూ డివిజనల్‌ (ఆర్డీవో) అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జీవో (నంబరు 444) జారీచేసింది. నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించాలని విశాఖ జిల్లాలో వందలాది మంది అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్ల తరబడి కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు.

ప్రభుత్వ భూములను కాపాడే ప్రక్రియలో భాగంగా 1999లో రూపొందించిన విధానాల మేరకు 2017లో నిషేధిత జాబితాను రూపొందించారు. విశాఖలో ప్రభుత్వ భూముల విలువ పెరగడంతో కొందరు తప్పుడు రికార్డులు సృష్టించి ఆక్రమణకు యత్నించారు. దీనికి రెవెన్యూలో కొందరు అధికారులు, సిబ్బంది సహకరించారు. అదే సమయంలో నగర శివారుల్లో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు, పొలిటికల్‌ సఫరర్లకు ఇచ్చిన భూములు కూడా ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం లేకుండా చేతులు మారాయి. దీంతో సుమారు పదేళ్ల క్రితం అటువంటి భూములను చాలా వరకు భూములు 22-ఎలో చేర్చారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల జిరాయితీ భూములు, వుడా, హౌసింగ్‌ బోర్డు లేఅవుట్‌లు, ప్రభుత్వం నుంచి పలు హౌసింగ్‌ సొసైటీలు కొనుగోలుచేసిన భూములను 22-ఎలో చేర్చారు. దీంతో ప్లాట్లు కొనుగోలుచేసినవారు, రైతులు సుమారు దశాబ్దకాలంగా మండల తహశీల్దారు నుంచి కలెక్టర్‌ వరకు ప్రదక్షిణలు చేస్తూ వినతిపత్రాలు ఇస్తున్నారు. నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపుపై తహశీల్దారు ఇచ్చే నివేదిక ఆర్డీవోకు, అక్కడ నుంచి జాయింట్‌ కలెక్టర్‌, చివరకు కలెక్టర్‌కు చేరితే జిల్లా స్థాయి కమిటీలో చర్చించి వాటిపై నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ప్రైవేటు లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి విషయంలో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రైతుల నుంచి జిరాయితీ భూములు కొనుగోలుచేసి లేఅవుట్‌లు అభివృద్ధి చేసిన రియల్టర్లు, వాటికి ఆనుకుని ఉన్న గెడ్డలు, చెరువు గర్భాలను కలిపి అమ్ముకున్నారు. ఇటువంటి లేఅవుట్‌లకు గతంలో గ్రామ పంచాయతీలు, రెవెన్యూ, వుడా అన్నిరకాల అనుమతులు ఇచ్చేశాయి. అయితే ఆయా లేఅవుట్‌లలో కొన్ని ప్లాట్లు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని ఇప్పుడు అధికారులు వాటిని 22-ఎలో చేర్చడంతో కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలావుండగా నగరంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇళ్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే గాజువాక, పెందుర్తి, మధురవాడ ప్రాంతాల్లో చెరువులు, గెడ్డల్లో అప్పట్లో నిర్మించిన ఇళ్లను రెగ్యులర్‌ చేయడానికి ఇప్పుడు ఇబ్బంది వస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు గెడ్డలు, చెరువుల్లో ఆక్రమలను క్రమబద్ధీకరించలేమని జిల్లా యంత్రాంగం చెబుతూ...వాటిని 22-ఎ నుంచి తొలగించలేమని పేర్కొంది.

ఇదిలావుండగా నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆ అధికారాన్ని ఆర్డీవోలకు అప్పగించింది. ఈ క్రమంలో జిల్లాలో 200 దరఖాస్తులను ఆర్డీవోలకు యంత్రాంగం బదలాయించింది. అయితే ఆర్డీవో స్థాయిలో ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా?...అనే అనుమానం ఉంది.

మీ సేవలో దరఖాస్తు చేసుకోండి

జి.విద్యాధరి, జాయింట్‌ కలెక్టర్‌

నిషేధిత జాబితా 22-ఎ నుంచి భూముల తొలగింపునకు సంబంధించి మీ-సేవలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు అక్కడ నుంచి సంబంధిత ఆర్డీవోకు చేరుతుంది. ఆ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రైవేటు భూమి అయితే 22-ఎ నుంచి తొలగిస్తారు. ఆర్డీవో నిర్ణయంపై జాయింట్‌ కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు.

Updated Date - Aug 07 , 2026 | 01:02 AM