Share News

అధ్వాన రోడ్లకు మోక్షం

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:03 AM

గత కొన్నాళ్లుగా అధ్వానంగా ఉన్న పాడేరు నుంచి ముంచంగిపుట్టు మెయిన్‌రోడ్డులోని పెదబయలు రోడ్డు, జిల్లా కేంద్రంలోని కొత్తపాడేరు రోడ్లకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. దీంతో రాకపోకలు సజావుగా సాగుతుండడంతో వాహనచోదకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అధ్వాన రోడ్లకు మోక్షం
పాడేరు - పెదబయలు మార్గంలో నిర్మించిన రోడ్డు

ఎట్టకేలకు మెరుగుపడిన పెదబయలు, కొత్తపాడేరు రోడ్లు

ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు, వాహన చోదకులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

గత కొన్నాళ్లుగా అధ్వానంగా ఉన్న పాడేరు నుంచి ముంచంగిపుట్టు మెయిన్‌రోడ్డులోని పెదబయలు రోడ్డు, జిల్లా కేంద్రంలోని కొత్తపాడేరు రోడ్లకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. దీంతో రాకపోకలు సజావుగా సాగుతుండడంతో వాహనచోదకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పాడేరు- జోలాపుట్టు మెయిన్‌రోడ్డులోని పెదబయలు మండల పరిధిలోకి వచ్చే ఐదు కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధికి చేసేందుకు కూటమి ప్రభుత్వం గతేడాది రూ.9 కోట్ల 60 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది జనవరిలో రోడ్డు గుంతలు పూడ్చడం, వెడల్పు చేయడం వంటి పనులు ప్రారంభించినప్పటికీ, అప్పటి నుంచి ఈ నెల మొదటి వారం వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేశారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు మరింత గోతులమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలాగే అంతకు ముందు రోడ్డుపై దుమ్మూ, ధూళితో సైతం రాకపోకలు సాగించేందుకు జనం అవస్థలు పడ్డారు.

కొత్తపాడేరు రోడ్డుకు ఏడాదికి మోక్షం...

గతేడాది ఆదివాసీ దినోత్సవానికి సీఎం నారా చంద్రబాబునాయుడు పాడేరు వస్తారని భావించిన అధికారులు పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే మెయిన్‌రోడ్డులో కాన్వెంట్‌ కూడలి వద్ద నుంచి కొత్తపాడేరు మీదుగా లగిశపల్లి వెళ్లే రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే కాన్వెంట్‌ కూడలి నుంచి కొత్తపాడేరు వరకు ఉన్న రోడ్డును తవ్వేసి గతేడాది జూలై నుంచి అసంపూర్తిగానే వదిలేశారు. దీంతో కొత్తపాడేరు, లగిశపల్లి, కాడెలి, వంజంగి ప్రాంతాలకు రాకపోకలు సాగించే స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పెదబయలు, కొత్తపాడేరు రోడ్లు అధ్వానంగా ఉండడంతో ప్రజలు, ప్రయాణికులు పడుతున్న అవస్థలపై ‘ఆంధ్రజ్యోతి’లో పలు కథనాలు ప్రచురితం కావడంతో అధికారులు ఎట్టకేలకు స్పందించిన తాజాగా ఈ రోడ్లను మెరుగుపరిచారు. దీంతో స్థానిక ప్రయాణికులు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 21 , 2026 | 12:03 AM