Share News

ఎగువశోనభ - కాకరపాడు రోడ్డుకు మోక్షం

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:20 PM

మండలంలోని మారుమూల పైనంపాడు పంచాయతీ కాకరపాడు పీవీటీజీ గిరిజన గ్రామానికి మంచిరోజులు రానున్నాయి. ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గిరిజనుల కష్టాలు తీరనున్నాయి.

ఎగువశోనభ - కాకరపాడు రోడ్డుకు మోక్షం
ఎగువశోనభ నుంచి కాకరపాడుకు రోడ్డు పనులు జరుగుతున్న దృశ్యం

రూ.3.17 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం

3.2 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభం

తీరనున్న గిరిజనుల కష్టాలు

అనంతగిరి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల పైనంపాడు పంచాయతీ కాకరపాడు పీవీటీజీ గిరిజన గ్రామానికి మంచిరోజులు రానున్నాయి. ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గిరిజనుల కష్టాలు తీరనున్నాయి. ఎగువశోనభ నుంచి కాకరపాడు వరకు 3.2 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ.3.17 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి.

ఎగువశోనభ నుంచి కాకరపాడు వరకు కొంత మేర ఎత్తైన కొండల మధ్య మట్టిరోడ్డు ఉండడంతో వర్షాలు కురిసినప్పుడు కొట్టుకుపోయేది. దీంతో రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గతంలో ఎన్నో సార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పీఎం జన్‌మన్‌ ఫేజ్‌-3లో భాగం ఎగువశోనభ నుంచి కాకరపాడు వరకు 3.2 కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణానికి రూ.3.17 కోట్లు మంజూరు చేసింది. జనవరి నెలలో రోడ్డు పనులకు నిధులు మంజూరు కావడం, పరిపాలన ఆమోదం లభించడంతో టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి నాలుగు రోజుల క్రితం రోడ్డు పనులను ప్రారంభించారు. రోడ్డు పనుల పర్యవేక్షణ బాధ్యతను పీఆర్‌ ప్రాజెక్ట్సు అధికారులు చూస్తున్నారు.

తీరనున్న ఆదివాసీల కష్టాలు

కాకరపాడు గ్రామంలో వందకు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. సుమారు 450 మంది వరకు జనాభా ఉన్నారు. ఈ గ్రామానికి మట్టిరోడ్డు ఉండడంతో వర్షాలకు మలుపుల వద్ద తరచూ కొట్టుకుపోయి రాకపోకలు ఇబ్బందిగా ఉంటోంది. అత్యవసర సమయాల్లో రోగులు, గర్భిణులను డోలీలో మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే వీరి కష్టాలు తీరతాయి.

Updated Date - Jul 12 , 2026 | 11:20 PM