ఆర్‌అండ్‌బీ వంతెనలకు మోక్షం
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:01 AM
జిల్లాలో చాలా ఏళ్ల నుంచి అసంపూర్తిగా వున్న ఆర్‌అండ్‌బీ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో ఎలమంచిలి, మాడుగుల, పాయకరావుపేట నియోజకవర్గాలకు చెందిన నాలుగు అప్రోచ్ రోడ్లు వున్నాయి.
జిల్లాలో నాలుగుచోట్ల అప్రోచ్ రోడ్లకు రూ.10.19 కోట్లు మంజూరు
గవర్లఅనకాపల్లి వద్ద ఆవ కాలువ వంతెన అప్రోచ్ రోడ్డు
దేవరాపల్లి మండలంలో శారదా నదిపై రెండుచోట్ల...
కోటవురట్ల మండలం జల్లూరు వద్ద వరాహా నదిపై వంతెనకు అప్రోచ్ రోడ్డు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో చాలా ఏళ్ల నుంచి అసంపూర్తిగా వున్న ఆర్‌అండ్‌బీ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో ఎలమంచిలి, మాడుగుల, పాయకరావుపేట నియోజకవర్గాలకు చెందిన నాలుగు అప్రోచ్ రోడ్లు వున్నాయి. వీటిలో మూడు రహదారులకు కొంతమేర భూమిని కూడా సేకరించాల్సి వుంటుంది. ఈ పనులన్నింటికీ కలిపి ప్రభుత్వం రూ.10.19 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ రాష్ట్ర, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. ఆయా వంతెనల వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయితే పలు నియోజకవర్గాల ప్రజలకు రవాణా పరమైన ఇక్కట్లు తొలగుతాయిఇ.
ఎలమంచిలి నియోజకవర్గం పరిధిలో అచ్యుతాపురం మండలం తంతడి నుంచి మునగపాక మండలం తోటాడ మీదుగా అనకాపల్లి నూకాంబిక ఆలయం ఆర్చి వద్దకు వెళ్లే రోడ్డులో గవర్లఅనకాపల్లి వద్ద అనకాపల్లి ఆవ కాలువపై గతంలో వంతెన నిర్మించారు. కానీ అప్రోచ్ రోడ్లకు నిధులు మంజూరు కాకపోవడంతో వంతెన వినియోగంలోకి రాలేదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు రూ.1.1 కోట్లు మంజూరు చేసింది. ఇందులో అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులకు రూ.78.5 లక్షలు, ఇందుకు అవసరమైన భూసేకరణకు రూ.31.5 లక్షలు కేటాయించింది.
మాడుగుల నియోజయోకవర్గం దేవరాపల్లి మండలంలో రెండుచోట్ల శారదా నదిపై వంతెనలు నిర్మించారు. భూ సమస్య కారణంగా అప్రోచ్ రోడ్లు వేయలేదు. వేచలం- ఖండివరం రోడ్డులో కలిగొట్ల సమీపంలో నిర్మించిన వంతెనకు అప్రోచ్ రోడ్ల కోసం రూ.2.6 కోట్లు, భూ సేకరణకు రూ.1.3కోట్లు.. మొత్తం రూ.3.9 కోట్లు మంజూరయ్యాయి. ఇదే మండలం పెదకోట-పినకోట రోడ్డులో శారదా నదిపై బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు, భూ సేకరణ కోసం రూ.3.03 కోట్లు కేటాయించారు. ఈ రెండు వంతెనల అప్రోచ్‌రోడ్ల నిర్మాణం పూర్తయితే మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో పలు మండలాలకు రవాణా సదుపాయం మెరుగుపడుతుంది.
నర్సీపట్నం- అడ్డరోడ్డు మధ్యలో పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలోని కోటవురట్ల మండలం జల్లూరు వద్ద వరహా నదిపై గత టీడీపీ హయాంలోనే వంతెన నిర్మించారు. అయితే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అప్రోచ్ రోడ్లకు నిధులు మంజూరు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్రోచ్ రోడ్లు నిర్మాణం కోసం రూ.2.16 కోట్లు మంజూరు చేసింది.