ఆగని తీరం కోత
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:16 AM
ఆర్కే బీచ్ కోతకు గురవుతోంది. బుధవారం రాత్రి ప్రారంభమైన అలల ఉధృతి శుక్రవారం కూడా కొనసాగింది.
నివారణకు చర్యలు శూన్యం
విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):
ఆర్కే బీచ్ కోతకు గురవుతోంది. బుధవారం రాత్రి ప్రారంభమైన అలల ఉధృతి శుక్రవారం కూడా కొనసాగింది. కెరటాలు భారీగా తీరాన్ని తాకుతున్నాయి. అమావాస్య సమయంలో సాధారణంగా సముద్రం ఆటుపోటు ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు రెండు రోజుల క్రితం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అలల ఉధృతి పెరిగింది. రుతుపవన కరెంట్ బలంగా ఉండడంతో అలల తీవ్రత కొనసాగింది. అలలు బీచ్ రోడ్డులో రక్షణ గోడ సమీపం వరకు వస్తున్నాయి. బీచ్‌కు ఉత్తరాన ఉన్న కొబ్బరి ఎరీనా ప్రాంతంలో అలల ప్రభావం మరింత అధికంగా కనిపిస్తోంది. దీంతో చెట్ల మొదళ్లు బయటకు వచ్చాయి. గత ఏడాది కోతకు గురైన తరువాత కొన్ని చెట్లు ఎండిపోయాయి.
ఏటా రుతుపవనాల సీజన్‌లో కురుసుర మ్యూజియానికి దక్షిణ భాగం, గోకుల్ పార్కు పరిసరాల్లో సముద్రం కోత ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఆరేడు అల్పపీడనాలు ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల మధ్య ఏర్పడ్డాయి. అదే ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మధ్య ఏర్పడి ఉంటే విశాఖలో సముద్రం కోత ఇంకా ఎక్కువగా ఉండేది. గడచిన మూడు రోజుల నుంచి తీరంలో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నందున అలల ఉధృతి కొనసాగిందని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. ఇదిలావుండగా బీచ్‌రోడ్డులో కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు తీరం కోత నివారణకు ప్రతిపాదనలు ఉన్నా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. కనీసం తాత్కాలిక చర్యలు కూడా తీసుకోవడం లేదు. దీనికితోడు బీచ్ శుభ్రత పేరుతో ఇసుక తిన్నెలపై ఉన్న చెత్తా, చెదారం తొలగింపునకు యంత్రాలు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో బీచ్‌లో పొదలు తొలగిస్తుండడంతో అలల ఉధృతికి తీరం కోతకు గురవుతుందని వాతావరణ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తంచేశారు.