Share News

సందర్శకులకు ఊరట

ABN , Publish Date - Jun 14 , 2026 | 10:45 PM

స్థానిక పద్మాపురం గార్డెన్‌ (బొటానికల్‌ గార్డెన్‌)ను సందర్శించే వారికి ఊరట లభించింది. గార్డెన్‌ ప్రవేశ రుసుమును తగ్గిస్తూ ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ నిర్ణయం తీసుకున్నారు.

సందర్శకులకు ఊరట
పద్మాపురం గార్డెన్‌ ప్రవేశ ద్వారం

తగ్గిన పద్మాపురం గార్డెన్‌ ప్రవేశ రుసుము

పెద్దలకు రూ.100 నుంచి రూ.60, పిల్లలకు రూ.50 నుంచి రూ.30కు తగ్గుదల

చిన్నారులకు మాత్రమే అందుబాటులోకి టాయ్‌ట్రైన్‌

వాటర్‌ డైనింగ్‌ కాన్సెప్ట్‌ను ప్రారంభించేందుకు చర్యలు

అరకులోయ, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక పద్మాపురం గార్డెన్‌ (బొటానికల్‌ గార్డెన్‌)ను సందర్శించే వారికి ఊరట లభించింది. గార్డెన్‌ ప్రవేశ రుసుమును తగ్గిస్తూ ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎంట్రన్స్‌ టికెట్‌ పెద్దలకు రూ.100లు ఉండగా తాజాగా రూ.60, పిల్లలకు రూ.50 ఉండగా రూ.30కు తగ్గించారు. టికెట్‌ ధరల తగ్గింపు రెండు రోజుల క్రితం అమలులోకి వచ్చింది. వాస్తవానికి టికెట్‌ ధర అధికంగా ఉండడంతో కుటుంబ సమేతంగా వచ్చిన మధ్యతరగతి, సామాన్య ప్రజలు గార్డెన్‌ను సందర్శించకుండా వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని టికెట్‌ ధరలు తగ్గించారు. కాగా ఈ నెల 12న టాయ్‌ ట్రైన్‌ను ప్రారంభించారు. అయితే కేవలం చిన్నారుల కోసమే దీనిని అందుబాటులోకి తెచ్చారు. గతంలో పిల్లలతో కలిసి పెద్దలు టాయ్‌ట్రైన్‌లో గార్డెన్‌ మొత్తం తిరిగి వచ్చేవారు. ఇప్పుడు చిన్నారులకు మాత్రం ఈ ట్రైన్‌ అందుబాటులోకి తేవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గార్డెన్‌లో వాటర్‌ డైనింగ్‌ కాన్సెప్ట్‌ను ప్రారంభించేందుకు ఐటీడీఏ పీవో చర్యలు తీసుకుంటున్నారు. నీటి మధ్యలో ప్రత్యేక వాతావరణంలో భోజనం చేసేలా ఏర్పాట్లు చేసి సందర్శకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని నిర్ణయించారని మ్యూజియం మేనేజర్‌ గణపతి తెలిపారు.

Updated Date - Jun 14 , 2026 | 10:45 PM