Share News

బాలింత, శిశువు మృతిపై పునర్విచారణ

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:39 AM

గిరిజన బాలింత, శిశువు మృతిపై ప్రభుత్వం నియమించిన అధికారి పునర్విచారణ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో నలుగురు వైద్యులు, ముగ్గురు క్షేత్రస్థాయి ఉద్యోగులను తూర్పుగోదావరి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఎం.పద్మ గురువారం విచారణ జరిపారు. దీనికి సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఎం.పద్మ స్థానిక విలేకరులకు వెల్లడించారు.

బాలింత, శిశువు మృతిపై పునర్విచారణ
విలేకరులతో మాట్లాడుతున్న డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పద్మ

- నలుగురు వైద్యులు, ముగ్గురు క్షేత్రస్థాయి ఉద్యోగుల నుంచి ఆధారాల సేకరణ

- ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం

- తూర్పుగోదావరి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పద్మ వెల్లడి

చింతపల్లి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): గిరిజన బాలింత, శిశువు మృతిపై ప్రభుత్వం నియమించిన అధికారి పునర్విచారణ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో నలుగురు వైద్యులు, ముగ్గురు క్షేత్రస్థాయి ఉద్యోగులను తూర్పుగోదావరి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఎం.పద్మ గురువారం విచారణ జరిపారు. దీనికి సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఎం.పద్మ స్థానిక విలేకరులకు వెల్లడించారు. గూడెంకొత్తవీధి మండలం ఊబపొలం గ్రామానికి చెందిన వంతల పరిమళకు నెలలు నిండడంతో కుటుంబ సభ్యులు 2024 ఆగస్టులో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. గర్భిణిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ఆమె ఆడ శిశువుకి జన్మనిచ్చింది. శిశువు జన్మించిన క్షణాల వ్యవధిలోనే మృతి చెందగా, తల్లికి తీవ్ర రక్తస్రావం జరగడంతో కేజీహెచ్‌కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. దీంతో చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, సకాలంలో కనీస మెరుగైన చికిత్స అందించకపోవడం వల్లనే పరిమళ మరణించిందని బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పరిమళ మృతికి నాటి గైనికాలజిస్టు, ప్రస్తుత నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌వీఎస్‌ సుధాశారద, అనస్థీషియా వైద్యులు డాక్టర్‌ టి.విక్రమ్‌, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ అజయ్‌బాబు, నాటి మెడికల్‌ సూపరింటెండెంట్‌, దంత వైద్యనిపుణులు డాక్టర్‌ ఎస్‌.చంద్రశేఖరరావును బాధ్యులుగా పేర్కొంటూ ప్రభుత్వం శాఖాపరమైన విచారణ ప్రారంభించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుల నుంచి లిఖిత పూర్వక వివరణలను స్వీకరించింది. అయితే వైద్యుల వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ప్రభుత్వం తిరస్కరించింది. తాజాగా ఏపీసీఎస్‌(సీసీఏ) నిబంధనలు 1991, రూల్‌ 20(2) ప్రకారం ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు విచారణాధికారిగా తూర్పుగోదావరి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఎం.పద్మను నియమించింది. అలాగే ప్రభుత్వం తరఫున వాదనలు, ఆధారాలను విచారణ అధికారికి అందజేసేందుకు రూల్‌ (5)(సీ) ప్రకారం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఏరియా ఆస్పత్రి అనస్థీషియా వైద్యులు డాక్టర్‌ ఎస్‌.ప్రవీణ్‌ని ప్రజెంటింగ్‌ అధికారిగా నియమించింది. ఈ నేపథ్యంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి వచ్చిన విచారణాధికారి తూర్పుగోదావరి డీసీహెచ్‌ఎస్‌, ప్రజెంటింగ్‌ అధికారి... నలుగురు వైద్యులు, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ, ఆశ కార్యకర్తలను వేర్వేరుగా సుదీర్ఘంగా విచారించారు. వైద్యులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల నుంచి అవసరమైన రికార్డులు, ఆధారాలను సేకరించారు. ప్రభుత్వ కార్యదర్శి ఆదేశాలతో సమగ్ర విచారణ చేపట్టామని, ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని విచారణాధికారి తెలిపారు.

Updated Date - Oct 02 , 2026 | 12:39 AM