Share News

బైక్‌ రేసర్లకు ముకుతాడు

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:20 AM

నగరంలో బైక్‌రేసర్లు, జాయ్‌రైడింగ్‌ చేసే యువతకు పోలీసులు ముకుతాడు వేశారు.

బైక్‌ రేసర్లకు ముకుతాడు

బీచ్‌రోడ్డులో పోలీసుల స్పెషల్‌డ్రైవ్‌

72 వాహనాలు సీజ్‌

విశాఖపట్నం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి):

నగరంలో బైక్‌రేసర్లు, జాయ్‌రైడింగ్‌ చేసే యువతకు పోలీసులు ముకుతాడు వేశారు. వారాంతాల్లో యువత బీచ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో స్పోర్ట్స్‌బైక్‌లు, హైస్పీడ్‌ బైక్‌లతో రేసింగ్‌లు, జాయ్‌రైడింగ్‌ పేరుతో ప్రమాదకర స్టంట్‌లు చేస్తున్నారు. దీనివల్ల చాలామంది ప్రమాదాల బారినపడడంతో పాటు వారిని చూసి ఎదురుగా వచ్చే వాహనచోదకులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనల్లో కొందరు మృతిచెందగా, మరికొందరు గాయపడుతున్నారు. ఈనేపథ్యంలో సీపీ శంఖబ్రతబాగ్చి బైక్‌ రేసర్లకు ముకుతాడు వేయాలని ట్రాఫిక్‌ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం రాత్రి స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించారు. కోస్టల్‌బ్యాటరీ నుంచి జోడుగుళ్లపాలెం వరకు ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు వాహన తనిఖీలు నిర్వహించాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న 72 మంది యువకులను పట్టుకుని బైక్‌లను సీజ్‌చేశారు. పట్టుబడినవారిలో కేవలం పది మంది మాత్రమే మద్యం సేవించి వాహనాలు నడిపినవారుకాగా, మిగిలిన వారంతా రేసింగ్‌లు, జిగ్‌జాగ్‌, ప్రమాదకరమైన స్టంట్‌లు చేస్తున్న యువకులే. ఈ సందర్భంగా పోలీసులకు పట్టుబడిన యువకులకు కౌన్సెలింగ్‌చేసి పంపించారు. నగరంలో బైక్‌రేసింగ్‌లకు పాల్పడినా, సైలెన్సర్లు తీసి ఎక్కువశబ్దంతో వాహనాలు నడిపినా, జిగ్‌జాగ్‌లు చేస్తే ఇతర వాహన చోదకుల్లో ఆందోళన కలిగించినా కఠినచర్యలు తప్పవని మహరాణిపేట ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఉమామేశ్వరరావు హెచ్చరించారు.


ఎక్స్‌రే మెషీన్లు చేరాయ్‌.!

టీబీ నిర్ధారణకు సమకూర్చిన ఓఎన్‌జీసీ

అందుబాటులోకి 8 ఏఐ ఆధారిత హ్యాండ్‌ హెల్డ్‌ ఎక్స్‌రే మెషీన్లు

ఒక్కో యంత్రం ఖరీదు రూ.22 లక్షలు

టీబీ యూనిట్లకు అందించేందుకు ఏర్పాట్లు

విశాఖపట్నం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో టీబీ వ్యాధిగ్రస్తులను అత్యంత వేగంగా గుర్తించేందుకు అవసరమైన అత్యాధునిక ఎక్స్‌రే మెషీన్లు టీబీ నియంత్రణ విభాగానికి చేరాయి. సీఎస్‌ఆర్‌ నిధులతో ఓఎన్‌జీసీ సంస్థ జిల్లాకు ఎని మిది మెషీన్లను సమకూర్చింది. ఒక్కో మెషీన్‌ ఖరీదు రూ.22 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. తాజాగా వీటిని ఓఎన్‌జీసీ సంస్థ జిల్లా టీబీ నియంత్రణ అధికారులకు అప్ప గించింది. కొద్దిరోజుల్లో జిల్లాలోని టీబీ యూనిట్లకు చేర్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందించిన ఒక మెషీన్‌ సాయంతో అగంనపూడిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా వచ్చిన ఎనిమిది మెషీన్లను అల్లిపురం, ఆరిలోవ, భీమిలి, కేజీహెచ్‌, ఆర్పీపేట, డీటీసీ (చెస్ట్‌ఆస్పత్రి), గోపాలపట్నం, మధురవాడలోని టీబీ యూనిట్లకు తరలిస్తారు. వీటి ద్వారా నిర్వహించే పరీక్షల్లో అత్యంత కచ్చితత్వం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఎక్కడికైనా తరలించేలా..

ఈ అధునాతన ఎక్స్‌రే మెషీన్లు పోర్టబుల్‌గా ఉండడంతో ఎక్కడికైనా తరలించేందుకు వీలుంటుంది. సూట్‌కేస్‌లో పెట్టుకుని తీసుకెళ్లిపోవచ్చు. వల్నరబుల్‌ పాపులేషన్‌ అధికంగా ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లి చిన్నరూములో పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. వీటిని టీబీ సోకేందుకు ఎక్కువ అవకాశం వారికి పరీక్షలు నిర్వహించేందుకు విని యోగించనున్నారు. వీరిలో 60 ఏళ్లుపైబడిన వృద్ధులు, పోషకాహార లోపంతో బాధపడేవారు, మధు మేహం, హెచ్‌ఐవీ బాధితులు, ధూమపానం, మద్యపానం అలవాటున్నవారు. గత ఐదేళ్లలో టీబీ వచ్చినవారు, టీబీ రోగులతో సన్నిహితంగా ఉండే వారికి పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్‌ రోణంకి రమేష్‌ తెలిపారు. జాయింట్‌ డైరెక్టర్‌ ఆదేశాలతో కొద్దిరోజుల్లో టీబీ యూనిట్లకు వీటిని చేర్చి, రోగులకు పరీక్షలను నిర్వహిస్తామన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 12:20 AM