Share News

పసిడి రుణాలపై నిబంధనలు

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:23 AM

బంగారం తనఖా పెట్టుకొని ఇచ్చే రుణాలపై వాణిజ్య బ్యాంకులు పరిమితి విధించాయి.

పసిడి రుణాలపై నిబంధనలు

రూ.2.2 లక్షల వరకు పాత విధానంలోనే అప్పు

అంతకు మించితే రైతులు ఆదాయ వివరాలతోపాటు, రుణం ఎలా తీరుస్తారో డిక్లరేషన్‌ ఇవ్వాలి

చిరువ్యాపారులైతే ఆదాయ పన్ను రిటర్న్స్‌, జీఎస్‌టీ సర్టిఫికెట్‌...

ఉద్యోగులైతే శాలరీ సర్టిఫికెట్‌ ఇవ్వాలి

చోడవరం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి):

బంగారం తనఖా పెట్టుకొని ఇచ్చే రుణాలపై వాణిజ్య బ్యాంకులు పరిమితి విధించాయి. గత నెల వరకు ఎంత బంగారం కుదువ పెట్టినప్పటికీ రుణాలు ఇచ్చేవారు. అయితే ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆర్‌బీఐ నిబంధనలను మార్చిందని, బంగారంపై ఇచ్చే రుణం రూ.2.2 లక్షలకు మించితే ఆదాయ వివరాలు, తీసుకున్న అప్పును ఏ విధంగా తీరుస్తామన్న వివరాలతో వ్యక్తిగత ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి వుంటుందని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో వివిధ అవసరాల నిమిత్తం బంగారాన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి రుణాలు తీసుకునే రైతులు, చిరువ్యాపారులు, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందికరంగా వుంటుంది.

వ్యవసాయ పెట్టుబడులు, కొత్త ఇళ్ల నిర్మాణం, వ్యాపారాల ప్రారంభం, పిల్లల ఉన్నత విద్య, వివాహాల ఖర్చులు, తదితర అవసరాల కోసం చాలా మంది తమ వద్ద వున్న బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి అప్పు తీసుకుంటుంటారు. మార్కెట్‌లో బంగారం ధర, ఆర్‌బీఐ నిబంధనలకు మేరకు బ్యాంకర్లు నిర్ణీత మొత్తంలో రుణాలు మంజూరు చేస్తుంటారు. అదే విధంగా తనఖా పెట్టే బంగారంపై పరిమితి అంటూ వుండేది కాదు. అయితే కొంతకాలం నుంచి బంగారం ధరల్లో అనూహ్యమైన హెచ్చుతగ్గులు కనిపిస్తుండడంతో పసిడి ఆభరణాలను తాకట్టుపెట్టుకొని బ్యాంకులు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ కొత్తగా కొన్ని నిబంధనలను అమల్లోకి తెచ్చినట్టు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. బంగారం తాకట్టుపై రూ.2.2 లక్షల వరకు ఎలాంటి షరతులు లేకుండా రుణం ఇచ్చే అవకాశం ఉంది. అంతకు మించి రుణం కావాలంటే రైతులు తమ ఆదాయ ధ్రువపత్రం, అప్పు ఎలా తీరుస్తారు అనే వివరాలను బ్యాంకు అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని సమాచారం. చిరువ్యాపారులైతే ఆదాయ పన్ను రిటర్న్స్‌, జీఎస్‌టీ సర్టిఫికెట్‌ సమర్పించాలి. ఉద్యోగులైతే శాలరీ సర్టిఫికెట్‌ ఇవ్వాలి.

ఇబ్బందికరమే...

బంగారం తాకట్టుపై ఇచ్చే రుణాల విషయంలో ఆర్‌బీఐ విధించిన షరతులు రైతులు, చిరువ్యాపారులు, ఇతర వర్గాల వారికి ఇబ్బందికరమేనని అంటున్నారు. బంగారం తాకట్టు పెట్టి, అప్పు తీసుకోవడానికి ఆదాయ ధ్రువపత్రం సమర్పిస్తే, తెల్లరేషన్‌ కార్డు, ఇతర రాయితీలు పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకోవడానికి ఇన్ని షరతులు విధించడం సరికాదని రైతులు, చిరువ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల బంగారంపై రుణాల కోసం ప్రైవేటు ఆర్థిక సంస్థలను ఆశ్రయించాల్సి వస్తుందని, ఒకవేళ ఆ సంస్థలు దుకాణం మూసేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశిస్తున్నారు.

ఆర్‌బీఐ పునరాలోచించాలి

ఎడ్ల తాతాజీ, ఎడ్లవీధి, చోడవరం

తాకట్టు పెట్టే బంగారంపై గతంలో మాదిరిగా పరిమితి లేకుండా రుణాలు ఇవ్వాలి. అవసరానికి బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకునే విషయంలో షరతులు విధించడం సరికాదు. దీనివల్ల ప్రైవే టు సంస్థలను ఆశ్రయించి అధిక వడ్డీలు, చక్రవడ్డీలతో నష్టపోవాల్సి వస్తుంది. కొత్తగా విధించిన నిబంధనలపై ఆర్‌బీఐ పునరాలోచన చేయాలి.


పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు

రేపు ఓటరు జాబితాలు విడుదల

పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శన

ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ

ఎన్నికల కమిషన్‌ ఆమోదంతో తుది జాబితాలు విడుదల

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీల పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు మొదలయ్యాయి. పంచాయతీల్లో సామాజికవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు 15వ తేదీన వీటిని విడుదల చేయనున్నారు. తరువాత నిర్దేశించిన గడువులోగా అభ్యంతరాలు స్వీకరించి ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఓటర్ల తుది జాబితాలను విడుదల చేస్తారు.

గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 2వ తేదీతో ముగియడంతో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించింది. ప్రస్తుతం అన్ని పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కీలకమైన ఓటర్ల జాబితాలను ప్రదర్శించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల పునర్విభజన, ఓటర్ల జాబితాలను రూపొందించిన అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఇంతవరకు ఆమోదం లభించకపోవడంతో ఓటర్ల జాబితాలను వెల్లడించలేదు. తాజాగా ఓటర్ల జాబితాలను ఈ నెల 15న అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో జిల్లా అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 646 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో సామాజికవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు బుధవారం వీటిని విడుదల చేయనున్నారు. తరువాత నిర్దేశించిన గడువులోగా ప్రజల నంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ఎన్నికల కమిషన్‌ ఆమోదంతో తుది జాబితాలను విడుదల చేస్తారు.


తామరం సహకార ఉద్యోగిపై వేటు?

స్టాఫ్‌ అసిస్టెంట్‌ను డిస్మిస్‌ చేయాలంటూ రాష్ట్ర కమిషనర్‌ సిఫారసు

మాకవరపాలెం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తామరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) స్టాఫ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్‌.గోవిందను విధుల నుంచి తొలగించాలనిరాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌, సహకార సంఘాల రిజిస్ట్రార్‌ జిల్లా సహకార అధికారులకు సిఫారసు చేశారు. ఈ మేరకు ఎలమంచిలి డివిజనల్‌ సహకార అధికారి, తామరం పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జికి లేఖ పంపారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

తామరం పీఏసీఎస్‌లో శీరంరెడ్డి గోవింద సుమారు 20 ఏళ్ల నుంచి స్టాఫ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్టు స్థానిక రైతులు, ఏసీబీకి ఫిర్యాదులు చేశారు. దీంతో 2020 ఫిబ్రవరి నాలుగో తేదీన ఏసీబీ అధికారులు అతని ఆస్తులపై సోదాలు నిర్వహించారు. మొత్తం రూ.1,43,60,759 విలువైన ఆస్తులు కలిగివున్నట్టు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టినట్టు నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దీంతో సహకార శాఖ అధికారులు గోవిందను సస్పెండ్‌ చేశారు. అయితే అప్పట్లో అధికారంలో వున్న వైసీపీ నాయకులను ఆశ్రయించి, సస్పెన్షన్‌ ఎత్తివేయించుకోడమే కాకుండా ఇదే పీఏసీఎస్‌లో తిరిగి విధుల్లో చేరాడు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తరవాత స్థానికుల ఫిర్యాదు మేరకు గోవిందపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాది జూన్‌లో తామరం పీఏసీఎస్‌ నుంచి రోలుగుంట పీఏసీఎస్‌కు బదిలీ చేశారు. గతంలో ఏసీబీ నమోదు చేసిన కేసులో అక్రమ ఆస్తులకు సంబంధించి ఇంతవరకు సరైన వివరణ ఇవ్వకపోవడంతో ఏసీబీ అధికారులు మళ్లీ విచారణ చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ప్రభుత్వం ఆదేశించింది. ఈసారి కూడా అతను అక్రమ ఆస్తులపై తగిన సమాచారం ఇవ్వకపోవడంతో ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో శీరంరెడ్డి గోవిందను ఉద్యోగం నుంచి తొలగించాలంటూ రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌, సహకార సంఘాల రిజిస్ర్టార్‌ జిల్లా సహకార అధికారులకు సిఫారసు చేశారు. ఇతనిని విధుల నుంచి తొలగించే అధికారాన్ని తామరం పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జికి అప్పగిస్తూ ఎలమంచిలి డివిజనల్‌ సహకార అధికారి మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ అధికారుల విచారణ యఽథావిధిగా కొనసాగుతుందని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 01:23 AM