Share News

ఆక్రమిత స్థలాల్లో ఇళ్లు క్రమబద్ధీకరణ

ABN , Publish Date - Jun 12 , 2026 | 01:43 AM

ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించి హక్కులు కల్పించడానికి చర్యలు వేగవంతం చేస్తామని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ చెప్పారు.

ఆక్రమిత స్థలాల్లో ఇళ్లు క్రమబద్ధీకరణ

ఆగస్టులో సీఎం చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేయడానికి యత్నం

కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌

ఎమ్మెల్యేలతో సమావేశం

రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ

విశాఖపట్నం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించి హక్కులు కల్పించడానికి చర్యలు వేగవంతం చేస్తామని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ చెప్పారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రమబద్ధీకరించిన ఇళ్లకు సంబంధించిన పట్టాలను ఆగస్టు నెలలో సీఎం చేతుల మీదుగా పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలపై తహశీల్దార్లకు అవగాహన ఉండాలని, మరోసారి సమావేశానికి రికార్డులతో రావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను జీవోల మేరకు రెగ్యులర్‌ చేయాలన్నారు. 22-ఎ సమస్యలు పరిష్కరించాలని, యారాడ కొండపై 450 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంటూ అక్కడ ఐటీ పార్కు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.

విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఇతరుల నుంచి కొనుగోలు చేసి నివాసం ఉంటున్న వారి వివరాలను సంక్షేమ పథకాల ఆధారంగా నిర్ధారించుకుని రెగ్యులర్‌ చేయాలన్నారు. ప్రభుత్వ భూముల వివరాలను ల్యాండ్‌ బ్యాంకులో, శ్మశాన వాటికలను ప్రభుత్వ రికార్డుల్లో శ్మశాన వాటికలుగా నమోదుచేయాలన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఎల్‌పీసీ సర్టిఫికెట్లు అందజేయాలన్నారు. గోపాలపట్నం, ములగాడ మండలాల పరిధిలో పోర్టు భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న ఇళ్లను రెగ్యులర్‌ చేసి, పోర్టుకు ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలన్నారు. దక్షిణ ఎమ్మెల్యే సీహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మహారాణిపేట తహశీల్దారు కార్యాలయానికి సొంత భవనం నిర్మించాలన్నారు. గ్రంథాలయ భవన నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నార్త్‌ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ చినముషిడివాడ, గంభీరంలో మాజీ సైనికులకు ఇచ్చిన భూములను 22-ఎ జాబితా నుంచి తొలగించాలన్నారు.

రేకులషెడ్లు మరమ్మతులు చేసుకుంటే వేధింపులు

సింహాచలం దేవస్థానం పరిధిలో గల భూముల్లో రేకులషెడ్లు నిర్మించుకుని జీవిస్తున్న సామాన్య ప్రజలను సిబ్బంది వేధిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. సమావేశం ప్రారంభంలోనే గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్‌బాబు, విష్ణుకుమార్‌రాజులు దీనిపై మాట్లాడుతూ దేవస్థానం భూముల్లో చాలాకాలం క్రితం చిన్న పాకలు, రేకుల షెడ్లు వేసుకున్నారని, అయితే వాటిలో ఎక్కువ షెడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. వాటిపై టార్పాలిన్లు, ఫ్లెక్సీలు కప్పుకుని జీవిస్తున్నవారు చిన్నపాటి మరమ్మతులు చేసుకుందామనుకుంటే సిబ్బంది అడ్డుకుని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ, రేకుల షెడ్లు, పాకల మరమ్మతులకు అనుమతి ఇస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, కార్పొరేషన్ల చైర్మన్లు గండి బాబ్జీ, వి.సతీష్‌కుమార్‌, జేసీ జి.విద్యాధరి, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు సంగీత్‌మాధుర్‌, దిలీప్‌ చక్రవర్తి, తహశీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 01:43 AM