Share News

రిజిస్ట్రేషన్లు ఫుల్‌

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:38 AM

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊపు రావడంతో జిల్లాలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది.

రిజిస్ట్రేషన్లు ఫుల్‌

భారీగా పెరిగిన ఆదాయం

ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు రూ.661.74 కోట్లు

ఆనందపురం, భీమిలిలో అధికంగా రిజిస్ట్రేషన్లు

గత ఏడాది కంటే 25.92 శాతం వృద్ధి నమోదు

గూగుల్‌ డేటా సెంటర్‌, పర్యాటక ప్రాజెక్టు ఎఫెక్ట్‌!

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊపు రావడంతో జిల్లాలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరగడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఒక్కసారిగా ఊపు వచ్చిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనందపురం, భీమిలి మండలాల్లో రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల రిజిస్ట్రేషన్ల ఆదాయం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు నెలాఖరువరకు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.661.74 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం రూ.782.95 కోట్లు. కాగా అందులో 84.52 శాతం సాధించారు.

జిల్లాలోని తొమ్మిది సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 49.403 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ ద్వారా ఈ ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలానికి అంటే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు ఆదాయం రూ.456.95 కోట్లు మాత్రమే వచ్చింది. ఆ ఏడాది తొలి ఆరు నెలలకు ప్రభుత్వ లక్ష్యం రూ.779.72 కోట్లు కాగా అందులో 58.6 శాతమే వచ్చింది. అప్పుడు 46,213 డాక్యుమెంట్ల ద్వారా ఆదాయం సమకూరింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 25.92 శాతం ఆదాయం అధికంగా వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్ల సంఖ్య 3,190 ఎక్కువగా ఉన్నాయన్నారు.

పర్యాటక రంగం ఊపుతో

భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, భీమిలి కాపులుప్పాడ, రుషికొండ తదితర ప్రాంతాల్లో అనేక పర్యాటక ప్రాజెక్టులు వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో స్టార్‌ హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణం జరుగుతోంది. గేటెడ్‌ కమ్యూనిటీలు కూడా వస్తున్నాయి. గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన జరిగి, పనులు ఊపందుకోవడంతో చాలా మంది ఆ నియోజకవర్గంలో స్థిరాస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల ఆనందపురం, భీమిలి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది.

- కళ్యాణి, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు ఆదాయం

---------------------------------------------------------------

కార్యాలయం లక్ష్యం ఆదాయం డాక్యుమెంట్లు

ఆనందపురం రూ.60.78 కోట్లు రూ.56.87 కోట్లు 3,687

భీమునిపట్నం రూ.56.93 కోట్లు రూ.52.97 కోట్లు 4,635

ద్వారకానగర్‌ రూ.74.37 కోట్లు రూ.66.75 కోట్లు 4,884

గాజువాక రూ.76.65 కోట్లు రూ.47.33 కోట్లు 4,966

గోపాలపట్నం రూ.32.13 కోట్లు రూ.33.18 కోట్లు 3,449

మధురవాడ రూ.207.87 కోట్లు రూ.178.09 కోట్లు 7,547

పెందుర్తి రూ.54.04 కోట్లు రూ.50.57 కోట్లు 4,995

సూపర్‌బజారు రూ.170.87 కోట్లు రూ.139.61 కోట్లు 10,619

పెదగంట్యాడ రూ. 49.32 కోట్లు రూ.36.38 కోట్లు 4,621

Updated Date - Oct 09 , 2026 | 12:38 AM