Share News

గాజువాకలో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రం

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:36 AM

ప్రీమియం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం సహకారం లభించింది.

గాజువాకలో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రం

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలోనే ఏర్పాటు

కేంద్రం నుంచి రూ.50 లక్షల నిధులు

విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):

ప్రీమియం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం సహకారం లభించింది. గాజువాక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సేవా కేంద్రంగా మార్పు చేయడానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ గురువారం ఎక్స్‌లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేంద్రాలు మంజూరుచేయగా అందులో విజయవాడ, గుంటూరు, కాకినాడలతో పాటు గాజువాక కూడా ఉంది. డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్స్‌ మోడరనైజేషన్‌ ప్రోగ్రామ్‌ కింద ఈ నిధులు ఇచ్చారు.

పాస్‌పోర్టు సేవా కేంద్రం (పీఎస్‌కే) తరహాలో రిజిస్ట్రేషన్లకు రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం ఇటీవల ఆలోచన చేసింది. ముందుగానే సమయం బుక్‌ చేసుకొని (స్లాట్‌ తీసుకొని) ఆ టైమ్‌కు వెళ్లి పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకునేలా ప్రతిపాదన చేసింది. జిల్లాకు ఒకటి చొప్పున ఆర్‌ఎస్‌కే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్కడ బ్యాక్‌ ఆఫీస్‌ సిబ్బందిని పెట్టి ఫైనల్‌ డాక్యుమెంట్‌ను సబ్‌ రిజిస్ట్రార్‌ పరిశీలించి ఇచ్చేలా చేస్తామని ప్రకటించింది. దీనిని వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్‌ రైటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులు పెన్‌డౌన్‌ చేశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్తంభించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నాలుగు జిల్లాల్లో ఆర్‌ఎస్‌కేల ఏర్పాటుకు నిధులు ఇవ్వడంతో ఆ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆర్‌ఎస్‌కే ఏర్పాటుకు నిధులు విడుదల చేయడంపై విశాఖ ఎంపీ శ్రీభరత్‌ హర్షం వ్యక్తంచేశారు.


సింహగిరిపైకి మినీ ఎలక్ర్టిక్‌ బస్సులు

నేటి నుంచి ప్రారంభం

పర్యాటక శాఖ ప్రయోగం

అవి రవాణా వాహనాలు కావు

విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం దేవస్థానం కోసం కొనుగోలు చేసిన మినీ ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రయోగాత్మకంగా శుక్రవారం నుంచి నడపాలని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇప్పటివరకూ అప్పుఘర్‌ వద్ద యాత్రీ నివాస్‌లో ఉంచిన వాటిని దుమ్ము దులిపి ప్రయాణానికి సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్‌’ పథకం కింద సింహాచలం దేవస్థానానికి రూ.54 కోట్లు మంజూరుచేసి ఆయా పనులు చేపట్టే బాధ్యతను పర్యాటక శాఖకు అప్పగించింది. దేవస్థానం పెద్దలు ఏమి అడిగారో...పర్యాటక శాఖాధికారులు ఏమి అర్థం చేసుకున్నారో తెలియదు గానీ ఆరు మినీ ఎలక్ర్టిక్‌ బస్సులను ఏడాదిన్నర క్రితం తెప్పించారు. వాటి విలువ సుమారు రూ.2 కోట్లు. ఆ బస్సులకు సరైన రిజిస్ట్రేషన్‌ పత్రాలు లేకపోవడం, వేగం పరిమితి 20 కి.మీ. మాత్రమే కావడంతో దేవస్థానం అధికారులు వాటిని నడపడానికి సాహసించలేదు. భక్తులకు ఏమైనా జరిగితే ఇబ్బందులు వస్తాయని వెనకడుగు వేశారు. ఏడాదిపాటు గ్యారేజీలోఉంచుకొని ఆరు నెలల క్రితం ఏపీటీడీసీకి వెనక్కి ఇచ్చేశారు. వారు ఆ ఆరు బస్సులను తీసుకువెళ్లి ఎంవీపీ కాలనీలో అప్పుఘర్‌ వద్ద యాత్రీనివాస్‌లో ఉంచారు. వాటిపై పత్రికల్లో అనేక కథనాలు రావడం, నిధులు దుర్వినియోగం అయిపోయాయని ప్రచారం జరగడంతో పర్యాటక శాఖాధికారులు ఎట్టకేలకు స్పందించారు. విజయవాడలోని ఆ శాఖ ఉన్నతాధికారులు సింహాచలం ఈఓకు ఫోన్‌ చేసి, ఆ బస్సులను తాము ప్రయోగాత్మకంగా నడుపుతామని, ఇబ్బంది ఏమీ లేకపోతే కొనసాగిస్తామని, సమస్యలు ఉంటే ఏమి చేయాలో ఆలోచిస్తామని చెప్పారు. దానికి ఈఓ వెంకటరావు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆ బస్సులను శుభ్రం చేసి శుక్రవారం నుంచి నడపడానికి ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి ఆ బస్సులు కొండలపై నడపకూడదు. ప్రాంగణాల్లో మాత్రమే నడపాలి. అంటే విమానాశ్రయాలు, యూనివర్సిటీలు, రిసార్టుల్లో సందర్శకులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేర్చడానికి మాత్రమే ఉపయోగించాలి. ఇవి రవాణా వాహనాలు కానే కావు. మరి ఏ ధైర్యంతో వీటిని నడపాలని నిర్ణయించారో వారికే తెలియాలి.


అదుపుతప్పి బోల్తాపడిన కారు

మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం

విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):

ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపంలో గురువారం రాత్రి జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం నుంచి పెందుర్తి వైపు వెళుతున్న కారు టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.


30, ఒకటి తేదీల్లో పింఛన్లు

విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):

సామాజిక పింఛన్లు ఈనెల 30, వచ్చే నెల ఒకటో తేదీల్లో పంపిణీ చేస్తామని డీఆర్‌డీఏ పీడీ బెందాళం లక్ష్మీపతి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30వ తేదీన బ్యాంకుల నుంచి సొమ్ములు డ్రా చేసి ఆయా స్వర్ణ గ్రామ, స్వర్ణసచివాలయాల పరిధిలో పింఛన్‌దారులకు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఉన్న లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లు పంపిణీ చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. అనుమతి పొందిన సిబ్బంది మాత్రమే నగదు తీసుకువెళ్లాలని, వారి వద్ద అధికారులు, బ్యాంకుల అనుమతి పత్రాలతోపాటు మొత్తం వివరాలు స్పష్టంగా ఉండాలన్నారు. సిబ్బందిలో ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినా, నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ నగదు కలిగి ఉన్నా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.

Updated Date - Nov 27 , 2026 | 01:36 AM