రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:56 AM
పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను (జీవోఎంఎస్ నంబరు 396) ఇటీవల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ విడుదల చేశారు.
పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం
తొలుత జిల్లాకు ఒకటి చొప్పున ఆర్‌ఎస్‌కేలు
దశలవారీగా కేంద్రాల పెంపు
పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం భావన
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దస్తావేజు లేఖర్లు
ఈ నెల 20 నుంచి 31 వరకు పెన్‌డౌన్
ఆస్తుల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం
నర్సీపట్నం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను (జీవోఎంఎస్ నంబరు 396) ఇటీవల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ విడుదల చేశారు. ఉత్తర్వులను అమలు చేయాలని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కి ఆదేశాలు జారీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వుండే వీటిని ‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు’గా పిలుస్తారు. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, పోలవరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో దీనిని అమలు చేస్తారు. తొలుత జిల్లాకు ఒక ఆర్‌ఎస్‌కేను ఏర్పాటు చేస్తారు. తరువాత కేంద్రాలను పెంచుకుంటూ వెళతారు. ఆర్‌ఎస్‌కేల నిర్వహణ బాధ్యతలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు ఇవ్వనుంది.
ఆర్‌ఎస్‌కేలపై ప్రభుత్వం ఏం చెబుతున్నదంటే..
పాస్ పోర్ట్ సేవా కేంద్రాల మాదిరిగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని సేవలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ చెల్లింపులు ఒకేచోట జరుగుతాయి. ఆస్తుల క్రయవిక్రయదారులు మధ్యవర్తులపై ఆధార పడడం తగ్గి పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఆర్‌ఎస్‌కేలను ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్నప్పటికీ చట్ట పరమైన నియంత్రణ పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. పీపీపీ విధానంలో కాంట్రాక్టు దగ్గించుకున్న ప్రైవేటు సంస్థలు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన వసతి, కంప్యూటర్లు, ఇంటర్నెట్, సిబ్బందిని సమకూర్చుకోవాల్సి వుంటుంది. ఆర్‌ఎస్‌కేలలో ఒక్కొక్క దస్తావేజుకి రూ.2 వేలు ఫీజుగా వసూలు చేస్తారు. దీని వల్ల ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దస్తావేజు లేఖర్లు
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును దస్తావేజు లేఖర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్‌ఎస్‌కేలను ఏర్పాటు చేసి తమ ఉపాధిని దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని అన్ని సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలకు సమీపంలో శిబిరాలు ఏర్పాటు చేసిన నిరసన తెలుపుతున్నారు. దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమం రిజిస్ర్టేషన్లపై పడింది. ప్రస్తుతం ఆషాఢమాసంతోపాటు దస్తావేజు లేఖర్ల ఆందోళన కార్యక్రమాలతో ఆస్తుల క్రయవిక్రయ రిజిస్ర్టేషన్లు చాలా తక్కువ జరుగుతున్నాయి.