Share News

రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.848.34 కోట్లు

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:41 AM

ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు చివరికి రిజిస్ట్రేషన్ల శాఖ రూ.848.34 కోట్ల ఆదాయాన్ని సాధించింది.

రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.848.34 కోట్లు

గత ఏడాది కంటే 7.74 శాతం అధికం

లక్ష్యంలో సాధించింది 62.85 శాతమే

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు చివరికి రిజిస్ట్రేషన్ల శాఖ రూ.848.34 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇది గత ఏడాది ఆదాయం రూ.787.37 కోట్ల కంటే 7.74 శాతం అధికం. అయితే ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం భారీగా ఉండడంతో అందులో 62.85 శాతమే చేరుకోగలిగింది.

విశాఖ జిల్లాలోని తొమ్మిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,349.80 కోట్ల ఆదాయం తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఈమేరకు అధికారులు ప్రయత్నించి రూ.848.34 కోట్లు సమకూర్చారు. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ, పర్యాటక రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తుండడంతో ఆ మేరకు భూముల లావాదేవీలు జరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుండడం, ఆనందపురం మండలంలో గూగుల్‌ డేటా సెంటర్‌, మధురవాడలో రిలయెన్స్‌, సిఫీ డేటా సెంటర్లు, కాగ్నిజెంట్‌, టీసీఎస్‌ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు కార్యాలయాలు ఏర్పాటుచేయడం, త్వరలో ఇన్ఫోసిస్‌ శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి ముందుకురావడంతో భీమిలి నియోజకవర్గంలో ఎక్కువ భూ లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ నిర్మాణాలు ప్రారంభిస్తే భూములకు ఎక్కుడ డిమాండ్‌ ఏర్పడుతుందని, క్రయవిక్రయాలు పెరుగుతాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ముందుచూపుతో కొనేవారు క్రమంగా పెరుగుతుండటంతో కొత్త లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఎనీవేర్‌ కింద ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునే సదుపాయం ఉండటంతో చాలామంది విశాఖపట్నంలోని సూపర్‌బజారు, మధురవాడ కార్యాలయంల్లో పనులు పూర్తి చేసుకుంటున్నారు. దాంతో ఆ రెండు చోట్ల ఆదాయం ఎక్కువగా వస్తోంది.

ప్రభుత్వం వరుసగా ప్రకటిస్తున్న ప్రాజెక్టులను చూసి దళారులు రైతులకు అడ్వాన్సులు ఇచ్చి భూముల కొనుగోళ్లకు పురోణీలు రాయించుకుంటున్నారు. ఆతంతు పూర్తయి లేఅవుట్లు వస్తే రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం మరింతగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాంటి ఒప్పందాలన్నీ రిజిస్ట్రేషన్ల వరకు వచ్చేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో రియల్‌ వ్యాపారం గతంలోనే బాగా జరిగిందని, కొత్తగా అక్కడ ఐటీ, ఏవియేషన్‌, ఎడ్యుకేషన్‌ సిటీలు ఏర్పాటుచేస్తే అప్పుడు మరిన్ని కొత్త లేఅవుట్లు వస్తాయని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి.

డిసెంబరు 2025 నాటికి కార్యాలయాల వారీగా లక్ష్యాలు, సాధించిన ఆదాయం

కార్యాలయం లక్ష్యం ఆదాయం

ఆనందపురం రూ.77.83 కోట్లు రూ.62.53 కోట్లు

భీమునిపట్నం రూ.79.70 కోట్లు రూ.57.81 కోట్లు

ద్వారకానగర్‌ రూ.141.49 కోట్లు రూ.80.61 కోట్లు

గాజువాక రూ.130.34 కోట్లు రూ.90.13 కోట్లు

గోపాలపట్నం రూ. 69.21 కోట్లు రూ.40.07 కోట్లు

మధురవాడ రూ.312.36 కోట్లు రూ.231.03 కోట్లు

పెందుర్తి రూ. 95.85 కోట్లు రూ. 60.73 కోట్లు

విశాఖ ఆర్‌ఓ రూ.329.41 కోట్లు రూ.167.59 కోట్లు

పెదగంట్యాడ రూ.113.61 కోట్లు రూ. 57.84 కోట్లు

Updated Date - Jan 17 , 2026 | 12:41 AM