Share News

ఇంటి వద్దకు రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:55 AM

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో లావాదేవీలు పూర్తయిన డాక్యుమెంట్లను రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా ఇళ్లకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇంటి వద్దకు రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు

పోస్టు ద్వారా పంపేందుకు ప్రభుత్వం యోచన

ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లాలకు సమాచారం

ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అధికారుల ఆందోళన

విలువైన పత్రాలు కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందనే వాదన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో లావాదేవీలు పూర్తయిన డాక్యుమెంట్లను రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా ఇళ్లకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో అమలు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అధికారులకు సమాచారం పంపారు. అయితే అమలు విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఒక్క డాక్యుమెంట్‌ మిస్‌ అయినా మెడకు చుట్టుకుంటుందని భయపడుతున్నారు.

ఏదైనా డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్‌ చేసిన 24 గంటల్లో సంబంధిత వ్యక్తులకు అందించాలనేది నిబంధన. చాలామంది ఆ విధంగానే తీసుకుంటున్నారు. కొన్ని కార్యాలయాల్లో ఉదయం రిజిస్టర్‌ అయినవి సాయంత్రానికే ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా డాక్యుమెంట్‌ తీసుకునేటపుడు సంబంధిత వ్యక్తి కార్యాలయంలోని రిజిస్టర్‌లో సంతకం చేసి, వేలిముద్ర వేయాలి. దరఖాస్తు కూడా పూర్తి చేసి ఇవ్వాలి. ప్రస్తుతం ఈ విధానం బాగానే జరుగుతోంది. కొందరు కక్షిదారులకు తీరిక లేక, పని అయిపోయింది కదా అనే ధీమాతో ఒకటి, రెండు రోజులు ఆగి ఆ డాక్యుమెంట్లు తీసుకుంటున్నారు. ఎక్కువగా స్థిరాస్తి లావాదేవీలు నిర్వహించే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, వారి ఉద్యోగుల ద్వారా వాటిని తెప్పించుకుంటున్నారు. పని ఒత్తిడి వల్ల ఆయా ఉద్యోగులు ఒకేసారి నాలుగైదు అయితే అప్పుడు తీసుకుంటామని జాప్యం చేస్తున్నారు.

ఫిర్యాదులు తక్కువ

రిజిస్టర్‌ చేసిన డాక్యుమెంట్‌ను ఇవ్వకుండా సబ్‌ రిజిస్ట్రార్‌ తన వద్దనే ఉంచుకున్నారనే ఫిర్యాదులు చాలా తక్కువ. ఏదైనా సాంకేతిక లోపం ఉంటే దానిని ‘పెండింగ్‌’లో పెడతారు. ఆ విషయం కక్షిదారులకు తెలియజేస్తారు. లావాదేవీలు నిర్వహించిన వారికే తీరిక లేక డాక్యుమెంట్లు కార్యాలయాల్లో ఉండిపోతున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. వెంట వెంటనే తీసుకువెళ్లాలని అధికారులు చెబుతున్నా కొందరు జాప్యం చేస్తున్నారు.

పాస్‌పోర్టులా పంపాలనేది ప్రభుత్వం ఆలోచన

పాస్‌పోర్టు కార్యాలయాల్లో జరుగుతున్న ప్రక్రియను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ విధంగా వివరాల సమర్పణకు ‘స్లాట్‌’ విధానం అమలులోకి తీసుకువచ్చారు. ఏ రోజు పని కావాలనుకుంటే ఆ రోజు ముందుగా తేదీని బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. పాస్‌పోర్టును రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా పంపినట్టు డాక్యుమెంట్‌ కూడా పంపాలని ఇప్పుడు అనుకుంటున్నారు. పాస్‌పోర్టు ఒకరిది మరొకరికి ఉపయోగపడదు కాబట్టి అవి చేతులు మారడం లేదు. అదే ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు అయితే లక్షలు, కోట్ల రూపాయల విలువైనవి చేతులు మారితే చాలా ప్రమాదం. వాటిని ఫోర్జరీ చేయడమో, తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడమో చేస్తారు. కాబట్టి వాటిని జాగ్రత్తగా సంబంధిత వ్యక్తికే అందించాలి. చాలామంది ఆధార్‌లో పేర్కొన్న చిరునామాలో ఉండరు. వేరే దగ్గర ఉంటారు. ఆ విషయం స్పష్టంగా చెప్పాలి. మరికొందరైతే ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల్లో ఉంటారు. ఈ విషయంలో కొంత ఇబ్బంది ఉంది.

అదనపు సిబ్బంది అవసరం

ప్రధాన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజుకు 50 వరకు డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అవుతాయి. వాటిని పోస్టాఫీసుకు తీసుకువెళ్లి, స్టాంపులు అతికించి, పోస్టు చేసి రావడం అదనపు పని. దీనికి ప్రత్యేకంగా ఒకరిని కేటాయించాలి. అలాగే పోస్టల్‌ చార్జీలు ఎలా అనే దానిపై స్పష్టత రావాలి. ఈ డాక్యుమెంట్లు ఒరిజనల్‌ కాబట్టి పోతే ఇబ్బంది. అందుకని వాటర్‌ ప్రూఫ్‌ కవర్‌లో పంపించాలి. ఇలా చాలా ప్రాక్టికల్‌ ఇబ్బందులు ఉన్నాయి.

కొంచెం సమయం పడుతుంది

బాలకృష్ణ, డీఐజీ, విశాఖపట్నం

ప్రభుత్వం ఈ విధానం అమలు చేయాల్సిందిగా సూచించింది. ప్రాక్టికల్‌ ఇబ్బందులన్నీ చర్చిస్తున్నాం. అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది. అయితే కక్షిదారులు వీలైంత వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే డాక్యుమెంట్‌ తీసుకుంటే చాలా మంచిది. రిస్క్‌ ఉండదు. వీలు కాని వారికి మాత్రమే వారి అభ్యర్థన మేరకు పోస్టల్‌ ద్వారా పంపిస్తాం.

Updated Date - Jun 13 , 2026 | 12:55 AM