ఆశ్రమాల్లో సంస్కరణలు
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:21 PM
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యా వ్యవస్థలో ఈ విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పు చోటుచేసుకోనుంది. గత 16 సంవత్సరాలుగా కొనసాగుతున్న 3, 4 తరగతుల అడ్మిషన్లు ఈ విద్యా సంవత్సరం నుంచి నిలిపివేయనున్నారు.
16 ఏళ్లుగా కొనసాగుతున్న విధానానికి స్వస్తి
ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదవ తరగతి నుంచే ప్రవేశాలు
ఎంపిక చేసిన ఆశ్రమ పాఠశాలల్లో మాత్రమే 3, 4 తరగతులు కొనసాగింపు
గిరిజన ప్రాంత విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావడంపై సర్వత్రా హర్షం
కొయ్యూరు, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యా వ్యవస్థలో ఈ విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పు చోటుచేసుకోనుంది. గత 16 సంవత్సరాలుగా కొనసాగుతున్న 3, 4 తరగతుల అడ్మిషన్లు ఈ విద్యా సంవత్సరం నుంచి నిలిపివేయనున్నారు. పసితనంలో పిల్లలను ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించడం వలన తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఎదుర్కొంటున్న మానసిక, శారీరక ఇబ్బందిని ప్రభుత్వం గుర్తించి ఆ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ మండలంలో కేవలం రెండు లేదా మూడు ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే 3, 4 తరగతులు కొనసాగించేలా అవకాశం కల్పిస్తూ మిగిలిన ఆశ్రమ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి నేరుగా 5వ తరగతిలో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా 2010 వరకు ఆశ్రమ పాఠశాలల్లో 6వ తరగతి నుంచే అడ్మిషన్లు ఉండేవి. విద్యార్థులు 5వ తరగతి వరకు మండల పరిషత్, జీపీఎస్(టీడబ్ల్యూ) పాఠశాలల్లో చదువుకుని 6వ తరగతి నుంచి ఆశ్రమ పాఠశాలల్లో చేరేవారు. అయితే పసుపులేటి బాలరాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న సమయంలో ఆ విధానాన్ని మార్పు చేసి మూడవ తరగతి నుంచే విద్యార్థులను ఆశ్రమ పాఠశాలల్లో చేర్చుకునేలా ఉత్తర్వులిచ్చారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి 5వ తరగతి నుంచి ఆశ్రమ పాఠశాలల్లో అడ్మిషన్లు నిర్వహించాలని నిర్ణయించిన మేరకు గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో రహదారులు, రవాణా సదుపాయం బాగున్న ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరడం, మారుమూల ప్రాంతాల్లో చేరేందుకు ఆసక్తి చూపకపోవడంతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం వంటి తారతమ్యాలు ఉండేవి. దీంతో పాఠశాల వసతి, సామర్థ్యంతో పని లేకుండా 500 నుంచి 600 మధ్యలో విద్యార్థులను కొన్ని పాఠశాలల్లో చేర్చుకునేవారు. దీంతో విద్యార్థులు కిక్కిరిసి ఉండడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది. ఎంపిక చేసిన ఆశ్రమ పాఠశాలల్లో 3 నుంచి 7 తరగతులకు విద్యార్థుల గరిష్ట సంఖ్య 240, అలాగే 5వ తరగతి నుంచి 10 తరగతులు ఉండే ఆశ్రమ పాఠశాలల్లో గరిష్ఠంగా 480 మంది విద్యార్థులు ఉండేలా నిర్దేశించింది. ఈ నిర్ణయంతో ఆశ్రమ పాఠశాలలో అన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య సమతుల్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే 3వ తరగతి నుంచే ఆశ్రమ పాఠశాలల్లో అడ్మిషన్లు జరపడం వలన గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గిపోయి మూతపడే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 4వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలల్లో విద్యాభ్యాసం తప్పనిసరి చేయడంతో ఆయా పాఠశాలలు బలోపేతమవుతాయి. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమబద్ధీకరించి గరిష్ఠ్టంగా ప్రవేశాలు జరపాలనే నిర్ణయంతో అన్ని ఆశ్రమ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడే అవకాశం ఉంది. ప్రభుత్వం గిరిజన ప్రాంత విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.