Share News

బంగారంపై రుణ పరిమితి తగ్గింపు

ABN , Publish Date - Jul 09 , 2026 | 01:05 AM

బంగారం ధరలు తగ్గుతుండడంతో బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. ఆభరణాలపై ఇచ్చే రుణ మొత్తాన్ని తగ్గించాయి. 22 క్యారెట్ల బంగారం గ్రాము ఒక దశలో రూ.16 వేలు దాటింది. ఆ సమయంలో ఆభరణాలపై గ్రాముకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు రుణంగా ఇచ్చారు.

బంగారంపై  రుణ పరిమితి  తగ్గింపు

ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం

గ్రాము రూ.1,31,200

గ్రాముకు రూ.8,500 నుంచి రూ.9,500 వరకూ ఇస్తున్న బ్యాంకులు

ధర తగ్గిన నేపథ్యంలో అప్రమత్తం

విశాఖపట్నం, జూలై 8 (ఆంధ్రజ్యోతి):

బంగారం ధరలు తగ్గుతుండడంతో బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. ఆభరణాలపై ఇచ్చే రుణ మొత్తాన్ని తగ్గించాయి. 22 క్యారెట్ల బంగారం గ్రాము ఒక దశలో రూ.16 వేలు దాటింది. ఆ సమయంలో ఆభరణాలపై గ్రాముకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు రుణంగా ఇచ్చారు. విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) గడచిన ఏడాదిలో బంగారు ఆభరణాలపై రూ.615 కోట్ల రుణాలు మంజూరుచేసింది. అయితే బంగారం ధరలపై ప్రతివారం బ్యాంకు అధికారులు సమీక్షిస్తుంటారు. ధరలకు అనుగుణంగా రుణ పరపతి సౌకర్యాన్ని తగ్గించడం, పెంచడం చేస్తుంటారు. బుధవారం 22 క్యారెట్ల బంగారం (ఆభరణాలకు వినియోగించేది) గ్రాము ధర రూ.13 వేలు ఉంది. దీంతో ప్రస్తుతం గ్రాముపై రూ.8,500 నుంచి రూ.9,500 వరకూ రుణంగా ఇస్తున్నారు. తాము ఈ వారం గ్రాముపై రూ.8,500 ఇస్తున్నామని డీసీసీబీ సీఈవో డీవీఎస్‌ వర్మ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలకు అనుగుణంగా వ్యవహరించకపోతే ఇబ్బందులు వస్తాయన్నారు. కాగా వాణిజ్య బ్యాంకులు రూ.9,200 నుంచి రూ.9,500 వరకు ఇస్తున్నాయి. ఒక్కొక్క బ్యాంకు ఒక్కో విధానం అవలంబిస్తోందని నగరంలోని ఎస్‌బీఐ సీనియర్‌ మేనేజర్‌ ఒకరు వెల్లడించారు. బంగారంపై ఇచ్చే రుణాలు ఏడాది కాలపరిమితితో కూడుకున్నవని, ఆలోగా చాలామంది ఆభరణాలను విడిపించుకుంటారని పేర్కొన్నారు. బంగారం ధరలను పశ్చిమాసియా సంక్షోభం ప్రభావితం చేస్తోందని నగరంలోని బంగారు వర్తకుడొకరు తెలిపారు. అమెరికా, ఇరాన్‌ యుద్ధం ముగిసేంత వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 01:05 AM