Share News

తగ్గిన ఉక్కు ఉత్పత్తి

ABN , Publish Date - Feb 13 , 2026 | 01:06 AM

ఉక్కు కర్మాగారంలో వారం రోజుల నుంచి హాట్‌ మెటల్‌ ఉత్పత్తి తగ్గిపోతోంది.

తగ్గిన ఉక్కు ఉత్పత్తి

వారం రోజుల నుంచి పడిపోయిన హాట్‌ మెటల్‌ ప్రొడక్షన్‌

రోజుకు 19 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం

ప్రస్తుతం 16,730 టన్నులు రాక

‘కోక్‌’ కొరతే కారణం

ముడి పదార్థాలు సరఫరా చేయలేని యాజమాన్యం జీతాల్లో కోత విధించడంపై ఉద్యోగుల ఆందోళన

విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):

ఉక్కు కర్మాగారంలో వారం రోజుల నుంచి హాట్‌ మెటల్‌ ఉత్పత్తి తగ్గిపోతోంది. రోజుకు 19 వేల టన్నులు తీయాలని యాజమాన్యం లక్ష్యం పెట్టుకోగా, ఇప్పుడు సగటు ఉత్పత్తి 16,730 టన్నులకు పడిపోయింది. ఈ నెల 9వ తేదీన కేవలం 11,872 టన్నులు మాత్రమే వచ్చింది. లక్ష్యం సాధించేందుకు అవసరమైన ముడిపదార్థాలను యాజమాన్యం అందించలేకపోతోంది.

స్టీల్‌ తయారీలో బ్లాస్ట్‌ ఫర్నేస్‌లకు కోక్‌ చాలా ముఖ్యం. దీనిని ప్లాంటులోనే తయారుచేస్తారు. బొగ్గును 18 గంటల పాటు కోక్‌ ఓవెన్‌లో హీట్‌ చేస్తే కోక్‌ తయారవుతుంది. దానిని బ్లాస్ట్‌ ఫర్నేస్‌కు పంపుతారు. అయితే ప్లాంటులోని ఐదు కోక్‌ ఓవెన్‌ బ్యాటరీల్లో నాలుగింటికి 30 ఏళ్లు దాటిపోయింది. ప్రపంచంలో కోక్‌ఓవెన్‌ బ్యాటరీల జీవితకాలం 25 ఏళ్లే. కానీ ఇక్కడ 30 ఏళ్లకు పైగా నడుపుతున్నారు. దాంతో వాటి సామర్థ్యం తగ్గిపోయింది. రోజుకు 400 పుషింగ్‌ చేయాల్సిన చోట ఇప్పుడు సగటున 293 వస్తున్నాయి. కోక్‌ తయారీకి ఇక్కడ టన్నుకు రూ.23 వేలు ఖర్చు అవుతోంది. సరిపడా ఉత్పత్తి లేనందున బయట టన్ను రూ.33 వేలు పెట్టి కొంటున్నారు. అది కూడా నాణ్యమైనది లభించడం లేదు. దాంతో స్టీల్‌ నాణ్యత కూడా తగ్గిపోతోంది. ఇటీవల ఇక్కడకు వచ్చిన స్టీల్‌ సెక్రటరీ కొత్త కోక్‌ఓవెన్‌ బ్యాటరీ నిర్మాణానికి డీపీఆర్‌ తయారు చేయాలని ఆదేశించారు. ఇది నాలుగైదేళ్ల క్రితం చేయాల్సిన పని. ఇప్పుడు ఆర్డర్‌ ఇస్తే అది తయారయ్యేసరికి ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుంది. అప్పటివరకూ తిప్పలు తప్పవని అధికార వర్గాలు చెబుతున్నాయి. అవసరమైన మేర ముడి పదార్థాలు ఇవ్వలేని యాజమాన్యం ఉత్పత్తి లక్ష్యం తగ్గిందంటూ జీతాల్లో మాత్రం కోత పెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానిని ఆపాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.

సి-షిప్టులో ఆకస్మిక తనిఖీలు

స్టీల్‌ ప్లాంటులో రాత్రి 10 నుంచి ఉదయం 6.30 గంటల వరకు పనిచేసే కాలాన్ని ‘సి’ షిఫ్ట్‌గా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఆ సమయంలో ఎవరు ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి యాజమాన్యం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అంతా పనిచేస్తున్నారా?, లేదా?...అనే విషయం పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు రోజూ చేయాలని ఆదేశించింది. దీని కోసం 24 మంది జనరల్‌ మేనేజర్లతో స్క్వాడ్‌ను నియమించింది. వీరిలో రోజుకు ముగ్గురు వివిధ విభాగాలను అర్ధరాత్రి తనిఖీ చేసి, అక్కడ విధి విధానాలు పాటిస్తున్నారా? లేదా? అనేది యాజమాన్యానికి నివేదించాలి. ఎక్కడైనా తప్పు జరిగినట్టు తెలిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హెచ్చరించింది.


డార్మిటరీ ఖాతాల్లో రూ.11 కోట్లు!

అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధుల కోసం అకౌంట్లు తెరిచిన వివిధ శాఖలు

ఖర్చు కాగా మిగిలిపోయిన నిధులు ఆ ఖాతాల్లోనే ఉండిపోయిన వైనం

రెండు దశాబ్దాలుగా లావాదేవీలు నిల్‌

ఇలాంటివి జిల్లాలో 4,000 వరకూ ఉన్నట్టు ఆర్బీఐ గుర్తింపు

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమాచారం

ఆ సొమ్ములు విత్‌డ్రాకు కసరత్తు

విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):

సుమారు రెండు నుంచి రెండున్నర దశాబ్దాలుగా లావాదేవీలు నిర్వహించని పలు ప్రభుత్వ శాఖలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ.11 కోట్ల వరకూ ఉండిపోయాయి. వాటి విత్‌డ్రాకు ఖజానా శాఖ కసరత్తు ప్రారంభించింది.

విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ శాఖలకు చెందిన నాలుగు వేలకుపైగా బ్యాంకు ఖాతాలను ఏళ్ల తరబడి ఆపరేట్‌ చేయడం లేదు. ఆర్థిక శాఖ పరిభాషలో ఈ ఖాతాలను ‘డార్మిటరీ అకౌంట్స్‌’గా పిలుస్తారు. అభివృద్ధి పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధుల కోసం బ్యాంకుల్లో ప్రత్యేకంగా ఖాతాలు తెరుస్తారు. అప్పట్లో బ్యాంకు లావాదేవీలు ఆఫ్‌లైన్‌లో నిర్వహించేవారు. ప్రభుత్వం నిర్దేశించిన పథకాల అమలుకు ఖర్చుచేయగా మిగిలిన సొమ్ములు అదే ఖాతాలో ఉండిపోతాయి. నిబంధనల ప్రకారం పథకం ముగిసిన తరువాత మిగిలిన సొమ్ములు ప్రభుత్వానికి జమ చేయాలి. కానీ మెజారిటీ శాఖల్లో అలా జరగదు. అలాగే పథకాలు అమలుచేసే సమయంలో ఉండే అధికారి, ఉద్యోగులు ఆ తరువాత బదిలీ అయితే ఒక్కొక్కసారి ఆ ఖాతాల నిర్వహణను పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. కొందరికి తెలిసి పైఅధికారుల అనుమతి కోసం లేఖ రాసినా స్పందించిన దాఖలాలు తక్కువ. అలా మిగిలిపోయిన సొమ్ములు జిల్లాలోని పలు బ్యాంకుల్లో ఉండిపోయాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పలు విభాగాలకు సంబంధించి ఖాతాల్లో ఎక్కువ నిధులు ఉన్నాయి.

ప్రభుత్వ శాఖలకు సంబంధించి సుమారు నాలుగు వేల ఖాతాల్లో కనీసం రూ.500 నుంచి రూ.50 లక్షల వరకు ఉన్నట్టు తాజాగా గుర్తించారు. ఏళ్ల తరబడి నిర్వహించని ఖాతాలు దేశవ్యాప్తంగా లక్షల్లో ఉన్నట్టు రిజర్వు బ్యాంకు గుర్తించి వాటి వివరాలను ఆయా రాష్ర్టాలకు పంపింది. తక్షణమే ఆయా సొమ్ములు విత్‌డ్రా చేసుకుని ఖాతాలు మూసివేయాలని ఆదేశించింది. రిజర్వు బ్యాంకు ఇచ్చిన వివరాలు రాష్ట్ర ఆర్థిక శాఖ ద్వారా జిల్లా ఖజానా శాఖకు వచ్చాయి. ఆ మేరకు ఆయా శాఖల అధికారులు సొమ్ముల విత్‌డ్రాకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. ఖాతాల్లో ఉన్న సొమ్ములు విత్‌డ్రాకు ఆయా శాఖల అధికారులు తొలుత బ్యాంకులకు వెళ్లి డ్రాయింగ్‌ ఆఫీసర్‌ పేరున ఈకేవైసీ చేయాలి. ఆ తరువాత విత్‌డ్రాకు కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలి. సొమ్ముల విత్‌డ్రాకు అన్ని శాఖలకు సమాచారం ఇచ్చామని జిల్లా ఖజానా అధికారి కవిటి మోహనరావు తెలిపారు.


కొండకు ఎసరు

అనధికారికంగా గ్రావెల్‌, రాయి తవ్వకాలు

దువ్విపాలెంలో వైసీపీ నేత దందా

చోద్యం చూస్తున్న ప్రభుత్వ సిబ్బంది

విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):

పెందుర్తి మండలం ఎస్‌.ఆర్‌.పురం పంచాయతీ పరిధిలోని దువ్విపాలెంలో స్థానిక వైసీపీ నేత ఒకరు అనధికారికంగా గ్రావెల్‌/రాయి తవ్వకాలు నిర్వహిస్తున్నారు. గ్రామ శివారునున్న కొండకు ఒకవైపు గ్రావెల్‌/రాయి తవ్వుకునేందుకు గనుల శాఖ ఒకరికి అనుమతి ఇచ్చింది. రెండో వైపు అనుమతులు లేకుండా వైసీపీ నేత దర్జాగా గ్రావెల్‌, రాయి తవ్వేసి తరలిస్తున్నారు. దీనికోసం మట్టి రోడ్డు ఏర్పాటుచేశారు. స్థానికుల నుంచి ఇబ్బంది లేకుండా వారికి కొంత ముట్టజెప్పారని ప్రచారం సాగుతుంది. ఇప్పటివరకూ సుమారు ఎకరా నుంచి ఎకరాన్నర విస్తీర్ణంలో గ్రావెల్‌/రాయి తీసి బయటకు తరలించారు. కొండకు ఆనుకుని కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని తోటలు పెంచుతున్నారు. వారు తొలుత అభ్యంతరం చెబితే బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయిలో రెవెన్యూ, పంచాయతీ, సచివాలయం సిబ్బందికి మామూళ్లు ఇవ్వడంతో వారంతా మౌనంగా ఉంటున్నారని అంటున్నారు.

Updated Date - Feb 13 , 2026 | 01:06 AM