తగ్గిన వరద ప్రభావం
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:04 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు శనివారానికి పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.
సాధారణ స్థితికి గెడ్డల ప్రవాహం
చకచకా రోడ్లు, కల్వర్టుల పునరుద్ధరణ పనులు
కొయ్యూరులో 27 డిగ్రీలు
పాడేరు/జి.మాడుగుల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు శనివారానికి పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గెడ్డలు సైతం శనివారం నాటికి సాధారణ స్థితికి చేరాయి. ఉదయం నుంచే ఎండ కాస్తూ సాధారణ వాతావరణం నెలకొనడంతో జనం ఊరట చెందారు. వరదల కారణంగా జిల్లాలో పలుచోట్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, ఇతర కట్టడాల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. పాడేరు-చింతపల్లి రహదారిలో మత్స్యపురం సమీపంలో కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రజలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో జి.మాడుగుల రెవెన్యూ, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో తాత్కాలిక వంతెన ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. దీంతో నుర్మతి ప్రధాన రహదారికి వనెల్బ, బొడ్డపుట్టు వద్ద వాహనాలను మళ్లించారు.
మోస్తరు ఉష్ణోగ్రతలు
మన్యంలో శనివారం కాసిన ఎండకు ఒక మోస్తరు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో కొయ్యూరులో 27 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుగా చింతపల్లిలో 25.9, అరకులోయలో 25.8, పాడేరులో 25.3, జి.మాడుగుల, అనంతగిరిలో 25.2, జీకేవీధిలో 25.1, హుకుంపేటలో 24.5, డుంబ్రిగుడలో 23.9, పెదబయలులో 23.3, ముంచంగిపుట్టులో 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇంకా పొంగుతున్న గెడ్డలు
ముంచంగిపుట్టు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తీవ్ర వాయుగుండంతో కురిసిన వర్షాలకు మండలంలోని వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని మాకవరం, దోడిపుట్టు, లక్ష్మీపురం, రంగబయలు, జోలాపుట్టు, బూసిపుట్టు, బంగారుమెట్ట, సుజనకోట, దారెల, పెదగూడ తదితర పంచాయతీల్లో గెడ్డలు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మూడు రోజులుగా గెడ్డ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైనా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో అత్యవసర పనుల నిమిత్తం అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని గెడ్డలు దాటాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకవరం పంచాయతీ బీడుచంప రాంపుట్టు మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటేందుకు ఆ ప్రాంతీయులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆ ప్రదేశంలో వంతెన నిర్మించాలని ఆ ప్రాంతీయులు కోరుతున్నారు.