Share News

తగ్గిన బర్లీ పొగాకు సాగు

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:40 AM

మండలంలో బర్లీ పాగాకు సాగు తగ్గిపోయింది. గత ఏడాది సుమారు రెండు వేల ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 500 ఎకరాలకే పరిమితమైంది.

తగ్గిన బర్లీ పొగాకు సాగు
మండలంలోని కంఠారంలో బర్లీ పొగాకు తోట

విత్తన మార్పిడితో రైతుల వెనకడుగు

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మూడొంతులు తగ్గుదల

కొయ్యూరు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మండలంలో బర్లీ పాగాకు సాగు తగ్గిపోయింది. గత ఏడాది సుమారు రెండు వేల ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 500 ఎకరాలకే పరిమితమైంది. ఐటీసీ కంపెనీ బర్లీ పొగాకు విత్తన మార్పిడి కారణంగా దిగుబడి తగ్గుతుందన్న ఉద్దేశంతో రైతులు ఈ ఏడాది వెనకడుగు వేశారు.

ప్రతి ఏడాది ఇచ్చే విత్తనాలకు బదులుగా ఈ ఏడాది కొత్త రకం విత్తనాలను ఐటీసీ కంపెనీ యాజమాన్యం రైతులకు ఇచ్చింది. పైగా మొక్క దిగువ, పైన ఉన్న ఆకులను కొనుగోలు చేయబోమని ఆంక్షలు పెట్టింది. దీంతో నష్టపోతామని భావించి బర్లీ పొగాకు సాగును రైతులు ఈ ఏడాది మూడొంతులు తగ్గించారు. మండలంలో సాగునీటి ఆధారంగా చింతలపూడి, మాకవరం, కొమ్మిక, కంఠారం, బాలారం, ఆడాకుల, బకులూరుతో పాటు మరో నాలుగు పంచాయతీల్లో ఈ సీజన్‌లో (పండుగ అనంతరం వేసవి సాగులో భాగంగా)బర్లీ పొగాకు సాగును ఏటా సుమారు రెండు వేల ఎకరాల్లో రైతులు చేసేవారు. గతంలో బ్లాంకెట్‌ ఏ-1 విత్తనంతో రైతులకు లాభాలు వచ్చేవి. అయితే ఈ సంవత్సరం వర్షాధార పంటలో ఆ విత్తనానికి బదులుగా ఐటీసీ కంపెనీ బ్లాంకెట్‌ ఏ-2 ప్రవేశపెట్టి విత్తనం మార్పిడి చేయడమే కాకుండా మొక్కకు దిగువ వరుస ఆకులు, పైన ఉన్న ఆకులు మినహా మధ్యన వచ్చే ఆకులనే కొనుగోలు చేసేలా ఆంక్షలు పెట్టడంతో రైతాంగం దిగుబడి మొత్తం అమ్ముకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి తోడు గత సంవత్సరం వరకు ఇచ్చిన బ్లాంకెట్‌ ఏ-1 విత్తనం సాగుతో మొక్కకు 36 నుంచి 38 మేర ఆకులు వచ్చేవి. ప్రస్తుతం సాగు చేసిన బ్లాంకెట్‌-2 విత్తన మొక్కకు కేవలం 24 ఆకులు వచ్చి అనంతరం పువ్వు వచ్చేస్తుంది. దీంతో దిగుబడి తగ్గిపోవడమే కాకుండా బర్లీ పొగాకు కొనుగోలు చేసే కంపెనీ ఆంక్షల వలన గత సంవత్సరంతో పోలిస్తే సగానికి ఆదాయం తగ్గిపోయే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బర్లీ పొగాకు ఎకరానికి ప్రతీ ఏటా 1,000 కిలోల దిగుబడి రాగా, ఈ సంవత్సరం 600 కిలోలు దాటి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత సంవత్సరం బర్లీ పొగాకు కిలో రూ.115 ధర పలికింది. ఈ సంవత్సరం పొగాకు కొనుగోలు చేసే ఐటీసీ, ఐఎల్‌టీడీ, మెట్టపల్లి ఆదినారాయణ, తదితర కంపెనీలు వర్షాధార పంట చేతికి వచ్చినా ఇంకా ధర నిర్ణయించలేదు. దీంతో చేతికి వచ్చిన బర్లీ పొగాకు అమ్ముకోలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వేసవిలో ప్రత్యామ్నాయ పంట వైపు దృష్టి సారిస్తున్నారు.

Updated Date - Jan 30 , 2026 | 12:40 AM