Share News

నియోజకవర్గాల పునర్విభజన

ABN , Publish Date - Mar 25 , 2026 | 01:34 AM

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించడంతో పాటు పెంచాలని కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెడతారని ప్రచారం జరుగుతోంది. దాదాపు 50 శాతం సీట్లు పెరుగుతాయని అంటున్నారు. విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం ఒక పార్లమెంటు స్థానం ఉంది. విశాఖపట్నం, పక్కనున్న అనకాపల్లి జిల్లాల పరిధిలో మరో లోక్‌సభ స్థానం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రస్తుతం ఆరు ఉండగా, తొమ్మిది లేదా పది కావచ్చునని అంచనా వేస్తున్నారు.

నియోజకవర్గాల  పునర్విభజన

పెరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు

అసెంబ్లీ స్థానాలు 3 లేదా 4 పెరిగే చాన్స్‌

భీమిలి, గాజువాక, తూర్పు నియోజకవర్గాలను

రెండుగా విభజించే అవకాశం

మధురవాడ కేంద్రంగా కొత్త నియోజకవర్గం?

మారనున్న నియోజకవర్గాల రూపురేఖలు

మూడో వంతు స్థానాలు మహిళలకే..

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పరిధిలో అదనంగా

మరో లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటు?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించడంతో పాటు పెంచాలని కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెడతారని ప్రచారం జరుగుతోంది. దాదాపు 50 శాతం సీట్లు పెరుగుతాయని అంటున్నారు. విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం ఒక పార్లమెంటు స్థానం ఉంది. విశాఖపట్నం, పక్కనున్న అనకాపల్లి జిల్లాల పరిధిలో మరో లోక్‌సభ స్థానం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రస్తుతం ఆరు ఉండగా, తొమ్మిది లేదా పది కావచ్చునని అంచనా వేస్తున్నారు.

నియోజకవర్గాల పునర్విభజన అనేది భౌగోళిక విస్తీర్ణం ప్రకారం కాకుండా జనాభా ప్రాతిపదికగానే జరగనుంది. 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుంటారంటున్నారు. ఆ లెక్కల ప్రకారం విశాఖ జిల్లా జనాభా 20 లక్షలు. వాస్తవికంగా ఇప్పటి లెక్కలు తీసుకుంటే 27 లక్షలు. ఇందులో కూడా జనాభా ఆధారంగా నియోజకవర్గాలను ఏర్పాటుచేస్తారా?, ఓటర్ల ఆధారంగా చేస్తారా?...అనే అంశంపై స్పష్టత లేదు. జనాభా అంటే పిల్లలు, పెద్దలు అందరినీ కలిపి లెక్కిస్తారు. ఓటర్ల ప్రాతిపదికగా తీసుకుంటే 18 ఏళ్లు దాటి ఓటు హక్కు కలిగిన వారినే లెక్కల్లోకి తీసుకుంటారు. అప్పుడు సంఖ్య తగ్గుతుంది.

ఇటీవల 2024లో నిర్వహించిన సాధారణ ఎన్నికల లెక్కల ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య 20,22,350. వారిలో పురుషుల సంఖ్య 9,97,078. మహిళల సంఖ్య 10,25,151. ట్రాన్స్‌జెండర్లు మరో 121 మంది ఉన్నారు. ప్రతి రెండు లక్షల మంది ఓటర్లకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం అనుకుంటే జిల్లాలో పది నియోజకవర్గాలు వస్తాయి. ప్రస్తుతం జిల్లాలో భీమిలి, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తర, విశాఖ దక్షిణ, గాజువాక పెందుర్తి పేర్లతో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి.

- భీమిలి నియోజకవర్గం ఓటర్లపరంగా, విస్తీర్ణం పరంగాను పెద్దది. ఇక్కడ 3,66,561 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ విశాఖపట్నం సిటీని ఆనుకొని ఉన్న మధురవాడ, పీఎం పాలెం, ఎండాడ పరిసర ప్రాంతాల్లోనే మూడు లక్షల జనాభా ఉన్నారు. భీమిలిని రెండుగా విభజించి మధురవాడ పేరుతో ఒక నియోజకవర్గం, భీమిలి పేరుతో భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలతో మరో నియోజకవర్గం ఏర్పాటుచేసే అవకాశం ఉంది.

- గాజువాక ఓటర్ల జనాభా 3,35,536 మంది. దీనిని కూడా రెండుగా విభజించాల్సి ఉంది. ఇక్కడ దువ్వాడ, కూర్మన్నపాలెం ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. జనాభా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గాజువాక నుంచి ఈ రెండింటిని విడదీసి దువ్వాడ/కూర్మన్నపాలెం పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటుచేసే అవకాశం ఉంది. దీనికి కొంత జనాభాను కలుపుకోవాలని అనుకుంటే పశ్చిమ నియోజకవర్గంలోని సింధియా ప్రాంతాన్ని జత చేసుకోవచ్చు.

- విశాఖపట్నం తూర్పు జనాభా 2,92,450. దీనిని కూడా రెండుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆరిలోవ ప్రాంతంలో ఓటర్ల సంఖ్య అధికం. హనుమంతవాక, ఆరిలోవ, పైనాపిల్‌ కాలనీ, కృష్ణాపురం, అవసరమైతే విశాలాక్షినగర్‌ కలుపుకొని ఆరిలోవ/హనుమంతవాక పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయవచ్చు. తూర్పులో మిగిలిన ఎంవీపీ కాలనీ, అప్పుఘర్‌, పెదజాలరిపేట, మద్దిలపాలెం ప్రాంతాలన్నీ కలిసి తూర్పు నియోజకవర్గం కిందనే ఉంటాయి.

- జిల్లాలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూడా జనాభా ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ లెక్క 2,84,638 మంది. గాజువాకను రెండుగా చేసినప్పుడు విశాఖ పశ్చిమ నుంచి సింధియా వంటి ప్రాంతాలను అటు కలిపితే విశాఖ ఉత్తరంలో కొంత భాగాన్ని ఎన్‌ఏడీ సమీప ప్రాంతాలను విశాఖ పశ్చిమంలో కలిపితే హెచ్చుతగ్గులు సరిపోతాయి.

- పెందుర్తి నియోజకవర్గం ప్రస్తుతం గందరగోళంగా ఉంది. పెందుర్తి మండలం మాత్రం విశాఖ జిల్లాలో ఉండి, అందులోని మిగిలిన రెండు మండలాలు పరవాడ, సబ్బవరం అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు పెందుర్తి మండలాన్ని, పక్కనే ఉన్న కొన్ని జీవీఎంసీ వార్డులను కలిపి పెందుర్తి నియోజకవర్గం విశాఖలో ఉంచి, పరవాడ, సబ్బవరం మండలాలకు అదనంగా కొన్ని ప్రాంతాలు కలిపి పరవాడ పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేసుకోవచ్చు.

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనాభా 2,17,784. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు అవసరమైన సర్దుబాట్లు ఏమైనా ఉంటే ఇందులో కొన్ని ప్రాంతాలను అటు ఉత్తర నియోజకవర్గంలో కానీ, అటు తూర్పులో కానీ జత చేసుకోవచ్చు.

అదనంగా మరో లోక్‌సభ స్థానం

విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రస్తుతం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పెందుర్తిని అనకాపల్లి పార్లమెంటులో చేర్చి, విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటను విశాఖ లోక్‌సభలో ఉంచారు. అలాకాకుండా ఆ నియోజకవర్గాన్ని విజయనగరం పార్లమెంటు నియోజవర్గ పరిధిలో కలపాలనే డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. ఇప్పుడు కొత్తగా భీమిలి నుంచి ఒకటి, తూర్పు నుంచి ఒకటి, పెందుర్తి పూర్తిగా విశాఖ జిల్లా పరిధిలో ఉంటుందని అనుకుంటే పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు అవుతాయి. అప్పుడు విశాఖపట్నం, పక్కనున్న అనకాపల్లి జిల్లాల పరిధిలో మరొక కొత్త లోక్‌సభ స్థానం వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందులో ఏయే నియోజకవర్గాలు ఉంచుతారు?, కొత్త పేరు ఏమి పెడతారనేది ఆలోచించాల్సిందే.

మహిళలకు 33 శాతం స్థానాలు

బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్రం పునర్విభజన బిల్లుతో పాటు మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు కూడా పెట్టాలని నిర్ణయించింది. దానిని పక్కాగా అమలు చేస్తామని చెబుతోంది. అదే జరిగితే రాష్ట్రంలో మహిళలకు కేటాయించే సీట్ల సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో అన్ని పార్టీలు ఆయా జిల్లాల్లో కులాలు, బలాబలాల సమీకరణాలు చూసుకొని మహిళలకు సీట్లు కేటాయిస్తున్నాయి. ప్రతి పార్టీ జిల్లాలో ఒకరికి లేదా ఇద్దరు మహిళలకు మాత్రమే అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అవకాశం ఇస్తున్నాయి. ఇకపై కేటాయించే సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విశాఖ జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు వస్తే...అందులో మూడు మహిళలకు లభించనున్నాయి. అంటే ప్రతి పార్టీ ఆ నిష్పత్తి ప్రకారమే మహిళలనే పోటీకి దించాలి. దాంటో చట్టసభల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతాయి.

Updated Date - Mar 25 , 2026 | 01:34 AM