Share News

వార్డుల పునర్విభజన

ABN , Publish Date - May 19 , 2026 | 12:44 AM

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిని 120 వార్డులుగా విభజిస్తూ తయారుచేసిన ముసాయిదాను కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ సోమవారం విడుదల చేశారు.

వార్డుల పునర్విభజన

జీవీఎంసీ పరిధిలో 98 నుంచి 120కి పెంపు

ముసాయిదా విడుదల

ఉత్తర జోన్‌లో అత్యధిక వార్డులు

భీమిలి, అగనంపూడి జోన్‌లలో అత్యల్పం

జీవీఎంసీ జోనల్‌, తహశీల్దార్‌, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ప్రదర్శన

ఈ నెల 25వ తేదీ వరకూ అభ్యంతరాల స్వీకరణ

విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి):

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిని 120 వార్డులుగా విభజిస్తూ తయారుచేసిన ముసాయిదాను కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ సోమవారం విడుదల చేశారు. ఆయా వార్డుల సరిహద్దులతో కూడిన ముసాయిదా, మ్యాప్‌లను జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని జోనల్‌, తహశీల్దార్‌, సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా జీవీఎంసీ వెబ్‌సైట్‌లో ముసాయిదా, వార్డుల వారీగా మ్యాప్‌లను పొందుపరిచారు. వీటిపై ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలను ఈనెల 25 వరకు అందజేయవచ్చునని కమిషనర్‌ కోరారు.

ఉత్తర జోన్‌లో అత్యధిక వార్డులు...అనగంపూడి, భీమిలిలో అత్యల్పం:

జీవీఎంసీ పరిధిలోని పది జోన్లలో ఉత్తర జోన్‌లో అత్యధికంగా 20 వార్డులు ఉండగా, భీమిలి, అగనంపూడి జోన్‌ల పరిధిలో ఐదేసి వార్డులు మాత్రమే ఏర్పడ్డాయి. మధురవాడ జోన్‌లో ఏడు, తూర్పు జోన్‌లో 18, దక్షిణ జోన్‌లో 16, ఉత్తర జోన్‌లో 20, పశ్చిమ జోన్‌లో 17, గాజువాక జోన్‌లో 19, అగనంపూడిజోన్‌లో ఐదు, అనకాపల్లి జోన్‌లో ఆరు, పెందుర్తి జోన్‌లో ఏడు...ఇలా మొత్తం 120 వార్డులను విభజించారు.

భీమిలితో మొదలు కంబాలకొండతో ఆఖరు

జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను భీమిలి జోన్‌వైపు నుంచి ప్రారంభించారు. కొండపేట కాలనీ, గోస్తనీ నదికి ఆనుకుని ఉన్న వసంతవిహార్‌ లేఅవుట్‌, చిట్టివలస పరిసర ప్రాంతాలను ఒకటో వార్డుగా విభజించారు. ఇక మధురవాడ జోన్‌ పరిధిలో కంబాలకొండ రిజర్వు ఫారెస్ట్‌, అడవివరం జంక్షన్‌, సింహాచలం కొండ మీదుగా పాతగోశాల, ప్రహ్లాదపురం, సింహపురి లేఅవుట్‌ ఫేజ్‌-2, ఎర్రకొండ ఫారెస్ట్‌ ప్రాంతాలను 120వ వార్డుగా నిర్ణయిస్తూ విభజన ప్రక్రియను పూర్తిచేశారు.

అభ్యంతరాలు

కాగా ముసాయిదా విడుదల చేసిన కొద్దిసేపటికే వార్డుల విభజనపై అభ్యంతరాలు ప్రారంభమయ్యాయి. వార్డుల సరిహద్దులు నిర్ణయించడానికి గెడ్డలు, రోడ్లు, రైల్వే ట్రాక్‌లను ప్రామాణికంగా తీసుకోకుండా ఎమ్మెల్యేలు చెప్పినట్టు చేశారంటూ సీపీఎం మాజీ కార్పొరేటర్‌ గంగారావు ఆరోపించారు. వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని, దీనిపై తాను లిఖితపూర్వకంగా తన అభ్యంతరాలను తెలియజేస్తానన్నారు. మధురవాడ జోన్‌లో పీఎం పాలెంలో పక్కనున్న కాలనీలను వదిలేసి ఎక్కడో ఉన్న ఎంవీవీసిటీని ఒక వార్డులో కలపడం విడ్డూరంగా ఉందని, మధురవాడ జోన్‌లో ఇష్టారాజ్యంగా జరిగిపిన వార్డుల విభజన ప్రక్రియలో లోపాలను సవరించాలని జనసేన పార్టీ నేత ఈఎన్‌ఎస్‌ చంద్రరావు డిమాండ్‌ చేశారు.

జోన్‌ వార్డుల సంఖ్య వార్డు నంబర్లు

భీమిలి 5 ఒకటి నుంచి ఐదు

మధురవాడ 7 6 నుంచి 11 మరియు 120

తూర్పు 18 12 నుంచి 29

దక్షిణం 16 30 నుంచి 45

ఉత్తర 20 46 నుంచి 65

పశ్చిమం 17 66 నుంచి 82

గాజువాక 19 83 నుంచి 101

అగనంపూడి 5 102 నుంచి 106

అనకాపల్లి 6 107 నుంచి 112

పెందుర్తి 7 113 నుంచి 119

Updated Date - May 19 , 2026 | 12:44 AM