రెడ్ అలర్ట్
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:26 AM
తీవ్ర తుఫాన్ ‘అక్వాన్’ ఉత్తరాంధ్రకు సమీపంగా వచ్చి, ఒడిశా వైపు వెళుతుంది. బుధవారం రాత్రికి కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 520 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారం మధ్యాహ్నానికి విశాఖకు సమాంతరంగా అది కూడా తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తుఫాన్ ప్రభావంతో నేటి నుంచి నగరంలో గాలులు, వర్షాలు
అప్రమత్తంగా ఉన్నాం: కలెక్టర్
విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):
తీవ్ర తుఫాన్ ‘అక్వాన్’ ఉత్తరాంధ్రకు సమీపంగా వచ్చి, ఒడిశా వైపు వెళుతుంది. బుధవారం రాత్రికి కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 520 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారం మధ్యాహ్నానికి విశాఖకు సమాంతరంగా అది కూడా తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీరానికి ఆనుకుని ఉన్న విశాఖకు తుఫాన్ ముప్పు ఉందని హెచ్చరించింది. గురువారం ఉదయం నుంచి గాలుల వేగం పెరగనున్నది. వర్షాలు మొదలుకానున్నాయి. గురు, శుక్రవారాలు విశాఖతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురుస్తాయని బులెటిన్ జారీచేశారు. గురువారం సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు వస్తాయని వాతావరణ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. తుఫాన్ తీరానికి సమీపంగా వచ్చేసరికి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని హెచ్చరించారు. కాగా తుఫాన్ ప్రభావంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గురు, శుక్రవారాలు జిల్లాలో భారీవర్షాలు కురుస్తాయని, గాలులు వీస్తాయని, కొండవాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ విజ్ఞప్తిచేశారు. ఆర్డీవో కార్యాలయాలు, తహశీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశామన్నారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూమ్ 24 గంటలు పనిచేసేలా సిబ్బందిని నియమించామన్నారు.
జీవీఎంసీ పరిధిలో 11 కంట్రోల్‌రూమ్‌లు
తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలో 11 కంట్రోల్‌రూమ్‌లు, లోతట్టు ప్రాంతాల్లో 55 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ తెలిపారు. సహాయక చర్యల కోసం 30 జేసీబీలు, 70 టిప్పర్లు, 30 మినీ ఎక్స్‌కవేటర్లు సిద్ధం చేశామన్నారు. నిరంతరం సేవలందించేందుకు సిటీ ఆపరేషన్ సెంటర్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు. ఎక్కడైనా చెట్లు కూలిపోతే తక్షణం తొలగించేందుకు వీలుగా హార్టికల్చర్ విభాగం ఆధ్వర్యంలో 15 ప్రత్యేక బృందాలను, పారిశుధ్య నిర్వహణకు 98 రాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ప్రజలకు ఏదైనా సహాయం అవసరమైనా, అత్యవసర పరిస్థితులు తలెత్తినాసరే 180042500009, వాట్సాప్ నంబర్9014218870 నంబర్‌కు సంప్రతించాలని కోరారు.