Share News

రికార్డుస్థాయిలో బెల్లం లావాదేవీలు

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:37 AM

అనకాపల్లి ఎన్టీఆర్‌ మార్కెట్‌యార్డులో ప్రస్తుత సీజన్‌లో సోమవారం రికార్డు స్థాయిలో బెల్లం లావాదేవీలు జరిగాయి.

రికార్డుస్థాయిలో బెల్లం లావాదేవీలు

ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డుకు 13 వేల దిమ్మలు రాక

ప్రస్తుత సీజన్‌లో ఇవే అత్యధికం

స్వల్పగా తగ్గిన ఒకటో రకం బెల్లం

పది శాతం వరకు పెరిగిన రెండు, మూడు రకాలు..

అనకాపల్లి టౌన్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) :

అనకాపల్లి ఎన్టీఆర్‌ మార్కెట్‌యార్డులో ప్రస్తుత సీజన్‌లో సోమవారం రికార్డు స్థాయిలో బెల్లం లావాదేవీలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి రైతులు 13,005 బెల్లం దిమ్మలను యార్డుకు తీసుకువచ్చి విక్రయించారు. జనవరి ఐదో తేదీన అత్యధికంగా 11,799 దిమ్మలు రాగా, సోమవారం మరో 1,206 బెల్లం దిమ్మలు అధికంగా వచ్చాయి. వాస్తవానికి నవంబరు నుంచే రోజూ కనీసం పది వేల బెల్లం దిమ్మలు యార్డుకు వచ్చేవి. అయితే బెల్లం ధరలు ఆశించినస్థాయిలో లేకపోవడంతో పలువురు రైతులు చెరకు సాగును విరమించకున్నారు. ఈ ప్రభావం బెల్లం తయారీపై పడింది. సాధారణ రోజుల్లో మార్కెట్‌ యార్డుకు ఐదారు వేలకు మించి బెల్లం దిమ్మలు రావడంలేదు. కాగా సోమవారం ఒకటో రకం బెల్లం వంద కిలోలు రూ.4,170, రెండో రకం రూ.4,020లు, మూడో రకం రూ.3,540 ధరలు పలికాయి. సుమారు నెల రోజుల క్రితం ధరలతో పోల్చితే.. ఒకటో రకానికి రూ.50 తగ్గగా, రెండో రకం రూ.370 , మూడో రకం రూ.230 పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌ యార్డులకు వస్తున్న బెల్లం ఒడిశా, పశ్చిమబెంగాల్‌తో ఏపీని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతున్నదని బెల్లం ఎగుమతి వర్తకుడు కోలపర్తి కన్నబాబు చెప్పారు. కొంత సరుకును అన్‌ సీజన్‌లో అమ్మకాల కోసం కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 01:37 AM