జాఫ్రాకు రికార్డు స్థాయి ధర
ABN , Publish Date - Feb 06 , 2026 | 10:55 PM
మన్యంలో జాఫ్రా (అన్నటో) ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ప్రాంతీయ మార్కెట్‌లో ప్రైవేటు వర్తకులు, ఎఫ్‌పీవోలు కిలో జాఫ్రా గింజలను రూ.280 లకు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కంటే అధిక ధర లభించడంతో ఆదివాసీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాంతీయ మార్కెట్‌లో కిలో రూ.280కి కొనుగోలు
గత ఏడాది కంటే అధిక ధర
ఆదివాసీ రైతుల సంతోషం
చింతపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి అల్లూరి జిల్లా పాడేరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో రైతులు పంట పొలాల గట్లపై జాఫ్రాను సాగు చేస్తున్నారు. జాఫ్రా మొక్కల ఆకులను పశువులు ఆహారంగా తీసుకోవు. దీంతో రైతులు ప్రధానంగా పంట పొలాల గట్లపై కంచెగాను, మరోవైపు అదనపు ఆదాయం కోసం జాఫ్రాను సాగు చేస్తున్నారు. ఈ మొక్కల సాగుకి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరంలేదు. నాటిన మూడో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభం అవుతుంది. ఈ మొక్కలకు తెగుళ్లు ఆశించిన దాఖలాలు లేవు. గిరిజన ప్రాంతం వాతావరణం జాఫ్రా సాగుకు అత్యంత అనుకూలం. దీంతో మెజారీటీ రైతులు పంట పొలాల చుట్టూ కంచెగా నాటుకుంటున్నారు. మరికొంతమంది రైతులు ఆదాయం కోసం పంట పొలాల్లో సాగు చేస్తున్నారు. జాఫ్రా గింజల నుంచి సహజ సిద్ధమైన రంగు లభిస్తుంది. దీంతో జాఫ్రాను ఆర్గానిక్ ఫుడ్ కలర్స్‌గానూ, కాస్మోటిక్స్‌లోనూ అధికంగా ఉపయోగిస్తున్నారు. దీంతో జాఫ్రాకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. ఆహార ఉత్పత్తులు, కాస్మోటిక్స్‌లో సింథటిక్ కలర్స్ వినియోగించడం వల్ల గతంలో జాఫ్రా గింజలకు ధర తక్కువగా ఉండేది. ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక డిమాండ్ పెరగడంతో జాఫ్రా గింజలకు మంచి ధర లభిస్తున్నది. 2023 వరకు జాఫ్రా గింజలను ప్రాంతీయ మార్కెట్‌లో ప్రైవేటు వర్తకులు కిలో రూ.90-100 ధరకు కొనుగోలు చేసేవారు. 2024లో ఒకేసారి జాఫ్రా ధర రూ.170, 2025లో రూ.250 ధర లభించింది. జాఫ్రా ధర పెరగడం వల్ల ఆదివాసీ రైతులు ఈగింజలను ప్రత్యేకంగా సేకరించి మార్కెట్ చేసుకుంటున్నారు. ఈఏడాది (2026)లో మార్కెట్ ప్రారంభంలోనే జాఫ్రా గింజలకు రూ.260 ధర లభించగా, ప్రస్తుతం రూ.280లకు ప్రైవేటు వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. జాతీయ మార్కెట్‌లో కిలోకి రూ.220 ధర లభిస్తున్నది. ఈమేరకు గిరిజన ప్రాంతంలో జాఫ్రా గింజలను కొనుగోలు చేసేందుకు వర్తకులు పోటీపడుతున్నారు. చింతపల్లి, జీకేవీధి, జి.మాడుగుల మండలాల్లో ఽధింసా ఆర్గానిక్ రైతు ఉత్పత్తిదారుల సంఘం కిలో రూ.280 గరిష్ఠ ధరకు కొనుగోలు చేస్తుందని సీఈవో వాడకాని దేవి ప్రవళిక తెలిపారు. జాఫ్రా మార్కెటింగ్ కోసం రైతులు 7981637171, 9019963131 నంబర్లను సంప్రదించవచ్చునన్నారు.