జనసేనకు సేవలందిస్తున్న వారికి గుర్తింపు
ABN , Publish Date - Jun 30 , 2026 | 01:42 AM
జనసేన ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న జనసైనికులు, వీర మహిళలకు తగిన గుర్తింపు కల్పించేందుకు పార్టీ నిర్మాణ సాధన సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు పెండం దొరబాబు పేర్కొన్నారు.
నేటి నుంచి మూడు రోజులపాటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు
నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తుల స్వీకరణ
అర్హులకు త్వరలో కీలక బాధ్యతలు అప్పగింత
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు పెండం దొరబాబు
అనకాపల్లి టౌన్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి):
జనసేన ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న జనసైనికులు, వీర మహిళలకు తగిన గుర్తింపు కల్పించేందుకు పార్టీ నిర్మాణ సాధన సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు పెండం దొరబాబు పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి మాట్లాడారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సూచనల మేరకు కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పార్టీ ఆరంభం నుంచి నిబద్ధతతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టినట్టు చెప్పారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అనకాపల్లిలో మూడు రోజులపాటు కమిటీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల హోటల్‌లో 30వ తేదీ ఉదయం ఎలమంచిలి నియోజకవర్గం, మధ్యాహ్నం మూడు గంటలకు సత్యా గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం, జూలై ఒకటో తేదీ ఉదయం చోడవరం నియోజకవర్గం, మధ్యాహ్నం మాడుగుల నియోజకవర్గం, రెండో తేదీ ఉదయం నర్సీపట్నం నియోజకవర్గం, మధ్యాహ్నం అనకాపల్లి నియోజకవర్గం, మూడో తేదీన ఉదయం పెందుర్తి నియోజకవర్గం, మధ్యాహ్నం పాయకరావుపేట నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. దరఖాస్తుల పరిశీలనలో స్థానిక నేతల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అన్ని దరఖాస్తులను పార్టీ అధిష్ఠానం పరిశీలించి అర్హత, సేవ ప్రాతిపదికన తగిన ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. ఈ సమావేశంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
నర్సీపట్నం డివిజన్‌లో రెండు లక్షల విత్తన బంతులు
చెట్ల పెంపకం, పచ్చదనం పెంపే లక్ష్యం
నర్సీపట్నం రేంజర్ కేవీ రాజేశ్
గొలుగొండ, జూన్ 29 (ఆంధ్రజ్యోతి):
నర్సీపట్నం అటవీ డివిజన్ పరిఽధిలో ప్రస్తుత వర్షాకాలంలో రెండు లక్షల విత్తన బంతులను చల్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఫారెస్ట్ రేంజర్ కేవీ రాజేశ్ తెలిపారు. సోమవారం గొలుగొండ మండలం ఆరిలోవ అటవీ ప్రాంతంలో పాఠశాల విద్యార్థులతో కలిసి విత్తన బంతులను విసిరే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కానుగ, వేప, నేరేడు, నల్లమద్ది, తదితర జాతుల విత్తనాలతో వీఎస్‌ఎస్ సభ్యులు వేసవిలో సీడ్ బాల్ ్సను తయారు చేశారని చెప్పారు. విత్తన బత్తుల ద్వారా చెట్ల పెంపకం చేపట్టి తద్వారా పచ్చదనాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్య్రమంలో నర్సీపట్నం సెక్షన్ ఫారెస్టర్ రామాంజులు, గార్డులు ఇందిర, సంధ్యారాణి, ఎం.రమణ, వీఎస్‌ఎస్ సభ్యులు అప్పారావు, ఉపాధ్యాయులు కె.బాలచంద్రుడు, ఎర్రవరం పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
చురుగ్గా సర్
98.01 శాతం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి
డిజిటలైజేషన్‌లో ఒకింత వెనుకబాటు
ఇంతవరకు 19.42 శాతం మాత్రమే పూర్తి
ప్రక్రియ వేగవంతానికి చర్యలు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం జిల్లాలో చురుగ్గా సాగుతున్నది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. బీఎల్‌వోలు తమ పరిధిలోని ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తున్నారు. ఓటర్ల వ్యక్తిగత వివరాలు, చిరునామాలు, కుటుంబ సభ్యులు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం జిల్లాలో మొత్తం 13,02,389 మంది ఓటర్లకు అవసరమైన ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్‌లు) ముద్రణను నూరు శాతం పూర్తి చేశారు. సోమవారం సాయంత్రానికి 12,76,460 (98.01 శాతం) మందికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని పూర్తిచేశారు. రాష్ట్రస్థాయిలో అనకాపల్లి జిల్లా తొమ్మిదో స్థానంలో వుంది. వీరిలో 2,52,953 (19.42 శాతం) మంది నుంచి భర్తీ చేసిన ఫారాలను తిరిగి వెనక్కు తీసుకుని డిజిటలైజ్ చేశారు. అయితే ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో ముందున్న యంత్రాంగం వాటిని తిరిగి సేకరించి డిజిటలైజ్ చేయడంలో ఒకింత వెనుకబడ్డారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,52,953 (19.42 శాతం) ఫారాలను మాత్రమే డిజిటలైజ్ చేయగలిగారు. ఈ విషయంలో అనకాపల్లి జిల్లా బాగా వెనుకబడి రాష్ట్రస్థాయిలో 19వ స్థానంలో వుంది. ఎన్యూమరేషన్ ఫారాల్లోని వివరాలను వేగంగా డిజిటలైజ్ చేసేందుకు అదనపు సిబ్బందిని వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ నేతృత్వంలో బీఎల్‌ఓల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.