రెబల్స్...గుబుల్స్
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:38 AM
జీవీఎంసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబల్స్ బెడద ఎక్కువగానే ఉంది.
టికెట్లు దక్కకపోవడంతో ఇండిపెండెంట్లుగా పోటీ
ఇంచుమించు సగానికిపైగా వార్డుల్లో...
ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన
గెలుపోటములపై ప్రభావం
ఫలితం ఎలా ఉంటుందోనని చర్చ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబల్స్ బెడద ఎక్కువగానే ఉంది. టికెట్లు ఆశించి భంగపడిన పలువురు ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగారు. అంతా కాకపోయినా కొందరు ప్రచారం కూడా పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. దీంతో ఫలితం ఎలా ఉంటుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
కూటమిలో సీట్ల సర్దుబాటు చివరివరకూ కొలిక్కిరాకపోవడంతో మూడు పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారంతా సమయం మించిపోతుందని నామినేషన్లు వేసేశారు. ఆ తర్వాత కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు జరిగినా, అవకాశం లభించని వారంతా అసంతృప్తికి గురయ్యారు. తాము ఇండిపెండెంట్లుగా పోటీలో ఉంటామని ప్రకటించడంతో ఆయా పార్టీల నేతలు సంప్రతింపులు జరిపి కొందరితో నామినేషన్లు ఉపసంహరింపజేశారు. మరికొన్నిచోట్ల మాత్రం బలమైన నేతలు ఇండిపెండెంట్లుగా కొనసాగుతున్నారు. ఒకటో వార్డులో సొంగా అప్పలరాజు టీడీపీ రెబల్‌గా ఉన్నారు. అదే వార్డులో వైసీపీ నుంచి కనకల హేమలత టికెట్ ఆశించారు. ఆమెకు కాకుండా వేరొకరికి టికెట్ ఖరారు చేయడంతో హేమలత వైసీపీ రెబల్‌గా ఉన్నారు. ఐదో వార్డు నుంచి జనసేన తరపున టికెట్ ఆశించిన శెట్టి లక్ష్మికి కాకుండా వేరొకరికి బీ ఫారం ఇవ్వడంతో ఆమె ఇండిపెండెంట్‌గా నిలిచారు. 26వ వార్డులో మాజీ కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్‌కు కాకుండా ముగడ వెంకటలక్ష్మికి అవకాశం కల్పించడంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. 31వ వార్డులో అంగటి శ్రావణ్‌కుమార్ జనసేన నుంచి టికెట్ ఆశించినప్పటికీ, అవకాశం దక్కకపోవడంతో రెబల్‌గా నిలిచారు. 36వ వార్డులో జనసేనకు చెందిన కొల్లి సింహాచలం, 39వ వార్డులో టీడీపీ టికెట్ ఆశించిన నవీన్‌కుమార్ రెబెల్స్‌గా నిలిచారు. 40వ వార్డును జనసేనకు కేటాయించడంతో అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన బంటుపల్లి సత్యవతి ఇండిపెండెంట్‌గా పోటీకి దిగారు. 41వ వార్డులో టీడీపీ నుంచి టికెట్ ఆశించిన పంపాన రాజ్యలక్ష్మికి అవకాశం దక్కకపోవడంతో ఆమె ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. 48వ వార్డులో టీడీపీ నుంచి టికెట్ లభించకపోవడంతో కొయిలాడ వెంకటేశ్ ఇండిపెండెంట్‌గా పోటీకి దిగారు. 49వ వార్డులో జనసేన నుంచి టికెట్ ఆశించిన పోతు నాగమణి, 61వ వార్డులో టీడీపీ టికెట్ ఆశించిన బొడ్డేపల్లి లలిత రెబల్స్ బరిలో నిలిచారు. అదేవార్డులో జనసేన నుంచి గుడివాడ అప్పారావు కూడా రెబల్‌గా బరిలో నిలిచారు. 65వ వార్డులో గొలగాని సౌజన్యకు టికెట్ దక్కకపోవడంతో ఆమె రెబల్‌గా పోటీకి దిగారు. 75వ వార్డును జనసేనకు కేటాయించడంతో అక్కడ టీడీపీ నుంచి టికెట్ ఆశించిన గేదెల రమణ ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచారు. 80వ వార్డు నుంచి టికెట్ ఆశించిన టీడీపీ నేత కోరాడ శ్రీనివాసరావు ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్నారు. 81వ వార్డు నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశించిన నక్కా లక్ష్మణరావుకు నిరాశ ఎదురవడంతో రెబల్‌గా నిలిచారు. 85వ వార్డును టీడీపీకి కేటాయించడంతో అక్కడ జనసేన నుంచి టికెట్ ఆశించినా మోకా శాలిని రెబల్‌గా పోటీకి దిగారు. అదే వార్డులో వైసీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన కమరున్నీషాబేగమ్ రెబల్‌గా పోటీలో నిలిచారు. 86వ వార్డును జనసేనకు కేటాయించడంతో అక్కడ టీడీపీ నుంచి టికెట్ ఆశించిన కాకి గోవిందరెడ్డి రెబల్‌గా పోటీ చేస్తున్నారు. 88వ వార్డును జనసేనకు కేటాయించడంతో అక్కడ టీడీపీ తరఫున టికెట్ ఆశించిన బలగ బాలకృష్ణ, 90వ వార్డులో వైసీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన మహ్మద్‌గౌస్, 91వ వార్డులో టికెట్ ఆశించి భంగపడిన జనసేన నేత తిప్పల వంశీరెడ్డి, 95వ వార్డులో టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన కాతా బాలకృష్ణ రెబల్స్‌కు ఉన్నారు. 97వ వార్డును టీడీపీకి కేటాయించడంతో అక్కడ జనసేన తరఫున టికెట్ ఆశించిన కరణం కనకారావు, 99వ వార్డులో టీడీపీ టికెట్ ఆశించిన గోకాడ భాస్కర్, కర్రి కృష్ణ, 100వ వార్డులో టీడీపీ టికెట్ ఆశించిన లేళ్ల కోటేశ్వరరావు, 101వ వార్డులో టీడీపీ టికెట్ ఆశించిన కర్రి ఈశ్వరరావు, లేళ్ల పద్మజ, 106వ వార్డు టీడీపీకి కేటాయించడంతో అక్కడ జనసేన నుంచి టికెట్ ఆశించిన దల్లి రామునాయుడు ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. 114వ వార్డును జనసేనకు కేటాయించడంతో అక్కడ నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశించిన వాల్లె తాతారావు రెబల్‌గా పోటీలో నిలిచారు. 117వ వార్డు నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశించిన శానాపతి శంకరరావు ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచారు. 118వ నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశించిన గంట్ల లక్ష్మి రెబల్‌గా పోటీలో నిలిచారు. 119వ వార్డును బీజేపీకి కేటాయించడంతో అక్కడ టీడీపీ నుంచి టికెట్ ఆశించిన రాపర్తి కన్నా రెబల్‌గా బరిలో నిలిచారు. రెబల్స్‌గా టీడీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి తొమ్మిది మంది, వైసీపీ నుంచి నలుగురు పోటీలో నిలిచారు. దీంతో ఆయా వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
జీవీఎంసీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు
18,37,901 మంది ఓటర్లు, 1,994 పోలింగ్ కేంద్రాలు
15 వేల సిబ్బంది నియామకం
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):
వచ్చే నెల ఒకటో తేదీన జరగనున్న జీవీఎంసీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లుచేశామని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. సోమవారం తన ఛాంబర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ పది జోన్‌ల పరిధిలో 1,994 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశామని, 2021 ఎన్నికలతో పోల్చితే 260 కేంద్రాలు పెరిగాయన్నారు. మొత్తం 120 వార్డుల పరిధిలో 18,37,901 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారన్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యను 1,200 నుంచి 1000కు తగ్గించామన్నారు. అత్యధికంగా మద్దిలపాలెంలోని కృష్ణా కళాశాలలో 22 పోలింగ్ కేంద్రాలు, మరో ఇరవైచోట్ల పది, అంతకంటే ఎక్కువ కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఎక్కువ కేంద్రాలు ఉన్నచోట్ల ఓటర్లు ఇబ్బంది పడకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి ఓటరు మేయర్‌కు పింక్, కార్పొరేటర్‌కు తెలుపు రంగు బ్యాలెట్ పేపరులో ఓటు వేయాలన్నారు. పోలింగ్ సజావుగా నిర్వహణకు ప్రతి జోన్‌కు ఒక డిప్యూటీ కలెక్టర్‌ను నియమించామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఐదుగురు సిబ్బందిని వినియోగించనున్నామని, మొత్తం 15 వేల మంది విధుల్లో ఉంటారని అన్నారు. విశాఖతోపాటు పొరుగు జిల్లాల నుంచి ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు తీసుకున్నామని పేర్కొంటూ వారికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు భోజనం ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. జీవీఎంసీలో కంట్రోల్ రూమ్ నిరంతరం పనిచేస్తుందన్నారు.