Share News

రీబార్స్‌ రీ ఎంట్రీ

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:52 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు గత కొంతకాలంగా నిలిపివేసి ‘వైజాగ్‌ టీఎంటీ’ రీబార్ల ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించింది.

రీబార్స్‌ రీ ఎంట్రీ

‘వైజాగ్‌ టీఎంటీ’ ఉత్పత్తిని ప్రారంభించిన స్టీల్‌ప్లాంటు

విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు గత కొంతకాలంగా నిలిపివేసి ‘వైజాగ్‌ టీఎంటీ’ రీబార్ల ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించింది. నిర్మాణ రంగంలో ఈ రీబార్లను అత్యధికంగా వినియోగిస్తారు. ఇవి నాణ్యతకు పెట్టింది పేరు. ప్లాంటులోని వివిధ విభాగాల్లో వెలువడే వృథా వాయువులతో రీబార్ల యూనిట్‌ నడిచేలా ఏర్పాట్లుచేశారు. అయితే వివిధ కారణాల వల్ల ప్లాంటు పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడకవపోవడం వల్ల వృఽథా వాయువులు తగినంత అందక ఈ యూనిట్‌ సరిగ్గా పనిచేయలేదు. దీంతో ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకొని వారి వద్ద ఇప్పటివరకు రీబార్లు తయారు చేయించారు. మార్కెట్‌లో వైజాగ్‌ టీఎంటీ రీబార్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, సొంతంగానే తయారు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించి ఈ నెల 15వ తేదీ నుంచి రీబార్ల యూనిట్‌ను పునఃప్రారంభించింది. దాంతో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిణామంపై డీలర్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు.


రైల్వే ఆదాయం రూ.3,149.46 కోట్లు

విశాఖ డివిజన్‌లో గత ఏడాదితో పోలిస్తే 2.25 శాతం అధికం

21.29 మిలియన్‌ టన్నుల సరకు రవాణా

16.52 మిలియన్ల ప్రయాణికుల రాకపోకలు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం రైల్వే డివిజన్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ. 3,149.46 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 2.25 శాతం అధికం. కొత్తగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు అయ్యాక వాల్తేరు డివిజన్‌ను రద్దుచేసి, విశాఖపట్నం డివిజన్‌ వచ్చిన సంగతి తెలిసిందే. పరిధి కూడా కుదించుకుపోయింది. కేకే లైన్‌ ఒడిశాలోని రాయగడ డివిజన్‌లోకి వెళ్లిపోయింది. దాంతో బైలదిల్లా గనుల నుంచి రవాణా అయ్యే ఐరన్‌ఓర్‌ ఆదాయం ఆ డివిజన్‌ పరిధిలోకి వెళ్లిపోయింది. దీని వల్ల విశాఖ డివిజన్‌ ఆదాయం తగ్గుతుందని భావించారు. అయితే విశాఖలో రెండు పోర్టులు ఉండడం వల్ల ఆదాయంలో తేడా కనిపించలేదు. గత ఏడాది (2025-26) ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు మొత్తం ఆదాయం రూ3,080.27 కోట్లు కాగా ఈ ఏడాది అదే కాలానికి రూ.3,149.46 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో సరకు రవాణా ఆదాయం గత ఏడాది రూ.2,618.25 కోట్లు కాగా ఈ ఏడాది రూ.2,624.01 కోట్లు సమకూరింది. పరిమాణం పరంగా చూసుకుంటే గత ఏడాది 20.85 మిలియన్‌ టన్నులు రవాణా చేయగా ఈ ఏడాది 21.29 టన్నులకు పెరిగింది. ప్రయాణికుల పరంగా చూసుకుంటే గత ఏడాది 16.22 మిలియన్ల మంది విశాఖ డివిజన్‌లో ప్రయాణం చేయగా ఈ ఏడాది 16.52 మిలియన్లకు పెరిగింది. వారి ద్వారా సమకూరిన ఆదాయం గత ఏడాది రూ.420.85 కోట్లు కాగా ఈ ఏడాది రూ.477.82 కోట్లకు పెరిగింది. ప్రయాణికులకు సంబంధించి ఇతర ఆదాయాలన్నీ కలుపుకొంటే గత ఏడాది రూ.462.02 కోట్లు రాగా ఈ ఏడాది ఆ మొత్తం రూ.525.45 కోట్లకు పెరిగింది. పార్కింగ్‌ ఫీజుల ద్వారా ఈ ఏడాది రూ.6.72 కోట్లు, కేటరింగ్‌ ద్వారా రూ.1.81 కోట్లు, టికెట్‌ చెకింగ్‌ల ద్వారా రూ.29.21 కోట్లు, పార్సిల్‌ లగేజీల ద్వారా రూ.12.38 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే వర్గాలు తెలిపాయి.

ఆర్టీసీ 41 స్పెషల్స్‌

ద్వారకాబస్‌స్టేషన్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): దసరా తిరుగు ప్రయాణికుల రవాణాకు ఆర్టీసీ శుక్రవారం 41 ప్రత్యేక సర్వీసులు నడిపింది. సాధారణ షెడ్యూల్‌ సర్వీసుల సామర్ధ్యానికి మించి ప్రయాణికుల డిమాండ్‌ ఉండడంతో ప్రత్యేక సర్వీసులు ఆపరేట్‌ చేసింది. ఉత్తరాంధ్ర వాసులు తిరుగు ప్రయాణం కావడంతో ద్వారకాకాంప్లెక్సు, మద్దిలపాలెం బస్టాండ్‌ రద్దీగా మారాయి. దీంతో హైదరాబాద్‌కు 10, విజయవాడకు 7, తిరుపతికి 2, రాజమండ్రికి 4, కాకినాడకు 2, శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు 10, విజయనగరం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు 6 ప్రత్యేక సర్వీసులు నడిపారు. శని, ఆదివారాల్లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


జిల్లా కలెక్టర్‌ పేరుతో నకిలీ వాట్సాప్‌ ఖాతా

అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కలెక్టర్‌ పేషీ హెచ్చరిక

విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):

జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ పేరు, గుర్తింపుతో గుర్తు తెలియని వ్యక్తి నకిలీ వాట్సాప్‌ ఖాతాను సృష్టించి, పలువురికి సందేశాలు పంపిస్తూ డబ్బులు కోరుతున్నట్టు కలెక్టర్‌ పేషీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కలెక్టర్‌ పేరుతో డబ్బులు కోరుతూ వచ్చే అనుమానాస్పద వాట్సాప్‌ సందే శాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీ వంటి రహస్య సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని, ఎట్టి పరిస్థితు ల్లోనూ డబ్బులు బదిలీ చేయవద్దని కలెక్టర్‌ పేషీ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది.

Updated Date - Oct 24 , 2026 | 12:52 AM