మహిళలకు అభయం
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:55 AM
బాలికలు, మహిళల రక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్ని కళాశాలల వద్ద ‘అభయ’ ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయిస్తున్నారు. ‘అభయ’ కార్యక్రమం కింద ఇప్పటికే ఇంజనీరింగ్, ప్రభుత్వ/ ప్రైవేటు డిగ్రీ/ జూనియర్ కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు.
బాలికలు, మహిళలపై వేధింపుల నిరోధానికి పోలీసు శాఖ చర్యలు
ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు
మహిళా పోలీసులతో ప్రత్యేకంగా శక్తి టీమ్‌లు
కళాశాలల వద్ద ఫిర్యాదు పెట్టెలు
నర్సీపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): బాలికలు, మహిళల రక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్ని కళాశాలల వద్ద ‘అభయ’ ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయిస్తున్నారు. ‘అభయ’ కార్యక్రమం కింద ఇప్పటికే ఇంజనీరింగ్, ప్రభుత్వ/ ప్రైవేటు డిగ్రీ/ జూనియర్ కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. బాలికలు/ మహిళల రక్షణ చట్టాలు, ఆపద సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి పోలీసు ఉన్నతాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఉమన్ హెల్ప్‌లైన్ నంబరు 181, చైల్డ్ హెల్ప్ లైన్ నంబరు 1098, సైబర్ క్రైమ్ నంబరు 1930, ఎమర్జెన్సీ నంబరు 112 గురించి వివరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళా పోలీసులతో ప్రత్యేకంగా శక్తి పోలీసు టీమ్‌లు ఏర్పాటు చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు లేదా ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు శక్తి టీమ్‌లో పని చేస్తున్నారు. నర్సీపట్నం, పరవాడ, అనకాపల్లి పోలీస్ సబ్ డివిజన్ల స్థాయిలో ఒక్కొక్కటి చొప్పున మూడు టీమ్‌లు, జిల్లా స్థాయిలో ఒక శక్తి టీమ్ వున్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉన్న విద్యార్థినులతో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. అత్యవసర సమయంలో ఈ యాప్‌ను ఎలా వినియోగించాలో తెలియజేస్తున్నారు. శక్తి పోలీసు టీమ్‌లు ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, రద్దీ ప్రదేశాల్లో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. అమ్మాయిలను వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతున్న ఆకతాయిల పని పడుతున్నారు.తాజాగా జిల్లా పోలీసు అధికారులు పాఠశాలలు, జూనియర్/ డిగ్రీ/ ఇంజనీరింగ్ కళాశాలల్లో అభయ ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయిస్తున్నారు. నర్సీపట్నంలో 50చోట్ల ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. అభయ ఫిర్యాదుల పెట్టెకు సంబంధించి ఒక తాళం ప్రిన్సిపాల్/ హెచ్‌ఎంల వద్ద, రెండో తాళం పోలీసుల వద్ద వుంటుంది. కళాశాలలో ర్యాగింగ్ చేసినా, విద్యార్థినులపట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, లైగింక వేధింపులకు పాల్పడినా.. అటువంటి వారి పేర్లను కాగితంపై రాసి ‘అభయ’ ఫిర్యాదుల బాక్సులో వేయాలి. రోజుకు ఒకసారి ఈ బాక్సులను తెరిచి, ఫిర్యాదులు ఏమైనా వుంటే పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారు.