చిన్నారుల గుండెకు భరోసా
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:56 AM
పుట్టుకతోనే గుండె సమస్య కలిగిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తోంది.
పుట్టుకతోనే సమస్య ఉన్నవారికి ఉచితంగా శస్త్రచికిత్స
ఆర్బీఎస్‌కేలో భాగంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం
నగరంలో మెడికవర్ ఆస్పత్రి ఎంపిక
నాలుగు నెలల కిందట కేజీహెచ్‌లో నిర్వహించిన శిబిరంలో 42 మంది గుర్తింపు
అందులో 11 మందికి ఇప్పటికే శస్త్ర చికిత్సలు నిర్వహణ
త్వరలో మరో 31 మందికి...
విశాఖపట్నం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి):
పుట్టుకతోనే గుండె సమస్య కలిగిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తోంది. ఈ ఆపరేషన్లు గతంలో తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రిలో మాత్రమే చేస్తుండేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి జిల్లాలోనూ గుండె ఆపరేషన్లు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం నగరంలో మెడికవర్ ఆస్పత్రిని ఎంపికచేసింది. రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్‌కే)లో భాగంగా ఈ శస్త్రచికిత్సలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఆర్బీఎస్‌కే అధికారులు, మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రత్యేకంగా వైద్య శిబిరాలను నిర్వహించి గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులను గుర్తిస్తున్నారు. గడచిన ఏడాది అక్టోబరు పదో తేదీన కేజీహెచ్‌లోని డిస్ర్టిక్ట్ ఎర్లీ ఇంట్రెవెన్షన్ సెంటర్ (డీఈఐసీ)లో మెడికవర్ వైద్యులతో గుండె జబ్బులతో బాధపడే చిన్నారులను గుర్తించే శిబిరాన్ని నిర్వహించారు. దీనిపై జిల్లా అంతా విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించడంతోపాటు స్థానిక ఆరోగ్య సిబ్బందికి భాగస్వాములను చేశారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో 42 మందికి శస్త్రచికిత్సలు చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు వారి తల్లిదండ్రులను సిద్ధం కావాలని చెప్పిన వైద్యులు..ప్రాధాన్యం బట్టి శస్త్రచికిత్సల నిర్వహణ షెడ్యూల్‌ను ఇచ్చారు.
విజయవంతంగా 11 మందికి నిర్వహణ
మొత్తం 42 మంది చిన్నారుల్లో పదకొండు మందికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయవలసి ఉందని వైద్యులు గుర్తించారు. ఈ మేరకు ఐదుగురికి మెడికవర్ ఆస్పత్రిలో ఆపరేషన్ నిర్వహించగా, ముగ్గురికి తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్ హార్ట్ హాస్పిటల్‌లో, మరో ముగ్గురికి విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్స్‌లో శస్త్ర చికిత్సలు నిర్వహించారు. మిగిలిన 31 మందికి దశల వారీగా నిర్వహించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. చిన్నారుల తల్లిదండ్రులకు రూపాయి ఖర్చు లేకుండా ఈ శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నట్టు ఆర్బీఎస్‌కే జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ హారిక తెలిపారు. సాధారణంగా ఈ తరహా గుండె శస్త్ర చికిత్సలకు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఎన్‌టీఆర్ వైద్య సేవ కార్డు ఉంటే అందులో, ఒకవేళ లేకపోయినా ప్రత్యేక అనుమతి ద్వారా పిల్లలకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.
గుర్తించడం కీలకం..
గుండె జబ్బులతో బాధపడే చిన్నారులను సకాలంలో గుర్తించడం కీలకం. ఆయాసం, తీవ్రమైన దగ్గు, గుండె వేగంగా కొట్టుకోవడం, ఎప్పటికప్పుడు అనారోగ్యానికి గురవుతుండడం, ఎదుగుదల లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అధికారులు ఏర్పాటుచేస్తున్న వైద్య శిబిరాలకు తీసుకువచ్చి పరీక్షలు చేయించాలని అధికారులు కోరుతున్నారు.