Share News

రియల్టర్‌ అరాచకం

ABN , Publish Date - May 30 , 2026 | 12:42 AM

మండలంలోని వంగలి శివారు తెలుకలపాలెం ఒక రియల్టర్‌ అరాచకం సృష్టించారు. భూమిని తనకు అమ్మలేదన్న కక్షతో గ్రామానికి చెందిన రైతుల మామిడి తోటను అర్ధరాత్రి నరికివేయించాడు. బాధిత రైతుల ఫిర్యాదుతో పోలీసులు సదరు రియల్టర్‌పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత రైతులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

రియల్టర్‌ అరాచకం
రియల్టర్‌ మనుషులు నరికివేసిన మామిడి చెట్లు

పొలం అమ్మలేదని రైతులపై కక్ష

అర్ధరాత్రి రంపాలతో మామిడి చెట్లు నరికివేత

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

రియల్టర్‌పై కేసు నమోదు

సబ్బవరం, మే 29 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వంగలి శివారు తెలుకలపాలెం ఒక రియల్టర్‌ అరాచకం సృష్టించారు. భూమిని తనకు అమ్మలేదన్న కక్షతో గ్రామానికి చెందిన రైతుల మామిడి తోటను అర్ధరాత్రి నరికివేయించాడు. బాధిత రైతుల ఫిర్యాదుతో పోలీసులు సదరు రియల్టర్‌పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత రైతులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

తెలుకలపాలెం గ్రామానికి చెందిన వడిశల వెంకటరమణ, ఎర్రంనాయుడుకు వంగలి సర్వే నంబరు 230/3లో సుమారు 40 సెంట్ల భూమి ఉంది. ఇందులో 20 ఏళ్ల క్రితం వేసిన మామిడి చెట్లు ఉన్నాయి. వీరి భూమి చుట్టూ బంగారమ్మపాలేనికి చెందిన రియల్టర్‌ బీశెట్టి వెంకటరావు రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు చెందిన భూములు, వెంచర్‌ వున్నాయి. 40 సెంట్లను తనకు అమ్మేయాలని ఆయన కొంతకాలంగా రైతులను కోరుతున్నాడు. కానీ భూమిని అమ్మడానికి వారు ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో 25వ తేదీ మధ్యాహం సుమారు 15 మంది వ్యక్తులు ఎక్స్‌కవేటర్‌తో మామిడి తోటలోకి వెళ్లారు. చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వడంతో రైతులు వెంకటరమణ, ఎర్రంనాయుడు, వారి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు రైతులు వెళ్లి, వారిని నిలదీశారు. ఈ భూమిని బీశెట్టి వెంకటరావు కొనుగోలు చేశారని, ఆయన పురమాయించిన మేరకు మామిడి చెట్టు తొలగించడానికి వచ్చామని చెప్పారు. దీంతో రైతులు, గ్రామస్థులు గట్టిగా వాగ్వాదానికి దిగడంతో వచ్చిన వ్యక్తులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో రైతులు వెంకటరమణ, ఎర్రంనాయుడు, అదే రోజు రియల్టర్‌ బీశెట్టి వెంకటరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలాఉండగా 26వ తేదీ రాత్రి సుమారు 18 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న 14 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు రంపాలతో మొదళ్లను కోసి, చెట్లను కూల్చివేశారు. 27వ తేదీ ఉదయం పొలానికి వెళ్లిన రైతులు దీనిని చూసి ఖిన్నులయ్యారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి రియల్టర్‌పై ఫిర్యాదు చేశారు. సీఐ రామచంద్రరావు మామిడి తోట వద్దకు వెళ్లి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ భూమిని ఎవరికీ అమ్మలేదని, అంతేకాక బీశెట్టి వెంకటరావు నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని సీఐని కోరారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీశెట్టి వెంకటరావుపై గురువారం రాత్రి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Updated Date - May 30 , 2026 | 12:42 AM