Share News

పేదల సొంతింటి కల సాకారం

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:21 AM

పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

పేదల సొంతింటి కల సాకారం
నర్సీపట్నం మునిసిపాలిటీలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తున్న దృశ్యం

పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉంటే రూ.2.5 లక్షలు మంజూరు

ప్రతీ మూడు నెలలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు

రెండు విడతల్లో 535 గృహాలు మంజూరు

నర్సీపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉండి పక్కా ఇల్లు నిర్మించుకునే స్థోమత లేని పేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. పీఎంఏవై- 2.0 అర్బన్‌ హౌసింగ్‌ పథకంలో కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షలు మంజూరు చేస్తుంది. ఇందులో కేంద్రం వాటా రూ.1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.లక్ష ఇస్తుంది.

జిల్లాలోని నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలు, జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లిలో సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది. సొంత స్థలం ఉన్న పట్టణ వాసులు అవసరమైన ధ్రువపత్రాలు జత పరిచి సచివాలయంలో పీఎంఏవై 2.0కి దరఖాస్తు చేసుకోవాలి. దీనికి కాల పరిమితి పెట్టకుండా దరఖాస్తులు తీసుకోవడం నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం చేపడుతున్నది. సచివాలయాల్లో ఇళ్ల కోసం లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తులను హౌసింగ్‌ అధికారులు పరిశీలించి, అర్హులు జాబితా సిద్ధం చేస్తున్నారు. మూడు నెలలకోసారి డీపీఆర్‌ తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. ప్రభుత్వం జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు ఇళ్లు మంజూరు చేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో గృహ నిర్మాణ పథకం నీరుగారి పోయిన విషయం తెలిసిందే. జగనన్న కాలనీల పేరుతో ఊరుకి చివర్లో సెంటు స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు చాలక లబ్ధిదారులు పూర్తిస్థాయిలో ఇళ్లు నిర్మించుకోలేక పోయారు. కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నది. తాజాగా పట్టణ ప్రాంతాల్లో ఏడో విడత ఇళ్లు మంజూరు చేసింది. నర్సీపట్నం మునిసిపాలిటీకి 81, అనకాపల్లికి 47, ఎలమంచిలికి 171 ఇళ్లు మంజూరయ్యాయి.

రెండు విడతల్లో 535 ఇళ్లు మంజూరు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పీఎంఏవై 2.0 అర్బన్‌ హౌసింగ్‌ పథకంలో ఆరు, ఏడు విడతల్లో జిల్లాకి 535 ఇళ్లు మంజూరు చేసింది. నర్సీపట్నం మునిసిపాలిటీకి ఆరో విడతలో 66, ఏడో విడతలో 81, ఎలమంచిలికి ఆరో విడతలో 86, ఏడో విడతలో 171, అనకాపల్లికి ఆరో విడతలో 84, ఏడో విడతలో 47 ఇళ్లు మంజూరు చేసింది. ప్రభుత్వం ఇస్తున్న రూ.2.5 లక్షలు నాలుగు విడతల్లో చెల్లింపులు చేస్తారు. పునాదులు, రూఫ్‌, శ్లాబ్‌ స్థాయి వరకు రూ.1.8 లక్షలు, ఫినిషింగ్‌ పనులకు మిగిలిన రూ.70 వేలు చివర్లో మంజూరు చేస్తారు.

Updated Date - Sep 18 , 2026 | 12:21 AM