Share News

రియల్‌ మాయాజాలం

ABN , Publish Date - Oct 06 , 2026 | 01:16 AM

ఆనందపురం మండలం మామిడిలోవలో ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ దాదాపు ఎనిమిది ఎకరాలు కొనుగోలు చేసింది.

రియల్‌ మాయాజాలం

  • లేఅవుట్‌కు ప్రభుత్వ భూమిలో రహదారి

  • గెడ్డ పోరంబోకులో కల్వర్టు నిర్మాణానికి షరతులతో కూడిన అనుమతి

  • భూకేటాయింపు నిబంధనల ప్రకారమే చేసినట్టు పేర్కొన్న అధికారులు

  • ఆ లేఅవుట్‌కు అదే ప్రధాన రహదారి

  • ఈ వ్యవహారంలో కిందిస్థాయి అధికారులకు భారీగా లబ్ధి కలిగినట్టు ఆరోపణలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆనందపురం మండలం మామిడిలోవలో ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ దాదాపు ఎనిమిది ఎకరాలు కొనుగోలు చేసింది. ఆ భూమిలో లేఅవుట్‌ వేయాలనుకుంది. అయితే రోడ్డు సదుపాయం లేదు. రహదారి లేకపోతే లేఅవుట్‌కు అనుమతి రాదు. దాంతో అక్కడున్న గెడ్డ పోరంబోకు భూమిపై కన్నేసిన సంస్థ...తెలివిగా అధికారులను ప్రసన్నం చేసుకుని ప్రభుత్వ నిబంధనల్లో వెసులుబాటు ఆధారంగా కల్వర్టు నిర్మాణం ప్రారంభించింది. తద్వారా రియల్‌ ఎస్టేట్‌ సంస్థ భారీగా లబ్ధి పొందనున్నది. ఈ తతంగం వెనుక కొందరు అధికారులు భారీగా ప్రయోజనం పొందారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మామిడిలోవ పంచాయతీ పరిధిలో ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ దాదాపు ఎనిమిది ఎకరాలు కొనుగోలు చేసింది. ఆ భూమికి సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో లేఅవుట్‌ వేయడానికి అవకాశం లేకుండాపోయింది. రోడ్డు సదుపాయం లేకుండా లేఅవుట్‌ వేస్తే వీఎంఆర్‌డీఏ అనుమతి ఇవ్వదు. రోడ్డు సదుపాయం లేని లేఅవుట్‌లో స్థలాలను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకురారు. అదే సంస్థ 2018లో వుడా (ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ) అనుమతితో వేసిన లేఅవుట్‌ ఒకటి ఈ భూమికి సమీపంలోనే ఉంది. ఆ లేఅవుట్‌కు ప్రస్తుతం లేఅవుట్‌ వేయాలని ప్రతిపాదించిన భూమికి మధ్యలో ప్రభుత్వభూమి ఉంది. ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లో సర్వే నంబర్‌ 23/1 (ఎల్‌పీఎం నంబర్‌ 39)లో 1.62 ఎకరాలు గెడ్డ పోరంబోకుగా నమోదై ఉంది. అందులో రోడ్డు నిర్మాణం కోసం అనుమతివ్వాలని, అందుకోసం ప్రభుత్వానికి ఎంత చెల్లించాల్సివస్తే అంత చెల్లిస్తామని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంది. అయితే గెడ్డపోరంబోకు భూమిలో రోడ్డు నిర్మాణానికి నిబంధనలు అనుమతించవు కాబట్టి, అధికారులు ప్రత్యామ్నాయాన్ని సూచించినట్టు తెలిసింది. గెడ్డ పోరంబోకులో కల్వర్టు నిర్మిస్తామని, అందుకు ఎంత భూమి అవసరమవుతుందో అంత భూమికి ప్రభుత్వ ధర ప్రకారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. అస్మదీయులైన అధికారులు ఇచ్చిన సలహా ప్రకారం రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రతినిధులు గెడ్డ పోరంబోకులోని ఐదు సెంట్ల స్థలంలో కల్వర్టు నిర్మాణానికి అనుమతివ్వాలని, ఆ మేరకు ప్రభుత్వానికి రిజిస్ర్టేషన్‌ విలువ ప్రకారం చెల్లించేస్తామని దరఖాస్తు చేసుకున్నారు. ఆ ప్రతిపాదనపై నీటి పారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు నివేదిక తీసుకున్న తర్వాత అక్కడ ఎకరా ప్రభుత్వ ధర రూ.37 లక్షలు ఉంది కాబట్టి, ఐదు సెంట్లకు రూ.4,62,500 చెల్లించాలని, కల్వర్టు వినియోగంపై కొన్ని షరతులతో కూడిన అనుమతిని జారీచేశారు. ఆ పనులు పూర్తయితే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కొనుగోలు చేసిన భూమికి రోడ్డు సదుపాయం అందుబాటులోకి వస్తుంది. అక్కడ వేసే లేఅవుట్‌కు వీఎంఆర్‌డీఏ అప్రూవల్‌ వస్తే ఆ సంస్థకు భారీగా లబ్ధి కలుగుతుంది. ఈ క్రమంలో తమకు సహకరించిన అధికారులకు కూడా అదేస్థాయిలో నజరానాలను అందించినట్టు రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారం సాగినట్టు కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుకరూ.లక్షలు చేతులు మారాయని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే అవినీతి అఽధికారుల బండారం బయటపడుతుందని పేర్కొంటున్నారు.

Updated Date - Oct 06 , 2026 | 01:16 AM