రెండో దశ పోరుకు రెడీ
ABN , Publish Date - Nov 17 , 2026 | 01:32 AM
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రెండో దశ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది.
ఎనిమిది మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
రేపటి నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
29న పోలింగ్, ఓట్ల లెక్కింపు
అనకాపల్లి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రెండో దశ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆయా మండలాల్లో అధికారులు షెడ్యూల్‌ను ప్రకటించారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని మునగపాక, అడ్డరోడ్డు రెవెన్యూ డివిజన్ పరిధిలోని కోటవురట్ల, నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎలమంచిలి మండలాల్లోని పంచాయతీల్లో రెండో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మండలాల్లోని 213 పంచాయతీ సర్పంచ్ పదవులు, 2072 వార్డు సభ్యుల పదవులకు ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మొత్తం 4,17,399 మంది ఓటర్లు వుండగా.. వీరిలో పురుషులు 2,04,676 మంది, మహిళలు 2,12,721 మంది, ఇతరులు ఇద్దరు వున్నారు. బుధవారం ఆయా గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు ఉదయం 10.30 గంటలకు నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. 20వ తేదీ వరకు రోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీన తిరస్కరించిన నామినేషన్లపై ఆర్‌డీఓ వద్ద అభ్యంతరాల స్వీకరణ, 23వ తేదీన అభ్యంతరాల పరిష్కారం, 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణగా షెడ్యూల్‌లో ప్రకటించారు. 29వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఎక్కడైనా 29వ తేదీన పోలింగ్ జరగకపోయినా, వాయిదా పడినా.. మరుసటి రోజు (30వ తేదీ) రీపోలింగ్ నిర్వహిస్తారు.
రెండో దశలో ఎన్నికలు జరిగే మండలాల్లోని పంచాయతీలు, వార్డులు, ఓటర్ల వివరాలు
సంఖ్య మండలం పంచాయతీలు వార్డులు పీఎస్‌లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
01 పాయకరావుపేట 24 264 264 39,674 40,177 -- 79,851
02 కోటవురట్ల 25 240 240 21,813 22,837 -- 44,650
03 నక్కపల్లి 33 326 326 32,869 33,337 -- 66,206
04 ఎస్.రాయవరం 28 290 290 29,944 32,086 2 62,032
05 ఎలమంచిలి 17 146 146 9,819 10,603 -- 20,422
06 రాంబిల్లి 26 236 236 17,257 18,262 -- 35,519
07 అచ్యుతాపురం 34 320 320 30,825 32,178 -- 63,003
08 మునగపాక 26 250 250 22,475 23,241 -- 45,716
మొత్తం 213 2072 2092 2,04,676 2,12,721 2 4,17,399