Share News

పంచాయతీ పోరుకు సై!

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:57 AM

గ్రామ పంచాయతీ ఎన్నికలకు మరికొద్ది గంటల్లో నగారా మోగడంతో పల్లెల్లో రాజకీయాలు మరోసారి వేడిక్కాయి. ఈ నెల మొదటి వారంలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటి ఘన విజయం సాధించడంతో మూడు పార్టీల శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. ఇదే ఊపులో గ్రామ పంచాయతీల ఎన్నికల్లో కూడా తిరుగులేని గెలుపును సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నాయి.

పంచాయతీ పోరుకు సై!

బలమైన అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీలు కసరత్తు

‘ప్రాదేశిక’ ఫలితాల తరహాలోనే పంచాయతీల్లోనూ సత్తా చాటాలని ప్రణాళిక

ఉనికి చాటుకోవాలని ప్రతిపక్ష వైసీపీ యత్నాలు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీ ఎన్నికలకు మరికొద్ది గంటల్లో నగారా మోగడంతో పల్లెల్లో రాజకీయాలు మరోసారి వేడిక్కాయి. ఈ నెల మొదటి వారంలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటి ఘన విజయం సాధించడంతో మూడు పార్టీల శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. ఇదే ఊపులో గ్రామ పంచాయతీల ఎన్నికల్లో కూడా తిరుగులేని గెలుపును సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగకపోయినప్పటికీ గ్రామ పరిపాలనలో అత్యంత కీలకమైన సర్పంచ్‌ పదవులను చేజిక్కించుకొని రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకోవాలని కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు పరిషత్‌ ఎన్నికల్లో దెబ్బతిన్నందున.. పంచాయతీ ఎన్నికల్లో ఈ తరహా చేదు ఫలితాలు రాకుండా చూసుకోవాలని ప్రతిపక్ష వైసీపీ శ్రేణులు పట్టుదలతో వున్నారు. దీంతో రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది.

పంచాయతీల్లో సామాజిక, ఆర్థిక, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని బలమైన అభ్యర్థులను సర్పంచ్‌ పదవులకు బరిలో దింపేందుకు కూటమి నాయకులు పంచాయతీల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కూటమి అధికారంలో వుండడం, గత వారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కూటమి మద్దతుతో సర్పంచులుగా పోటీ చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. అన్‌ రిజర్వుడ్‌ జనరల్‌, బీసీ జనరల్‌ పంచాయతీల్లో బరిలోకి దిగేందుకు ముగ్గురి నుంచి ఐదుగురు వరకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. రిజర్వేషన్లు, స్థానిక సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని గెలిచే అవకాశాలున్న అభ్యర్థులను బరిలో దించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే సమయంలో తమకు బలమైన పంచాయతీల్లో పోటీ లేకుండా ఏకగ్రీవం చేసేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇదిలావుండగా కూటమి స్థాయిలో కాకపోయినప్పటికీ ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందిన, స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఎంపీటీసీ స్థానాల పరిధిలోని పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు పోటీ చేసేందుకు పలువురు వైసీపీ నేతలు ముందుకు వస్తున్నట్టు చెబుతున్నారు. అన్ని విధాలా బలమైన అభ్యర్థులను నిలబెట్టి కూటమి మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నది.

Updated Date - Nov 13 , 2026 | 12:57 AM