ఖరీఫ్‌కు సన్నద్ధం
ABN , Publish Date - May 26 , 2026 | 12:53 AM
ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వివిధ పంటల సాగు లక్ష్యలను నిర్ణయించి, ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారో ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు.
దుక్కి పనులు ప్రారంభించిన రైతులు
విత్తనాలు సమకూర్చే పనుల్లో అధికారులు
పంటల సాగు లక్ష్యం 65,700 హెక్టార్లు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వివిధ పంటల సాగు లక్ష్యలను నిర్ణయించి, ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారో ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. మండలాలకు విత్తనాల కేటాయింపులు జరుపుతున్న అధికారులు తొలకరి వర్షాలు ప్రారంభం అయిన వెంటనే రైతులకు సరఫరా చేయడానికి ఆయా పంటలకు సంబంధించి 22,097 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో వుంచుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వివిధ రకాల పంటలు 65,700 వేల హెక్టార్లలో సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో దాదాపు 60 వేల హెక్టారుల్లో వరి పంట వుంటుంది. చెరకు 3,569 హెక్టార్లు, మొక్కజొన్న 622 హెక్టార్లు, జొన్న 73 హెక్టార్లు, రాగి 10 హెక్టార్లు, చిరుధాన్యాలు 41 హెక్టార్లు, కంది 65 హెక్టార్లు, పెసర 208 హెక్టార్లు, మినుము 189 హెక్టార్లు, ఉలవ 106 హెక్టార్లు, వేరుశనగ 57 హెక్టార్లు, నవ్వు 672 హెక్టార్లు, పత్తి 88 హెక్టార్లలో సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 50 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. ఈ ఏడాది 20 శాతం పెంచి... 60 వేల హెక్టారుల్లో సాగు చేయించాలని అధికారులు భావిస్తున్నారు. కాగా ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి దుక్కుల పనులు జోరుగా సాగుతున్నాయి. తొలకరి వర్షాలు కురిసిన వెంటనే పచ్చిరొట్ట విత్తనాలు చల్లడానికి పలువురు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.