చదవడం అదృష్టంగా భావించాలి
ABN , Publish Date - Feb 06 , 2026 | 01:00 AM
విద్యార్థులు చదువును బరువుగా భావించకుండా ప్రతీ ఒక్కరూ చదువుకోవడం అదృష్టంగా భావించాలని ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైతిక విలువలు) చాగంటి కోటేశ్వరరావు సూచించారు. మండలంలోని అడ్డరోడ్డు తిమ్మాపురంలోని శ్రీ ఆదర్శ పాఠశాల ప్రాంగణంలో హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విద్యా దీప్తి- సంస్కార స్ఫూర్తి కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.
- ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు
ఎస్.రాయవరం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువును బరువుగా భావించకుండా ప్రతీ ఒక్కరూ చదువుకోవడం అదృష్టంగా భావించాలని ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైతిక విలువలు) చాగంటి కోటేశ్వరరావు సూచించారు. మండలంలోని అడ్డరోడ్డు తిమ్మాపురంలోని శ్రీ ఆదర్శ పాఠశాల ప్రాంగణంలో హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విద్యా దీప్తి- సంస్కార స్ఫూర్తి కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ అమ్మ కంటే గొప్పవారు లోకంలో ఎవ్వరూ లేరని, తనను చూసినా చూడకపోయినా కూడా తన బిడ్డ బాగుండాలని కోరుకొనేది తల్లి మాత్రమే అంటూ తల్లి గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. మనిషి వృద్ధిలోకి రావాలంటే కష్టపడాలని, రాయి కూడా ఎన్నో ఉలి దెబ్బలు పడిన తరువాతే దేవాలయంలో విగ్రహం అవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలని, సమయం చాలా విలువైనదని, విద్యార్థులంతా దాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని హితవు పలికారు. అలాగే గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వాడకం వలన కలిగే నష్టాల గురించి వివరిస్తూ వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చారు. ప్రవచనం అనంతరం పలువురు అడిగిన ప్రశ్నలకు చాగంటి కోటేశ్వరరావు సమాధానాలు చెప్పి వారి సందేహాలను తీర్చారు. హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం ప్రత్యక్షంగా వినడమే కాకుండా తన ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి కోటేశ్వరరావు కార్యక్రమం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అంతేకాకుండా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల తరఫున కోటేశ్వరరావుకు అనిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కోటేశ్వరరావును హోం మంత్రి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్, వైస్ ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావు, మాజీ ఎంపీపీ యేజెర్ల వినోద్‌రాజు, టీడీపీ మండల అధ్యక్షుడు అమలకంటి అబద్దం, మాజీ అధ్యక్షుడు ఎన్.వెంకటరాజు, పాఠశాల కరస్పాండెంట్ ఎన్. సీతారామరాజు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి అల్లు నరసింహమూర్తి, పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి గుర్రం రామకృష్ణ, నాయకులు సమ్మెంగి భీమా, గణేశ్, వాసు, విద్యాశాఖాధికారులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.