పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఆర్‌డీవో విచారణ
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:15 AM
జిల్లాలోని పెదబయలు మండలం మారుమూల ఇంజెరి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల దుర్వినియోగంపై ఆర్‌డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావు బుధవారం విచారణ చేపట్టారు.
పాడేరు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పెదబయలు మండలం మారుమూల ఇంజెరి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల దుర్వినియోగంపై ఆర్‌డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావు బుధవారం విచారణ చేపట్టారు. ఇంజెరి పంచాయతీకి మంజూరైన నిధులు దుర్వినియోగం చేసినట్టు ఇటీవల పలువురు ఇంజెరి వాసులు కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్ దినేశ్‌కుమార్.. ఆర్‌డీవో లోకేశ్వరరావును ఆదేశించారు. ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఆర్‌డీవో పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టారు. 2022 నుంచి 2024 వరకు మంజూరైన నిధులు, వ్యయం చేసిన నిధులకు సంబంధించిన రికార్డులు, పలు అభివృద్ధి పనులు చేసిన ఎం.బుక్‌లు అందుబాటులో లేవని విచారణలో గుర్తించారు. ఈ క్రమంలో ఇంజెరి పంచాయతీకి ప్రభుత్వం నుంచి విడుదలైన మొత్తం నిధులకు సంబంధించిన రికార్డులను తమకు సమర్పించాలని, అప్పట్లో పనులు చేపట్టిన ఇంజనీర్లు సైతం తదుపరి విచారణకు హాజరుకావాలని ఆర్‌డీవో ఆదేశించారు. పంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగినట్లుగా నిర్ధారణ అయితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆర్‌డీవో హెచ్చరించారు.